భాజపాను అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పెట్టుకొన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఇప్పుడు మునుగోడు ఒక అగ్నిపరీక్షే
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో త్వరలోనే మళ్లీ ఎన్నికల వేడి రాజకోబోతోంది. నల్గొండ జిల్లా మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేస్తుండటంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల రెడ్డి.. ఉప ఎన్నికల్లో భాజపా తరపున తలపడనున్నారు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి బలపడేందుకు భాజపాకు ఈ ఉప ఎన్నికలో గెలుపు చాలా ముఖ్యం. అదే సమయంలో.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస)కి ఇక్కడి గెలుపు అత్యంత కీలకమవుతుంది. అలా కాకుంటే.. పార్టీ బలహీనపడుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లినట్లవుతుంది. ప్రస్తుతం మునుగోడు స్థానం కాంగ్రెస్ పార్టీకి చెందినది. ఉప ఎన్నికలో కనుక ఓటమి చెందితే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా పడుతుంది. భాజపా, తెరాస పార్టీలు కనుక ఓటమి చెందితే ఆ స్థానం కాంగ్రెస్ పార్టీదే కాని తమది కాదు కదా? అని రాజకీయ విమర్శకుల బారి నుంచి కొంత మేరకు తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు అటువంటి వెసులుబాటు ఉండదు. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీలకు మునుగోడులో విజయం ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకం కాబోతోంది. అన్ని పార్టీలు ఇక్కడ సర్వశక్తులు ఒడ్డుతాయి.
తెలంగాణ రాష్ట్ర సమితికి మునుగోడు ప్రతిష్ఠాత్మకం కాబోతోంది
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి 2021, నవంబరు నెలలో నిర్వహించిన ఉప ఎన్నికలో గెలుపు తర్వాత భాజపా ఉత్సాహం రెట్టింపయ్యింది. అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నికలోను, హైదరాబాదు నగరపాలక సంస్థలోని పలు కార్పోరేటర్ స్థానాల్లోను విజయం సాధించటంతో.. 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించగలమనే విశ్వాసం ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ఇప్పుడు కనుక మునుగోడులో విజయాన్ని సాధిస్తే ఇక కేంద్రంలోని అగ్రశ్రేణి నాయకత్వం తెలంగాణపై మరింత దృష్టి సారిస్తుంది. మెజార్టీ అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవటమే లక్ష్యంగా దిల్లీ నాయకత్వం అనేక వ్యూహాలను అమల్లోకి తెస్తుంది. ఇందులో భాగంగానే.. ప్రస్తుతం పార్టీలో చేరికలకు తెరతీసి.. కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డిని తీసుకెళ్లింది. మునుగోడు ఉప ఎన్నిక తేదీ సమీపించేనాటికి మరింత మందిని పార్టీలోకి తీసుకొస్తుంది. బలమైన నాయకుడు పార్టీ మారినప్పుడు ప్రజల చూపు సహజంగానే ఆయా పార్టీలవైపు మళ్లి అది చర్చకు దారితీస్తుంది. ఇటువంటి కారణంగానే అన్ని పార్టీలు.. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు చేరికలను ప్రోత్సహిస్తుంటాయి.
సిటింగ్ స్థానాన్ని నిలుపుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందున్న సవాల్
అధికార పార్టీ నాయకులు నిత్యం కేంద్రంలోని మోదీ పాలనను విమర్శించట ద్వారా భాజపా వల్ల తెలంగాణకు నష్టమే తప్ప లాభం ఏమీ ఉండబోదని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు ఐటీ పరిశ్రమలకు సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేయబోవటం లేదని స్పష్టం కావటంతో మంత్రి కేటీఆర్ .. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు శనిలా దాపురించిందని ఆయన వ్యాక్యానించారు. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు మరో కోణంలో రాజకీయాలను తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఇతర రాష్ట్రాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే భాజపా వంటి పార్టీల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను దిల్లీలో కలసినప్పుడు అభిప్రాయపడినట్టు వార్తలోచ్చాయి. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల వారికి చెమటలు పట్టించటం ఖాయం.