తెలుగు రాష్ట్రాలు ప్రతి నెలా ఆర్బీఐ మెట్లెక్కాల్సిన పరిస్థితి
బురుజు.కాం Buruju.com : క్రమం తప్పకుండా ప్రతి నెల ఓవర్ డ్రాఫ్టు కోసం వస్తున్న రాష్ట్రాలుగా జమ్ము-కాశ్మీర్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆర్బీఐ వద్ద ప్రత్యేక గుర్తింపును పొందాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలేవీ ఈ మూడు రాష్ట్రాల మాదిరిగా ఓవర్ డ్రాఫ్టు కోసం వెళ్లటమేలేదు. ఒక వేళ అప్పుడప్పుడు వెళ్లినా అవి పలు రకాల సమస్యలతో కొట్టుమిట్టాడే నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే అయ్యింటున్నాయి. పెద్ద రాష్ట్రాలు ఓవర్ డ్రాఫ్టును వాడుకోవటం చాలా అరుదు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబరు మధ్య 10 నెలల వ్యవధిలోను ఆంధ్రప్రదేశ్ రూ.14,919 కోట్లను, తెలంగాణ రూ.8,075 కోట్లను ఓవర్ డ్రాఫ్టు రూపంలో వాడుకొన్నట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.
ముంబాయిలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం
రాష్ట్రాలకు రోజువారి ఖర్చులకు నిధుల కోరత ఏర్పడినప్పుడు ఆర్బీఐ మూడు రకాల పద్దతుల్లో సొమ్మును సర్దుబాటు చేస్తుంది. ప్రత్యేక స్వీకరణ సదుపాయం( ఎస్.డి.ఎఫ్ ), చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్), ఓవర్ డ్రాఫ్టు అనే మూడు రకాల రకాల్లోను.. తొలి రెంటిని వినియోగించుకొన్నప్పటికీ కూడా నిధుల సమస్య పరిష్కారం కాకుంటేనే ఓవరుడ్రాఫ్టుపై ఆధారపడతాయి. మూడింటిలోను ఓడీ అనేది తీవ్రమైంది, ప్రతి పక్షాల విమర్శలకు లోనయ్యేది కనుక దీని జోలికి మాత్రం వెళ్లకుండా మొదటి రెండు సదుపాయాలతోనే పలు రాష్ట్రాలు నగదును సర్ధుబాటు చేసుకొంటుంటాయి. మొదటి రెండు రకాల చేబదుళ్లను వడ్డీ లేకుండాను, ఓవరుడ్రాఫ్టును మాత్రం వడ్డీతోను కొద్ది రోజుల వ్యవధిలోనే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సివుంటుంది.
ప్రత్యేక స్వీకరణ సదుపాయం, చేబదుళ్ల పరిమితులను వాడుకొన్నాకనే ఒోవర్ డ్రాఫ్టు
ఓడీ కింద రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవటాన్ని ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అప్రదిష్టగా పరిగణించేవారు. ఆ పేరంటేనే ఉలిక్కి పడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రకాల సదుపాయాల్లోను ఏ ఒక్కదానికి వెళ్లేవారే కారు. అంటే.. ప్రభుత్వ రోజు వారి ఖర్చుల కంటే రాబడులు ఎక్కువగా ఉండేవి. తమది చేబదుళ్లకు , ఓడీకి వెళ్లే రాష్ట్రం కాదని వైఎస్ గొప్పగా చెప్పేవారు. ఇప్పుడంతటి ఉచిత పథకాలు అప్పట్లో లేవు కనుకనే ఇది సాధ్యమయ్యింది.
అప్పుల తో ఆస్తులను కల్పించకుండా నోట్లను పంచి పెడుతున్నారు