తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి జ్ఞాపికను అందజేస్తున్న పింఛనుదారుల సంఘాల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య , ఇతర ప్రతినిధులు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని ప్రభుత్వ పింఛనుదారులకు government pensioners త్వరలో కొంత మేర అదనపు మొత్తాలు వారి ఖాతాల్లో జమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనాను సాకుగా చూపించి వారి పింఛనను ప్రభుత్వం ఎంత కాలమైతే జాప్యం చేసిందో అంత కాలానికి 6 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వ పింఛనుదారుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసి) ప్రభుత్వానికి విజప్తి చేసింది. వీరి అభ్యర్ధన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడితే రాష్ట్రంలోని 2లక్షల 68 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 6 శాతం వడ్డీని వెంటనే జమచేయాలంటూ సీఎస్ కు అందజేసిన వినతి పత్రం
కరోనా కారణంగా 2020లో లాక్ డౌన్ విధించటంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మందగించింది. తెలంగాణ ప్రభుత్వం.. పలు ఆర్థిక నియంత్రణ చర్యలతో పాటు ఉద్యోగుల జీతాలను, పింఛనుదారుల పింఛన్లను కుదించి వేసింది. వీరికి 2020, మార్చి నెల నుంచి కొంతకాలం పాటు 50 శాతం మేర మాత్రమే చెల్లిస్తామంటూ ఉత్తర్వులు ఇవ్వగా పింఛనుదారులు సుప్రీంకోర్టును, అక్కడి సూచనలతో ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వం కోత పెట్టిన మొత్తాలను మూడు విడతల్లో తిరిగి పొందగలిగారు. ఆంధ్రప్రదేశ్ లోను ఇటువంటి పరిస్థితే ఉండగా అక్కడి ఇద్దరు పింఛనుదారులు మాత్రం వ్యక్తిగతంగా అక్కడి హైకోర్టుకు వెళ్లి జాప్యమైన కాలానికి తమకు వడ్డీ రావాల్సివుంటుందని విన్నవించారు. అక్కడి హైకోర్టు సానుకూలంగా స్పందించి 12 శాతం మేర వడ్డీని ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో.. 12 శాతానికి బదులు 6 శాతం మేర వడ్డీని చెల్లించాలని తుది తీర్పు వెలువడింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలోని ఒక పుట ఇది
ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలోని పింఛనుదారులు అందరికీ 6 శాతం మేర వడ్డీని ఇవ్వాలంటూ ఇక్కడి పింఛనుదారుల సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య.. తెలంగాణ హైకోర్టుకు వెళ్లగా 2023, ఫిబ్రవరి 20వ తేదీన సానుకూల తీర్పు వెలువడి, ఫిబ్రవరి 28వ తేదీన తీర్పు కాపీ చేతికి అందింది. హైకోర్టు చెప్పినట్టుగా తమకు 6 శాతం మేర వడ్డిని వెంటనే జమచేయాలంటూ మార్చి 1వ తేదీన చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ టి.సుభాకర్ తదితర ప్రతినిధులు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారికి విజప్తి చేశారు. తీర్పు కాపీనీ ఆమెకు అందజేశారు. వారి వినతిని సీఎస్ శాంతికుమారి.. ఆర్థిక శాఖకు పంపటంతో ప్రస్తుతం అది ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే పింఛన్లకు కొన్ని రక్షణలు ఉండటంతో సాధారణంగానైతే దానిలో కోతలు పెట్టటం ప్రభుత్వానికి సాధ్యంకాదు. దీంతో వారి పింఛనను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2020లోనే ఒక ఆర్డినెన్సును తెచ్చి దాని ద్వారా తాను అనుకొన్నది చేసింది. ఆర్డినెన్సు ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదంతో చట్టంగా వచ్చింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించనప్పుడు పింఛన్లలో కోత పెట్టేందుకు చట్టమే అనుమతిస్తున్నప్పుడు ఇక జాప్యానికి వడ్డిని చెల్లించటం ఎలా సాధ్యమవుతుందంటూ ప్రభుత్వం కనుక తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తే మాత్రం వడ్డీ చెల్లింపులు కొంత కాలం ఆగవచ్చు. మొత్తం మీద ఏపీలో కేవలం ఇద్దరు పింఛనుదారులు మాత్రమే న్యాయపోరాటం చేసి అనుకూల ఉత్తర్వులు పొందగా.. తెలంగాణలోని పింఛనుదారుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య , ఇతర ప్రతినిధులు ఇక్కడి మొత్తం అందరి తరపున న్యాయపోరాటం చేసి విజయం సాధించటాన్ని పలువురు పింఛనుదారులు అభినందిస్తున్నారు. పింఛనుదారుల జేేేఏసీ తరపున హైకోర్టులో న్యాయవాది చైతన్య మిత్ర చిక్కుడు వాదించారు.