ఆనాడు ఎంతో మంది ఉద్యమకారులకు భగద్గీత స్పూర్తిని నింపింది
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత లక్ష్యం మారిపోతోంది. కేవలం అంతిమ సంస్కార సమయాల్లో మాత్రమే దానిలోని శ్లోకాలను వినాలనే వైఖరి ప్రభలుతోంది. దీంతో.. ఒకప్పుడు ఇంటింటా వినిపించిన ఘంటసాల భగవద్గీత ఇప్పుడు అంతర్ధానమైపోతోంది. గీత వినిపిస్తే చాలు.. ఏదో అంతిమ సంస్కార వాహనం వస్తోందని ప్రజలు భావించే దుస్థితి నెలకొంది. అంతా భగవద్గీతలోనే ఉందని గొప్పగా చెప్పే నాయకులంతా తక్షణం ఇటువంటి పోకడలను అరికట్టేందుకు నడుం బిగించాలి. భగవద్గీతను అంతిమ సంస్కారాల్లో వినిపించటాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవద్గీతను.. ఒక అమ్మలా మహాత్మాగాంధీ భావించేవారంటే దానికున్న శక్తిని గుర్తించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్.వి రమణ ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు.
‘‘ అనుమానం వెంటాడినప్పుడు.. నిరుత్సాహం అలుముకున్నప్పుడు , విశ్వాసంలో ఒక్క వెలుగు రేఖ కూడా కనిపించనప్పుడు భగవద్గీతలో నాకు సౌకర్యవంతమైన శ్లోకాన్ని చదివేవాడిని. మనస్సులో వెంటనే ఆనందం వికసించేది’’ అని గాంధీ పేర్కొన్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇటీవల ఒక సభలో తెలిపారు.
వృద్ధాప్యం వచ్చినవారు దైవాన్ని స్మరించుకొంటూ ఉంటే చివరి దశలో హాయిగా దేహాన్ని విడిచిపెట్టేయవచ్చనేది పెద్దల ఉవాచ. అటువంటి సమయంలో భగవద్గీతను వినాలని వారు చెబుతారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మృత దేహం వద్ద ఘంటశాల శ్లోకాలను పెడుతున్నారు. మృత దేహం ఆ శ్లోకాలను ఎలాగు వినదు. అక్కడికొచ్చే బందువులూ వినరు. హైదరాబాద్ నగరంలో రోడ్డుపై భగవద్గీత వినిపించిందంటే వెనకాల శవ వాహనం వస్తున్నట్టుగా గ్రహించి ముందటి వాహనాల వారు దానికి దారి ఇస్తుంటారు. అంతిమ సంస్కార వాహనానికి దారి ఇవ్వటానికా భగవద్గీత? గతంలో శవ వాహనం ముందు భాజాలు మొగించేవారు. దీంతో మందు వెళ్లేవారు పక్కకు తప్పుకొనేవారు. ఇప్పడు ఘంటసాల గారితో ఆ పనిని చేయించటం దారుణం కదా? శవ వాహనంతో సరిపెట్టకుండా ఇటీవల కాలంలో శ్మశానంలోను కొంతమంది భగవద్గీతను వినిపిస్తున్నారు. దీంతో శ్మశానంలో విన్న గీతను ఇళ్లలో వినరాదనే భావన ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. పత్రికలకు ఇచ్చే శ్రద్ధాంజలి ప్రకటనల్లోను భగవద్గీత శ్లోకాన్ని ఒక దాన్ని పొందుపర్చటం పరిపాటయ్యింది.
భగవద్గీతను వినిపించేందుకు అంతిమ సంస్కార వాహనం పై భాగంలో ఏర్పాటై ఉన్న స్పీకరు. పోలీసులకు ప్రత్యేకంగా గల వాటితో సహా ఇటువంటి అన్ని వాహనాలకు స్పీకర్లు ఉంటాయి.
చివరి దశలో తనను స్మరిస్తే తనను చేరుకొంటారని భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు కదా? అని కొంతమంది వాదించొచ్చు. దీనికి ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నర్సింహారావు సమాధానం ఏమిటంటే.. ఇక్కడ తనను అంటే అంతరాత్మ అని అర్ధం. అంతేకాని కృష్ణుడ్ని స్మరించాలని కాదని ఆయన పేర్కొన్నారు. అయినా కృష్ణుడు .. అంత్యకాలంలో స్మరించమన్నాడే తప్ప చనిపోయిన తర్వాత భగవద్గీతను వినిపించాలని చెఫ్పలేదుకదా? చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని గరికపాటి నరసింహారావు కూడా అభిప్రాయపడ్డారు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను చేపట్టకపోతే త్వరలోనే భగవద్గీత ప్రజలకు మరింత దూరమైపోయే ప్రమాదం పొంచివుంది. అసలు భగద్గీత గ్రంధాన్ని ఇంటిలో ఉంచుకోకూడదనే పరిస్థితీ తలెత్తవచ్చు.
మృత దేహం వద్ద భగవద్గీతను వినిపించటాన్ని తప్పు పట్టిన ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు
ఆనాడు భగవద్గీత.. గాంధీ మహాత్ముడితో సహా ఎంతో మంది ప్రముఖులపై ప్రభావాన్ని చూపించింది. ఘంటసాల మాత్రమే కాకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించినప్పటికీ ప్రజల వైఖరిలోని మార్పుల కారణంగానే ఆయనవి జనబాహుళ్యంలోకి రాలేకపోయాయని భావించవచ్చు. మానవ మనుగడకు కావాల్సిన సరంజామా అంతా గీతలోనే ఉందంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులు సాఫ్టువేర్ కంపెనీలకు సైతం వెళ్లి చెబుతుంటారు. ఇదే సమయంలో.. గీత.. మరణ సమయాలకు పరిమితమవుతుండటం ఆశ్చర్యపరిచే పరిణామం.