మరో పీఆర్సీ వచ్చేస్తున్నా ‘ఉపాధి’ క్షేత్ర సహాయకుల జీతం పెరగలేదు (మూడో భాగం)
personBuruju Editor date_range2023-02-24
పైన పేర్కొన్న విధులన్నీ క్షేత్ర సహాయకులే చేయాలి
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో రెండో పీఆర్సీ ఏర్పాటు గడువు సమీపిస్తుండగా ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులకు మాత్రం ఇంత వరకు జీతాలు పెరగనేలేదు. పైగా చాలా మందికి ప్రభుత్వం ఇంకా రెండు నెలల జీతాన్ని బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం అమల్లో ఏటా రాష్ట్రానికి అవార్డులు వస్తుండటంలో క్షేత్ర సహాయకుల (ఫీల్డు అసిస్టెంట్స్) పాత్రే కీలకం. పథకం మొదలయ్యి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల తన నివాసంలో కేక్ ను కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసిన సమయంలో నైనా క్షేత్ర సహాయకుల వేతనాల గురించి మాట్లాడి ఉంటే వారూ సంతోషించి ఉండేవారు. ఎప్పుడో 2016లో పెంచిన రూ.10వేల తోనే ఇప్పటికీ కుటుంబాలను పోషించుకోవాలని చెప్పటం పీఆర్సీ విశ్లేషణకు విరుద్దం. జీతాల పెంపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మాత్రమే తీసుకోవాల్సివుంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికార వర్గాలు Buruju.com కు తెలిపాయి.
తెలంగాణ తొలి పీఆర్సీ 2020లో ఇచ్చిన నివేదికలో నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి నెలవారి కనీస ఖర్చును రూ.16,500గా అంచనా వేసి.. కరోనా నేపథ్యంలో దాన్ని రూ.19వేలకు పెంచి దాన్ని కనీస వేతనంగా సిఫార్సు చేసింది
తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘం (పీఆర్సీ prc) నివేదిక 2020లో వెలువడినప్పటికీ దాని సిఫార్సులు 2018, జూలై 1వ తేదీ నుంచి అమలయ్యాయి. ప్రతి అయిదేళ్లకు పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున మొదటి పీఆర్సీ గడువు 2023, జూన్ నెలాఖరుతో ముగిసిపోతుంది. అంటే మరో నాలుగు నెలల్లో రెండో పిఆర్సీ సిఫార్సులు తెలంగాణలో అమలు కావాల్సివుంది. రెండో పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు కనీసం ప్రభుత్వాన్ని అడగలేకపోతుండటం అంశాన్ని పక్కన పెట్టి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల field assistants విషయానికి వస్తే.. ఇంతవరకు వారికి జీతమంటూ పెంచకపోవటం భావ్యం కాదు. మొదటి పీఆర్సీలో ఉద్యోగులు అందరికీ 30 శాతం ఫిట్మెంటును ప్రభుత్వం ఇచ్చినందున అదే రీతిలో క్షేత్ర సహాయకులకు పెంచటం వల్ల బడ్జెట్టుపై పెద్దగా భారమంటూ ఏమీ ఉండబోదు. ఎందుకంటే రూ.10వేలు కాస్తా రూ.13వేలు అవుతుంది. నిజానికి ఇది కూడా క్షేత్ర సహాయకుల కుటుంబాలకు ఏమాత్రం సరిపోదు.
పై ఫొటోలో వయస్సు మళ్లినవారు సైతం మట్టి పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇటువంటి వారందరికీ గ్రామంలోనే ఉపాధిని కల్పించేది క్షేత్ర సహాయకులే
ప్రతి ఉద్యోగి కుంటుంబలోను నలుగురు వ్యక్తుల రోజువారి ఖర్చులను లెక్కలోకి తీసుకొని నెలకు రూ.19వేలు కనీస వేతనంగా ఉండాలని తెలంగాణ తొలి పీఆర్సీ నిర్ధారించింది. ఇది అంతకు ముందటి పీఆర్సీతో పోలిస్తే రూ.6వేలు ఎక్కువ. అందువల్ల రెండో పీఆర్సీ సిఫార్సుల్లో కనీస వేతనం రూ. 26వేల పైనే ఉండే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు కూడా దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే పని చేస్తుంటారు కనుక వారికీ పీఆర్సీ చెప్పిన కనీస వేతనాలను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది కదా? వీరి విషయంపై చర్చించి కొన్ని సిఫార్సులు చేసేలా టీఎన్జీవో వంటి ఉద్యోగ సంఘాలు రెండో పీఆర్సీ చైర్మన్ పై వత్తిడి తీసుకురాగలగాలి. ఎప్పుడో 2016లో పెంచిన రూ.10వేలలోను కోతలు పెడుతుండటాన్ని వ్యతిరేకిస్తూ క్షేత్ర సహాయకులు 2020లో కేవలం 12 రోజుల పాటు సమ్మె చేయగా.. ప్రభుత్వం ఏకంగా 29 నెలల పాటు వారిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత వారిని విధుల్లోకి తీసుకొన్నా.. 29 నెలల జీతాలు అటుంచి.. సమ్మెకు ముందటి రెండు నెలలకు చెందిన జీతాలను కూడా చాలా మందికి ఇంతవరకు చెల్లించలేదని తెలిసింది.
జీతాల్లో కోతవేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు కోరటమే మహాపరాధంగా ప్రభుత్వం పరగణించింది. ఇటువంటి కారణంగానే ప్రస్తుతం జీతాల గురించి గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొంది
ఉద్యోగాలను కోల్పోయిన 29 నెలల కాలంలోను ఏడు వేల మంది క్షేత్ర సహాయకులు తమ కుటుంబాలను ఏ విధంగా నెట్టుకొచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వం కనుక అధ్యయనాన్ని చేయిస్తే ఎన్నో చేదు నిజాలు వెలుగులోకి వస్తాయి. అంత వరకు పని చేసిన గ్రామంలో తలెత్తుకోలేక ఎక్కడెక్కడికో వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకొన్నవారు ఎందరో ఉన్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకొన్నప్పటికీ మిగతా ఉద్యోగుల నుంచి వారికి చిన్న చూపు తప్పటంలేదు. వారికి జీతాలను పెంచి ప్రభుత్వం తాను చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దు కోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ కార్యదర్శులకు క్షేత్ర సహాయకుల విధులను అప్పగించరాదనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందంటూ ఎవరైనా కోర్టుకు కనుక వెళ్తే.. క్షేత్ర సహాయకులకు 29 నెలల వేతన బకాయిలు తిరిగి అందే అవకాశాలు లేకపోలేదు. క్షేత్ర సహాయకుల ఇబ్బందులను చూడలేక ఎవరైనా ఇటువంటి వాజ్యాలను దాఖలు చేయక ముందే కొన్ని సానుకూల నిర్ణయాలను తీసుకోవటం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం (మిగతా రాష్ట్రాల్లో క్షేత్ర సహాయకుల పరిస్థితి ఏమిటి? నాలుగో భాగం వచ్చేవారం)