అన్నమయ్య కీర్తనల్లోని ‘గుబ్బల గుట్ట’.. ఇక అంతర్ధానం కావాల్సిందేనా?
personBuruju Editor date_range2023-03-06
వాగ్గేయకారుడు అన్నమయ్య
బురుజు.కాం Buruju.com : వందల సంవత్సరాల కిత్రం కవులు తమ కావ్యాల్లో వర్ణించిన కొండలు సైతం ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి. బౌద్ధ బిక్షువులు నివసించిన విశాఖ సమీపంలోని రుషికొండ ప్రస్తుతం పిండైపోతుండగా.. విజయవాడ గ్రామీణ మండలం పాతపాడు వద్ద గల గుబ్బల గుట్ట Gubbala gutta సైతం త్వరలో అంతర్ధానం కాబోతోంది. గుబ్బల గుట్టను బాంబులతో పేల్చివేసి.. ఆ ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వం పంచి పెడుతుందని వార్తలు వెలువడుతున్నాయి. వాగ్గేయకారుడు అన్నమయ్య కీర్తనల్లో గుబ్బలగుట్ట వర్ణన కనిపిస్తుంది. గుబ్బల అంటే.. వక్షోజాలు. ప్రాచీన ప్రముఖ కవులంతా తమ కావ్యాల్లో గుబ్బల పదాన్ని విరివిగా ప్రస్తావించటం విశేషం.
ఎన్టీఆర్ జిల్లా పాతపాడు వద్ద గల గుబ్బలగుట్ట ఇదే. ఇప్పటికే తవ్వకాలు మొదలయ్యాయి
విజయవాడకు దగ్గరలోని పాతపాడులో పోలవరం కాలువ పక్కన కనిపించే గుబ్బలగుట్ట .. పర్యావరణ ప్రేమికులను ముగ్ధులను చేస్తూఉంటుంది. సెలవు రోజుల్లో పలువురు యువతీయువకులు ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వెళ్తుంటారు. దాదాపు 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలోని కొంత భాగాన్ని ఇప్పటికే తవ్వేయగా.. మిగతా గుట్టనంతా చదును చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఆయా కొండలకు గల పేర్లను బట్టైనా కొన్నింటి జోలికి ప్రభుత్వం వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను యోచించాలని పరిశీకులు చెబుతున్నారు. ‘బురుజు’ అధ్యయనం ప్రకారం.. అన్నమయ్య సంకీర్తనలో గుబ్బల గుట్ట ప్రస్తావన ఉంది. తనకు తెలిసిన గుట్టలను, కనుమలను ఒక సంకీర్తనలో ప్రస్తావిస్తూ.. వాటిని తాను ఆరాధించే వెంకటేశ్వరుడి అర్ధాంగి అవయవాలుగా అన్నమయ్య వర్ణించాడు. ఇలా రాసిన పాదాల్లో ఒక చోట ‘‘ పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండ కనుమ’’ అని పేర్కొన్నాడు. వదనాన్ని సోమశిల కనుమలతోను, పిరుదులను గద్దెరాతి కనుమతోను, కెమ్మోవిని ఎర్రశిల కనుమలతోను, గుబ్బలను (వక్షోజాలను) గుబ్బలకొండ కనుమతోను అన్నమయ్య పోల్చాడు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోర్సవారి గూడెం అటవీ ప్రాంతంలో గుబ్బల గంగమ్మ ఆలయం
పరిశోధకులు అధ్యయయాన్ని కనుక చేపడితే తెలుగు నేలపై ప్రాచీన గుబ్బలకు సంబంధించిన విలువైన చాలా సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అటవీ ప్రాంతాలతో పాటు కొన్ని మైదాన ప్రాంతాల్లోను గుబ్బల మంగమ్మ ఆలయాలు నెలకొని ఉన్నాయి. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో గుబ్బల గుట్ట తాండా ఒకటి ఉంది. ప్రాచీన కవులైన చేమకూర వెంకటకవి, అయ్యలరాజు నారాయణమాత్యుడు, క్షేత్రయ్య, వినుకొండ వల్లభరాయుడు, శ్రీనాధుడు వంటి కవులెందరో ‘గుబ్బల’ పదాన్ని తమ రచనల్లో విరివిగా ఉపయోగించారు. ‘గుబ్బల’.. తెలుగు నేలపై కొందరికి ఇంటిపేరుగాను మారింది.