బురుజు.కాం Buruju.com : సామాన్యుడికి అండగా ఉండాల్సిన వ్యవస్థలు గాడి తప్పి స్వార్ధంతో వ్యవహరిస్తున్నాయి. అన్యాయాలను ప్రశ్నించే కొద్దిపాటి గళాలను పాలకులు పొలీసు ఉక్కుపాదాలతో అణచివేయిస్తున్నారు. ఇటువంటి సమయంలో.. సామాన్యులకు ఇక అండగా ఉండాల్సింది న్యాయవాదులు, న్యాయ స్థానాలే. న్యాయవాదులు కొంత పరిశోధన చేసి వాదించ గలిగితే కేసులు ఎటువంటి మలుపు తిరుగుతాయో ‘ జై భీం’, ‘వకీల్ సాబ్ ’ వంటి చిత్రాలు తెలియజేశాయి. ఇటువంటి కోవకు చెందిన మరో చిత్రమే.. ‘జన’ (Jana). సినిమాను చూస్తుంటే ప్రస్తుత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు సంఘటనలు ప్రేక్షకుడి మదిలో తచ్చాడతాయి. రాజకీయనాయకుల అడుగులకు మడుగులొత్తితే భవిష్యత్తు పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయో చిత్రం చూస్తే తెలుస్తుంది. మలయాళంలో జనగణమన పేరుతో విడుదలయ్యి విజయాన్ని అందుకొన్న ఈ సినిమా.. తెలుగు డబ్బింగులో మాత్రం జన పేరుతో వెలువడింది. ప్రస్తుతం ఇది నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది.
ఇటువంటి న్యాయవాదుల అవసరం ఎప్పుడు ఎంతైనా ఉంది
సభా మరియం అనే ఒక ప్రొఫెసరును దుండగులు కారుతో ఢీకొట్టి హతమార్చి మృతదేహాన్ని దహనం చేస్తారు. ఆమె అత్యాచారానికి గురైందంటూ పత్రికలు పతాక శీర్షికల్లో రాస్తాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవే కథనాలు వెలువడుతుంటాయి. మరో వైపు.. నిందితులను అరెస్టు చేయకుండా కేసును నానుస్తున్నారంటూ విద్యార్దులు ఆందోళనలు చేస్తుంటారు. ఇటువంటి సమయంలో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి సజ్జన్.. నలుగురు యువకులను పట్టుకొని వారిని కాల్చిచంపి.. ఎదురు కాల్పుల్లో చనిపోయినట్టుగా ప్రకటిస్తాడు. పోలీసులు బాగా పనిచేశారంటూ విద్యార్దులు మిఠాయిలు పంచుకొంటారు. ఎలక్ట్రానిక్ మీడియా యావత్తు పోలీసుల చర్యలను ప్రశంసలతో ముంచెత్తుతుంటాయి. కేసు మానవ హక్కుల సంఘం వరకు వెళ్లటంతో అది కోర్టులో విచారణకు వస్తుంది. ఇటువంటి సమయంలో.. అరవింద్ స్వామినాథన్ అనే న్యాయవాది రంగ ప్రవేశం చేసి ఒక్కో చిక్కుముడిని విప్పుకొంటూ వెళ్తుంటే వ్యవస్థలోని లోపాలన్నీ బట్టబయలవుతుంటాయి.
మలయాళం, కన్నడ భాషల్లో సినిమా పేరు జనగణమన.. తెలుగులో మాత్రం ‘జన’
ప్రొఫెసర్ సభాను ఒకరు కారుతో తొక్కించి హతమార్చగా.. ఆ ప్రాంత రాజకీయనాయకుడు పోలీస్ అధికారి అండదండలతో ఆ శవాన్ని దహనం చేయించి, ఆ తర్వాత అలా దహనం చేసిన నలుగురిని కాల్చిచంపిస్తాడు. విద్యార్దుల్లో అలజడి తీవ్రతరమయ్యేలా అతనే పావులు కదుపుతాడు. ఇదంతా ఎందుకంటే.. నేరం చేసిన వారి పట్ల పాలకపక్షం బ్రహ్మండంగా వ్యవహరించిందని ప్రజలు భావించి, ఎన్నికల్లో ఆ రాజకీయనాకుడిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని. సినిమాలో ఎక్కవ భాగం కోర్టు హాలులోని వాదనలతోనే కొనసాగుతుంది. న్యాయవాది అరవింద్.. మీడియా, విద్య, రాజకీయ, పొలీసు తదితర అన్ని వ్యవస్థలను తప్పు చేస్తున్నట్టుగా నిరూపిస్తాడు. సంచలనాల కోసం మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నిజాలుగా నమ్ముతూ.. వాటికి అనుగుణంగా ప్రజలు స్పందించే తీరును ఆయన ఎండగడతాడు. ప్రజల తాత్కాలిక భావోద్వేకాలతో చేసే డిమాండ్లను అనుసరించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే.. భవిష్యత్తులో అదే చట్టం ముందు దోషులుగా నిలబడాల్సివస్తుందని, రాజకీయ నాయకుల వద్ద తలవంచితే తిరిగి అదే నాయకుల చేతిల్లో బలికావాల్సిన దుస్థితీ ఏర్పడుతుందని జన సినిమాలో చక్కగా చూపించారు.
సినిమాలో ప్రతి పాత్ర నిత్యం మనం చవిచూసే సన్నివేశాలను గుర్తుకు తెచ్చేవిలా ఉంటాయి
అరవింద్ ను చివరి వరకు న్యాయవాదిగానే చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా.. ఆయన గతంలో ఒక పోలీస్ అధికారని, ఆయన చేపట్టిన కొన్ని కేసుల కారణంగా భార్యను సైతం కోల్పోయి అవిటివాడు కావాల్సివచ్చిందని వంటి నేపథ్యాన్ని సినిమా నిడివిని పెంచటానికి చూపించి ఉండొచ్చని అనిపిస్తుంది. మొత్తం మీద ఇటీవల వస్తున్న కోర్టుల్లోని వాదోపవాదాల చిత్రాలు.. సమాజంలో న్యాయవాదుల ప్రాధాన్యత ఇప్పుడు ఎలా పెరుగుతున్నదీ తెలియజెప్పుతున్నాయి. ఇటువంటి సినిమాలను ప్రజలూ ఆదరిస్తున్నారు. న్యాయవాదులు కేవలం డబ్బు కోసమే కాకుండా జై భీం సినిమాలో చూపించినట్టుగా జస్టీస్ కె.చంద్రు గాను వ్యవహరించగలగాలి. అప్పుడే పేదలకు న్యాయం లభించగలుగుతుంది. అటువంటి న్యాయవాదుల కొరత ఉన్నప్పుడు.. ‘‘చట్టం తన పనిని తాను చేసుకెళ్తుంది’’ వంటి రాజకీయ నాయకుల ఊకదంపుడు మాటలతోనే పేదలు ఊరట చెందాల్సిన పరిస్థితి కొనసాగుతుంది.