ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటం ఒక తప్పు మాత్రమే కాదు.. మహా అపరాధం కూడా.. అని అభివర్ణించిన దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-17’లో వెల్లడించారు.
బురుజు.కాం Buruju.com : జాతీయ ప్రణాళిక సంఘం రద్దయినప్పటి నుంచి రాష్ట్రాల బడ్జెట్లపై నియంత్రణ అంటూ లేకుండా పోయింది. దీంతో రాష్ట్రాలు జనాకర్షక పథకాల కోసం విపరీతంగా అప్పులు తెస్తూ.. బడ్జెట్ల సైజులను బాగా పెంచుకొంటున్నాయి. ఇష్టాను సారంగా బడ్జెట్లలో అప్పులను పొందుపర్చేందుకు 2015 వరకు రాష్ట్రాలు భయపడేవి. ఒక వేళ అలా ఎక్కువ అప్పులను ప్రతిపాదిస్తే.. ఇలా ఎందుకు చేశారంటూ ప్రణాళిక సంఘం నేరుగా ముఖ్యమంత్రులనే దిల్లీకి పిలిచి ప్రశ్నించేది. దీంతో బడ్జెట్ల తయారీ దశలోనే రాష్ట్రాల్లోని ఆర్థిక శాఖ అధికారులు ఆయా కార్యక్రమాలకు నిధులను ఏ విధంగా తెచ్చేదీ అంచనా వేసుకొని ప్రణాళిక సంఘానికి సంతృప్తి కలిగించే రీతిలో చెప్పుకొనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2009-10 బడ్జెట్టులో.. అప్పుగా తేదలచిన మొత్తంలో రూ. 1,312 కోట్లను ఎక్కువగా చూపించగా.. ప్రణాళిక సంఘం ఆ మొత్తాన్ని తొలగించి వేసింది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ప్రణాళిక సంఘం రద్దయ్యి.. దాని స్థానే ఉనికిలోకి వచ్చిన నీతి ఆయోగ్.. ఇటువంటి అంశాల జోలికి వెళ్లకపోతుండటంతో.. రాష్ట్రాలు ఇప్పుడు ఎడాపెడా అప్పులను తేగలుగుతున్నాయి. తాము తయారు చేసుకొన్న ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ ( ఎఫ్ ఆర్ బి ఎం ) చట్టాలనే అవి అతిక్రమిస్తున్నాయి.
పంచవర్ష ప్రణాళికకు తుది రూపమిస్తున్న నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏటా పరిమితికి మించి అప్పులను తెస్తున్న తీరుపై గత కొద్ది రోజులుగా వాడిగా వేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. బడ్జెట్లలో చూపించకుండా రెండు రాష్ట్రాలు అప్పులు తెస్తున్నాయని, వాటిని కూడా బడ్జెట్ అప్పులుగానే పరిగణించాల్సివుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా స్పష్టం చేసింది. 2015 సంవత్సరానికి ముందటి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. అప్పట్లో బడ్జెట్లలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఉండేవి. అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు నిధులను ప్రణాళిక పద్దుల్లోను, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపులు వంటివాటిని ప్రణాళికేతర పద్దుల్లోను చూపించేవారు. ప్రణాళిక పద్దుల సమాహారాన్ని వార్షక ప్రణాళిక అనేవారు. దానిలో కేంద్ర సౌజన్య పథకాల ద్వారా వచ్చే మొత్తాలనూ పేర్కొనేవారు. అప్పులను సాగునీటి ప్రాజెక్టులు వంటి ప్రణాళిక పద్దులకు మాత్రమే వినియోగించేవారు. అందువల్ల వార్షక ప్రణాళికల అమలకు అవసరమయ్యే ఆర్థిక వనరుల్లో అప్పులూ ఉండేవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. 2009-10 వార్షక ప్రణాళికలో అప్పులతో సహా రూ.3వేల కోట్లను ప్రణాళిక సంఘం తగ్గించి వేసినట్టుగా అప్పట్లో ‘ఈనాడు’లో వెలువడిన కథనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా వార్షిక ప్రణాళికను తయారు చేసిన తర్వాత.. దిల్లీలోని ప్రణాళిక సంఘం వద్దకు వెళ్లి దానికి ఆమోదముద్ర వేయించుకొనేది. ప్రణాళిక సంఘం నిర్ధేశించిన తేదీల్లో ఆర్థిక, ప్రణాళిక తదితర శాఖల ఉన్నతాధికారులతో సహా ముఖ్యమంత్రి దిల్లీలో ప్రణాళిక సంఘం కార్యాలయానికి వెళ్లి.. అక్కడి అధికారులు అడిగే ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు ఇచ్చేవారు. తగినన్ని రాబడులు లేనప్పటికీ వార్షిక ప్రణాళికలో ఎక్కువ కేటాయింపులు చూపించారంటూ దానిని ప్రణాళిక సంఘం కుదించిన సందర్భాలూ ఉన్నాయి. బడ్జెట్టు ఆమోదానికి ముందు మాత్రమే కాకుండా. . అసెంబ్లీలో ఆమోదముద్ర వేయించుకొన్న తర్వాత కూడా వార్షిక ప్రణాళికను ప్రణాళిక సంఘం పరిశీలించి.. అభ్యంతరాలు ఉంటే కోతలు విధించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009-10 బడ్జెట్టులో వార్షిక ప్రణాళిక రూ.36,635 కోట్లతో అమలవుతుండగా .. మధ్యలో దాన్ని ప్రణాళిక సంఘం రూ. 33,635 కోట్లకు కుదించింది. అప్పటికి గల రాబడులకు అనుగుణంగానే ఇలా చేసింది. తగ్గించిన రూ.3వేల కోట్లలోను.. అర్హతకు మించి పొందుపర్చిన రూ.1,312 కోట్ల అప్పులు ఉన్నాయి.
ప్రణాళిక సంఘం , నీతి ఆయోగ్ ల విధులను పోలుస్తూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి
ప్రణాళిక సంఘం రద్దయ్యి దాని స్థానంలో నీతి ఆయోగ్ రావటంతో ఇక ముఖ్యమంత్రలు దిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రశ్నించేవారంటూ లేకపోవటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమకు తోచిన రీతిలో అప్పులను తెస్తున్నాయి. ప్రధాని నెహ్రు హయాంలో మొదలైన పంచవర్ష ప్రణాళికల తయారీ , అమలు నిలిచిపోయింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తప్పు పట్టారు. దివంగతులు కావటానికి ముందు రాయగా.. ఇటీవల వెలువడ్డ అత్మకథ ‘ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-17 ’లో...ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటం ఒక తప్పు మాత్రమే కాదు.. మహాపరాధం కూడా’ అని ఆయన ఘాటుగా ప్రతిస్పందించారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే కేంద్రం.. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటంతో ఆ విషయంపై తన అభిప్రాయాలను ఆత్మకథలో పొందుపర్చారు.