ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
personBuruju Editor date_range2022-07-21
ఏసీబీ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావుపై పోలీసు అధికారి కరణం సత్యనారాయణ రాసిన పుస్తకం ముఖచిత్రం
పిళ్లా సాయికుమార్: Buruju.com( విజయనగరంలో 1988లో మృతి చెందిన నిజాయితీ పరుడైన ఏసీబీ ఇనస్పెక్టర్ మోటూరు శ్రీనివాసరావుది ఆత్మహత్య అని నాటి ఎన్టీఆర్ సర్కారు ప్రకటించినప్పటికీ.. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఆయనది హత్యేనని ఇప్పటికీ భావిస్తారు. శ్రీనివాసరావుకు అప్పట్లో ప్రజలు ‘టెర్రర్ ఎస్ ఐ, దేవుడు శ్రీను, కొండవీటి సింహం’ వంటి బిరుదులతో ఆప్యాయంగా పిలుచుకొన్నారు. ఆటువంటి ఇనస్పెక్టరు జీవితం ప్రస్తుత పోలీసు శాఖకు ఎంతో స్పూర్తిదాయకం. ఆయన మరణ రహస్యం తదితర అంశాలపై బురుజు.కాం ఇస్తున్న కథనాల్లో ఇది మూడోవది) ఏసీబీ ఇనస్పెక్టరు శ్రీనివాసరావు మరణించిన ఏడాదికి అప్పటి హోంశాఖ మంత్రి మాధవరెడ్డి విజయనగరం పోలీసు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ‘ఈనాడు’ విజయనగరం జిల్లా ప్రతినిధిగా ఉన్న నేను.. శ్రీనివాసరావు అనుమానాస్పద మృతి గురించి అడిగాను. ఒక నిజాయితీపరుడైన అధికారి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేసి.. వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. అయినా కేసులో పురోగతి కనిపించలేదు.
కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయకుండా నానుస్తూ వచ్చారు
పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు విజయనగరం, హైదరాబాదుల్లో సమావేశమయ్యి కేసు దర్యాప్తు బాధ్యతలను వేరే జోన్ అధికారులకు అప్పగించాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. పోలీస్ సిబ్బంది చందాలు వేసుకొని ఆయన కుటుంబానికి కొంత ఆర్థిక సాయన్ని అందజేశారు. మృతి విషయం శాసన సభకు వెళ్ళటమూ ఒక ప్రహసనంగానే కొనసాగింది. ఎందువల్ల నంటే.. అప్పట్లో ఎన్టీఆర్ సారధ్యంలో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. శ్రీనివాసరావు కేసు నమోదు చేసిన ఐఏఎస్ అధికారి శర్మారావు.. అప్పటికి దాదాపు నాలుగేళ్లగా విజయనగరం జిల్లా కలెక్టరుగా పనిచేస్తూ.. అధికార పార్టీకి విధేయుడిగా ఉంటారనే పేరు పొందారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనపై దాడిచేసిన ఏసీబీ ఇనస్పెక్టరుపై శాసన సభలో ప్రశ్నించటమంటే సాహసం చేయటమే. ప్రస్తుతం బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉన్న శంబంగి చిన అప్పల నాయుడు అప్పట్లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండేవారు. నేను ఆయన్ని కలసి శ్రీనివాసరావుపై శాసన సభలో అడగవలసిందిగా అభ్యర్ధించటంతో అందుకు అంగీకరించారు. ఆయన ప్రశ్న సభలో చర్చకు వచ్చినప్పుడు అప్పటికి ఎమ్మెల్యేలుగా ఉన్న ఎర్రంనాయుడు, గౌతు శ్యామసుందర శివాజి కూడా మాట్లాడారు. శ్రీనివాసరావు ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు.
శ్రీనివాసరావుది హత్య, ఆత్మ హత్య కాకుండా ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయారని కేసును ముగించేందుకూ ప్రయత్నాలు జరిగాయి
ఏసీబీ ఇనస్పెక్టరు శ్రీనివాసరావు మృత దేహాన్ని 1988, జూన్ 26వ తేదీన విజయనగరం పై వంతెన వద్ద గల రైలు పట్టాలుపై గుర్తించారు. ఆ మరుసటి రోజున విజయగరం కుమ్మరి వీధిలోని శ్మశాన వాటికలో నిర్వహించిన అంత్యక్రియలకు ఉత్తరాంధ్ర నుంచి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. మృత దేహంపై మొత్తం 22 గాయాలు ఉన్నట్టు పోస్టు మార్టంలో బయటపడింది. ఆయన వెన్నుముఖ, పక్కటెముకలు విరిగి పోయాయి. అవన్నీ రైలు ఈడ్చుకొని వెళ్లినప్పుడు ఏర్పడినవిగా రైల్వే పోలీసులు తేల్చారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆయనది ముమ్మాటికి హత్యేనని, ఆయన్ని ఎక్కడో హత్య చేసి శవాన్ని తెచ్చి రైలు పట్టాలపై పడేశారని వాపోతూ వచ్చారు. ఆయన మృతి అనంతరం ముఖ్యమైన పత్రాలు గల ఒక బ్రీఫ్ కేసు అదృశ్యమయ్యిందని అప్పట్లో నేను వెల్లడించాను. దీనిపై దర్యాప్తు అంటూ ఎవరూ చేయనేలేదు. కలెక్టరుపై దాడి కేసు .. ఆ తర్వాత కొంత కాలానికి నీరుగారి పోయింది. అప్పట్లో శ్రీనివాసరావు.. పైపులైన్ల కుంభకోణంలో విజయనగరం మున్సిపల్ కమిషనరును, అతని సోదరుడిని కూడా పట్టుకొన్నారు. శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు 25 కి.మీటర్ల దూరంలోని రామివలస కొత్తూరులో 1944లో జన్మించి 1968లో పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరారు.
పొలీసు శాఖకు చెందిన దిగవస్థాయి సిబ్బంది సైతం ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాసరావు మరణ రహస్యం బయటపడలేదు
శ్రీనివాసరావు జీవితం కొందరు యువ పోలీస్ అధికారులకు ప్రేరణ ఇవ్వగా.. వారిలో కరణం సత్యనారాయణ అనే యువ ఎస్.ఐకి మాత్రం ఆయనపై ఒక పుస్తకాన్నే రాసేలా పురిగొల్పింది. విశాఖ రేంజిలో 2002లో సత్యనారాయణ.. . సర్కిల్ ఇనస్పెక్టరుగా పనిచేస్తున్న సమయంలో శ్రీనివాసరావుపై ‘ సమిధ’ పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు.. నేను అప్పట్లో రాసిన కథనాల్లోని కొన్ని అంశాలనూ దీనిలో పొందుపర్చారు. అప్పటికి సీబీసీఐడీ ఐజీగా ఉన్న ఎంవీ కృష్ణారావు .. ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు మరణం తనకు ఒక పజిల్ గానే మిగిలిందని వ్యాఖ్యానించినట్టు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన పలు అంశాలను సత్యనారాయణ బాగా వివరించారు. ఎంతో మంది పోలీసు అధికారులు తమ విధులను నిర్వర్తించి కనుమరుగై పోతుంటారు. వారిలో శ్రీనివాసరావు మాదిరిగా గుర్తుపెట్టుకొనేవారు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనైనా ఉండరు. నివాసరావు మృతి చెందినప్పుడే కాదు.. మృతి చెంది ఏడాది అయిన సందర్భాన్ని పురస్కరించుకొని కూడా విజయనగరం ప్రజలు పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించి నిజాయితీపరుడి పట్ల గల తమ ప్రేమానురాగాలను చాటుకొన్నారు. ఏ ఒక్క పోలీసు అధికారికి ఇలా ఏడాది తర్వాతా ప్రదర్శనలు నిర్వహించిన దాఖలాలు ఇంతవరకు లేనేలేవు.