మార్చి 5వ తేదీన నిజాంపేటలోని జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షులు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.వేదికపై ఎడమ నుంచి వరసగా జ్యోతిప్రసాద్, రవికాంత రెడ్డి, వంశీ శ్రీనివాస్, పల్లె రవి కుమార్, నేమాని భాస్కర్
బురుజు.కాం Buruju.com : హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీలోని సభ్యులు అందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు రావటం ఖాయమని, దీనిపై ఎవరికీ ఎటువంటి అపోహలు ఉండనవసరం లేదని సొసైటీ అధ్యక్షులు, ఎమ్మెల్యే సి.హెచ్.క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల కోసం మరికొందరు జర్నలిస్టులు ఎదురు చూస్తుండటంతో వారికీ స్థలాలను ఏ విధంగా ఇవ్వాలనేది మాత్రమే అల్లం నారాయణ కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు. జవహర్ లాల్ సొసైటీకి ఇప్పటికే కేటాయించిన 70 ఎకరాలను కొత్త వారికి ఎవరికీ కేటాయించే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ తేటతెల్లం చేసినందున ఈ విషయంలో సభ్యులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. నిజాంపేటలోని భూమి ఇప్పటికే సొసైటీ అధీనంలో ఉందని, పేట్ బషీరాబాదులోని 38 ఎకరాలు కూడా త్వరలోనే సొసైటీకి లభించనున్నాయని ఆయన తెలిపారు. అవకాశం లభించినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ తోను, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతోను ఇళ్ల స్థలాల అంశంపై తాము మాట్లాడుతూనే ఉన్నామని క్రాంతి కిరణ్ వెల్లడించారు.
సమావేశంలో మాట్లాడుతున్న సొసైటీ సీఈవో వంశీ శ్రీనివాస్
సొసైటీలోని సభ్యులంతా ఐక్యంగా ఉండాలని, అలా కాకుండా కొంత మంది కలిసి కమిటీ ప్రతినిధులపై బహిరంగ విమర్శలకు దిగితే విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లి అనవసరమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని క్రాంతి కిరణ్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికే జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీకి అప్పగించిన నిజాంపేటలోని స్థలంలో మార్చి 5వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో క్రాంతికిరణ్ మాట్లాడారు. కొందరు సభ్యులు ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యతిరేక పోస్టుంగులు పెడుతూ రావటంతో ఇక ముందు అటువంటి వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని సమావేశం నిర్ణయించింది. సొసైటీ బ్యానరుపై ఇక ముందు ఎవరూ కూడా వ్యక్తిగత అజెండాల అమలకు ప్రయత్నించరాదని సమావేశం తీర్మానించింది. పేట్ బషీరాబాదులోని 38 ఎకరాలను వెంటనే సొసైటీకి అప్పగించే చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సొసైటీ స్థలాలపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ కనబరస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. నిజాంపేట స్థలం చుట్టూ రేకులతో ప్రహారీని నిర్మించినందుకు అయిన దాదాపు రూ.70 లక్షల వ్యయానికి సమావేశం ఆమోదాన్ని తెలిపింది.
జర్నలిస్టులం కనుక స్థలాలను ఇచ్చేయవలసిందే అంటూ కాలర్ ఎగురవేసి అడిగితే పనులు అయిపోవని, ఇటువంటి వ్యవహారాలన్నీ సంప్రదింపుల ద్వారానే నిర్వర్తించుకోవాల్సివుంటుందని సొసైటీ సీఈవో నిమ్మకాయల వంశీ శ్రీనివాస్ పేర్కొన్నారు. కోర్టు కేసులతో సహా మరెన్నోఅడ్డంకులను అధిగమించి.. సొసైటీ ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించుకొనే స్థాయికి ప్రస్తుతం వచ్చామని, ఇటువంటి మంచి వాతావరణాన్ని ఇక ముందు ఎవరూ కూడా పాడు చేయవద్దని ఆయన కోరారు. సొసైటీ ఉపాధ్యక్షులు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ.. హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో ఆంధ్రా, తెలంగాణ అనే బేధాలను చూడబోమంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన హామీని ఇచ్చివున్నందున సభ్యులు అనవసర గందరగోళానికి లోను కావద్దని హితవు పలికారు. సొసైటీ డైరక్టర్లు బి.ఎన్.జ్యోతి ప్రసాద్, కె.రవి కాంత్ రెడ్డి, పలువురు సభ్యులు సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.