హైదరాబాదులో మార్చి 6వ తేదీన నిర్వహించిన ప్రభుత్వ పింఛనుదారుల జేఏసీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, సమావేశంలో ఇతర ప్రతినిధులు
బురుజు.కాం Buruju.com : తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించిన సిఫార్సులు చేసేందుకు రెండో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర పింఛనుదారుల సంఘాల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బకాయి ఉన్న మూడు కరవు భత్యాలను (డీఏ, డీఆర్ లు) మంజూరు చేయాలని కోరింది. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరక్టరేటును ఏర్పాటు చేసి సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లోను పెన్షనర్లకు నగదు రహిత చికిత్స ప్రక్రియను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, దీని కోసం మూల పింఛనులోని 0.5 శాతాన్ని తమ వాటాగా ప్రతి నెలా చెల్లించేందుకు పింఛనుదారులంతా సిద్ధంగా ఉన్నారని జేఏసీ పునరుద్ఘాటించింది.
ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అందజేసేందుకు తయారు చేసిన వినతి పత్రం
తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువు 2023, జూన్ నెలాఖరుతో ముగిసిపోతుంది. ఇదే ఏడాది జూలై 1వ తేదీ నుంచి రెండో పీఆర్సీ సిఫార్సులు అమల్లోకి రావాల్సివుంటుంది. ఇదంతా జరగాలంటే ఇప్పటికే పీర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండాలి. ఇంతవరకు అటువంటి కసరత్తు ఏదీ ప్రభుత్వం చేపట్టకపోవటంతో తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) ఇదే విషయంపై ప్రభుత్వానికి తాజాగా విజప్తి చేసింది. జేఏసీ ప్రత్యేక కోర్ కమిటీ మార్చి 6వ తేదీన హైదరాబాదులోని వనస్థలిపురంలో గల కార్యాలయంలో భేటీ అయ్యి.. వివిధ అంశాలపై చర్చించింది.
పెరుగుతున్న ధరలకు ధీటుగా ఏటా రెండు సార్లు అందాల్సిన డీఏ, డీఆర్ ల కోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది
తెలంగాణ వ్యాప్తంగా గల 2.68 లక్షల మంది పింఛనుదారులకు చెందిన పలు సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న విషయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసి తెలియజేయాలని సమావేశం తీర్మానించింది. ఇదే సమయంలో రెండో పీఆర్సీ ఏర్పాటు, డీఏ, డీఆర్ ల ( 2022, జనవరి, జూలై, 2023 జనవరి) మంజూరీపైన వినతి పత్రాలను అందజేయాలని నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య అధ్యక్షత వహించిన ఈ భేటీలో సెక్రటరీ జనరల్ శుభాకర్ రావు, కో-చైర్మన్ కృష్ణ మూర్తి, రాజేంద్రబాబు, సభ్యులు నర్సింగరావు, తులసి సత్యనారాయణ, ప్రసాద్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలచిన మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ‘‘ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల విశ్రాంత బోధకులు, జీహెచ్ఎంసీ, ఎయిడెడ్ సంస్థల పెన్షనర్లకూ వర్తింపజేయాలి. వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు బాధ్యతలను సంబంధిత ఖజానా, పింఛను చెల్లింపు అధికారులకు అప్పగించాలి. పెన్షనర్ల భవన్ నిర్మాణం కోసం హైదరాబాదులో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలి. పింఛనుదారుల కమ్యుటేషన్ విలువను తిరిగి చెల్లించే వ్యవధిని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలి. ప్రతి జిల్లాలోను కనీసం రెండేసి వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యులను, తగినన్ని మందులను అందుబాటులో ఉంచాలి. తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రత్యేక ఇంక్రిమెంటును పింఛనుదారులకు కూడా తెలంగాణ ఇన్సెంటివ్ పేర మంజూరు చేసి వారి ఉద్యమ స్పూర్తిని గుర్తించాలి’’ అని ఆర్థిక మంత్రికి జేేఏసీ విజ్ఞప్తి చేయదలచింది.