ఇంటి నుంచి సంతోషంగా పనిచేసుకొంటున్న నెధెర్లాండ్స్ యువతి
బురుజు.కాం Buruju.com : ఇంటి నుంచి పని చేయటం ఉద్యోగుల హక్కుగా మారే పరిస్థితులు త్వరలో వివిధ దేశాల్లో రానున్నాయి. ఎగువ సభ ఆమోద ముద్ర కూడా పడితే.. నెధెర్లాండ్స్ దేశంలో ఇటువంటి చట్టం 2023, జనవరి1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకా.. ఐర్లాండ్, స్లోవేనియా వంటి మరికొన్ని దేశాల ప్రభుత్వాలూ ప్రస్తుతం ఇటువంటి చట్టాలు గురించి చర్చిస్తున్నాయి. తాజా సర్వేల ప్రకారం.. మన దేశంలోనూ 54 శాతం నుంచి 64 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటానికే మొగ్గు చూపిస్తున్నారు. అందువల్ల.. ఇతర దేశాల ప్రభావం మన దేశంపైనా పడవచ్చు. అంతేకాకుండా.. ఇంటి నుంచి పనిచేసుకొనేందుకు చట్టాలను తెచ్చే దేశాల కంపెనీల్లో పనిచేసేవారు.. ఆయా దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండొచ్చు.
మన దేశంలో ఇంటి నుంచి పనిచేసేటప్పుడు ఇంటిలోని దృశ్యాలు ఇలా ఉంటున్నాయి
ప్రపంచంలో ఉద్యోగులకు అనుకూలంగా చట్టాలను అమలు చేసే దేశంగా నెధెర్లాండ్స్ ఇప్పటికే పేరు పడింది. ఉద్యోగి తన పని గంటలను, పనిచేసే ప్రాంతాన్ని మార్చాలని కోరే హక్కును కల్పిస్తున్న చట్టం 2015లోనే అక్కడ ఆచరణలోకి వచ్చింది. కరోనా కాలంలో ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి సమర్ధంగా విధులను నిర్వహించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ చట్టానికి మరిన్ని సవరణలను తెస్తూ రూపొందించిన బిల్లును అక్కడి పార్లమెంటు దిగువ సభ 2022, జూలై 5వ తేదీన ఆమోదించింది. ఎగువ సభలో త్వరలో అది చర్చకు రానుంది. అక్కడా ఆమోదముద్ర పడితే 2023, జనవరి నుంచి ఉద్యోగులకు మరిన్ని హక్కులు లభిస్తాయి.
ఆఫీసులకు వెళ్లటం ఉండదు కనుక ఇటువంటి వాతావరణం మాత్రం దూరమవుతుంది
నూతన సవరణల ప్రకారం.. ఒక కంపెనీలోని 10, అంతకు మించిన సంఖ్యలోని ఉద్యోగులు తాము పలానా తేదీ నుంచి ఇళ్ల వద్ద work from home నుంచి పని చేయదలచుకొన్నట్టుగా పేర్కొని .. ఆ తేదీకి రెండు నెలల ముందుగా తమ యాజమాన్యానికి దరఖాస్తును అందజేయాలి. ఆ తేదీకి నెల రోజుల ముందుగా యాజమాన్యం తన నిర్ణయాన్ని తెలపాలి. ఒక వేళ అలా తెలపకపోతే ఉద్యోగి విన్నపానికి ఆమోదముద్ర పడినట్టే. అంటే.. ఉద్యోగి తనకు ఇష్టమైన ప్రాంతం నుంచి పనిచేసుకోవచ్చు. యాజమాన్యం కనుక చట్టంలో నిర్ధేశించిన నెల రోజుల గడువులోగా ఉద్యోగి అభ్యర్ధనను తిరస్కరించినట్లైతే.. అప్పటి నుంచి మరో ఏడాది తర్వాత మాత్రమే ఆయా ఉద్యోగులు తిరిగి దరఖాస్తులను అందజేయాలి. నెదెర్లాండ్స్ లో కాకుండా ఇతర దేశాల నుంచి పనిచేయదలచుకొంటే పన్నులు, సామాజిక బధ్రత, కార్మిక చట్టం వర్తింపు వంటి అంశాలు ఉత్పన్నమవుతాయి కనుక వాటికి అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయి. ఇంటి నుంచి పనిచేసేటప్పుడూ.. పని గంటలు, పనివేళల మార్పులనూ కోరే హక్కు ఉద్యోగులకు ఉంటుంది. దరఖాస్తులను అందజేసే సమయానికి ఆయా ఉద్యోగులకు కనీసం 26 వారాల సర్వీసు పూర్తై ఉండాలి. నెధెర్లాండ్స్ చట్టంలో.. ఉద్యోగి, యాజమాని ప్రయోజనాలు సమతూకంతో ఉంటాయని అక్కడ అధికారులు పేర్కొంటున్నారు.