తెలంగాణలో కస్తూర్బా విద్యాలయాల సంఖ్య ఘనం.. సిబ్బంది వేతనాలు మాత్రం హీనం
personBuruju Editor date_range2023-03-05
తెలంగాణలోని కస్తుర్బా విద్యాలయంలో బాలికల ప్రార్ధనా కార్యక్రమం
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) సంఖ్య అధికంగా ఉండగా.. వాటిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి వేతనాలు, ఇతర సదుపాయాలు మాత్రం కడు హీనంగా ఉన్నాయి. వీటిలోని కుక్, స్వీపర్, అటెండరు తదితరులు నిర్విరామంగా శ్రమించటమే తప్ప కనీసం రూ.10వేలకు మించి వేతనాన్నైనా అందుకోలేకపోతున్నారు. ఇక్కడ చేసే పనులను పరిగణనలోకి తీసుకొని రూ.26వేలను కనీస వేతనంగా ఇస్తూ ఇతర సదుపాయాలనూ సమకూర్చాలని కస్తూర్బా విద్యాలయాల బోధనేతర సిబ్బంది, కార్మికుల సంఘం ప్రభుత్వానికి తాజాగా విజ్ఞప్తి చేసింది. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకూ సిద్దపడాలని సంఘం నిర్ణయించింది.
హైదరాబాదులో మార్చి 5వ తేదీన నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సంఘ ప్రధాన కార్యదర్శి కాసు మాధవి. కూర్చున్నవారిలో సీఐటీయూ నాయకులు వంగురు రాములు, జి.సాయిలు ఉన్నారు
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు వర్గాలకు చెందిన బాలికలకు 6వ తరగతి మొదలు కొని ఇంటర్ వరకు మంచి చదువును అందజేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినవే కస్తూర్బా విద్యాలయాలు. ఇవి దేశం మొత్తం మీద 4,982 ఉండగా వాటిలో 696 ( 15 శాతం) తెలంగాణలోనే ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణలోనే వీటి సంఖ్య ఎక్కువ. ఇంకా కొత్తవీ మంజూరవుతూనే ఉన్నాయి. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్పరంలో దేశం మొత్తం మీద నెలకొల్పదలచిన 31 కేజీబీవీల్లోను 20 విద్యాలయాలు తెలంగాణాకే వస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీటిలో పని చేస్తున్న దాదాపు 5వేల పైచిలుకు బోధనేతర సిబ్బంది మాత్రం నిత్యం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది.
హైదరాబాదులోని సదస్సుకు హాజరైన కేజీబీవీ బోధనేతర ఉద్యోగులు
కస్తూర్బా విద్యాలయాల ప్రాంగణాలు తరగతి, వసతి గదులతో ఉంటాయి. ఇక్కడి బాలికల సంఖ్యకు ధీటుగా కుక్ లు, హెల్పర్లు ఉండరు. వంటతో పాటు వంట పాత్రలను మోసుకెళ్లటం వంటి పనులను సైతం కుక్ లు చేయకతప్పటంలేదు. కొన్ని విద్యాలయాల్లో 12వరకు వాష్ రూములు ఉంటే వాటన్నింటితో పాటు విద్యాలయ గదులు, ప్రాంగణమంతా నిత్యం శుభ్రపర్చటానికి చాలా చోట్ల ఒక స్వీపరు మాత్రమే కనిపిస్తుంటారు. పేరుకు అకౌటెంటే కాని బిల్లుల మంజూరు తదితర పనుల కోసం ఎక్కడకి వెళ్లినా ప్రయాణానికి సొంత పైకాన్ని ఖర్చుపెట్టుకోవాల్సిందే. ప్రతి రోజు విద్యాలయంలోకి ప్రవేశించేటప్పుడు సెల్ పోన్లను స్పెషల్ అధికారి (ఎస్.ఒ)కి అప్పగించాలనే విధానం ఒకటి ఇక్కడే అమల్లో ఉంది. ఇలా లోపలకు వచ్చిన వారు ఏదైనా అర్జెంటు పనిపై ప్రాంగణం బయటకు వెళ్దామంటే అంత సులువేంకాదు.
జనగాం జిల్లా దేవరుప్పల విద్యాలయంలో గత ఏడాది డిసెంబరులో బాలికలతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. అదే సందర్భంలో బోధనేతర సిబ్బందితోను మాట్లాడితే మరిన్ని సమస్యలు వెల్లడయ్యేవి
కస్తూర్బా విద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది సమస్యలపై కార్మిక నాయకురాలు కాసు మాధవి ఇటీవల అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాలపై మార్చి 5వ తేదీన హైదరాబాదులో ఒక సదస్సును నిర్వహించారు. ఇదే సమయంలో కొందరు ప్రతినిధులతో ఒక సంఘాన్నీ ఏర్పాటు చేశారు. కేంద్ర పథకాల్లోని కాంట్రాక్టు పనివారికీ సముచిత వేతనాలను ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినందున కస్తూర్బా విద్యాలయాల్లోని సిబ్బందికి రూ.26వేలను కనీస వేతనంగా ఇవ్వాలని సదస్సు కోరింది. సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యాలను, ఉద్యోగ భద్రతను కల్పించాలని, బస్ పాస్ లను , గుర్తింపు కార్డులను అందజేయాలని, బదిలీలకు అవకాశం కల్పిస్తూ అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలనూ అందుబాటులోకి తేవాలని సదస్సులో పాల్గొన్న వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సదస్సులో సంఘ ప్రధాన కార్యదర్శి కాసు మాధవితో పాటు సంఘ అధ్యక్షురాలు యాదరి లక్ష్మి, సీఐటీయూ నాయకులు వంగురు రాములు, జి.సాయిలు తదితరులు మాట్లాడారు.