తెలంగాణలో ఎస్టీ కమిషన్ ద్వారానే ‘పోడు’కు అంతిమ పరిష్కారం
personBuruju Editor date_range2023-02-23
తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి సన్నివేశాలు బాగా పెరిగిపోయాయి
బురుజు.కాం Buruju.com : ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణలో ఎస్టీ కమిషన్ ఆవశ్యకత ఎంతైనా ఉందని వివిధ రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న పోడు భూముల సమస్య, కమిషన్ ద్వారానే ఒక కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుంటాయని ఆదివాసీలు ఆశించి బంగపడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయటంలేదని మండిపడ్డారు. ఆదివాసీ యువతీ, యువకుల ఉన్నత చదవుల కోసం భద్రాచలంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
సదస్సులో మాట్లాడుతున్న నేషనల్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడ శ్రీను
గిరిజనులకు ఏళ్ల తరబడి ఎన్నెన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నా అవి వారి చెంతకు చేరటం చాలా అరుదు. అందుకే వారి బతుకులు ఇప్పటికీ దుర్భరంగానే ఉంటున్నాయి. దీనికి తోడు వివిధ కారణాల వల్ల ఇటీవల కాలంలో గిరిజన ఆదివాసీలకు- అటవీ, రెవెన్యూ అధికారులకు మధ్య ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో నేషనల్ ట్రైబల్ సూడెంట్స్ ఫెడరేషన్- ఎన్.టి.ఎస్.ఎఫ్ ఫిబ్రవరి 23వ తేదీన హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సు.. ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను చర్చించింది. వాటికి కొన్ని పరిష్కారాలనూ సూచించింది. ఎస్టీ కమిషన్ ఉన్నట్లైతే గిరిజనులకు సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాలను అది పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు లోపాలను కనుగొనేందుకు వీలవుతుందని సదస్సు అభిప్రాయపడింది.
సదస్సులో మాట్లాడుతున్న నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్. ప్రొఫెసర్ కోదండరాం కూడా వేదికపై ఉన్నారు
నేషనల్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మేడ శ్రీను మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ లో ఐఏఎస్ అధికారులు ఉండాలని, అప్పుడే అది ఆదివాసీల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాగా పనిచేయగలుగుతుందని అన్నారు. ఆదివాసీల పట్ల ఇటీవల కాలంలో అధికారుల దురుసు ప్రవర్తన బాగా పెరిగిపోయిందని చెబుతూ.. అదిలాబాదు జిల్లా పోచమ్మగూడెంలో పోడు భూమి కోసం ఉద్యమిస్తున్నవారిపై పోలీసుల ప్రవర్తన గర్హనీయమని అన్నారు. అదివాసీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి మాగాణి భూములు ఇస్తామనే హామీని అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్ పేర్కొన్నారు. పాలకుల ఉదాసీనత వల్లనే ఇది తీవ్ర ఘర్షణలకు దారితీస్తోందని అన్నారు. ప్రస్తుత అధికారుల ద్వారా సమస్య పరిష్కారం కావటంలేదని, ఎస్టీ కమిషన్ కనుక ప్రత్యేకంగా ఏర్పాటైతే అది పోడు భూములతో పాటు ఆదివాసీలకు చెందిన ఇతర సమస్యలనూ పరిశీలించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. షెడ్యూల్ 5 కింద గల ప్రాంతాలకు ప్రభుత్వం అధిక ప్రధాన్యం ఇవ్వాలన్నారు.
సదస్సులో వక్తల సంఘీభావం
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని కూడా పాలకులు అమలు చేయటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు పలు రకాల హక్కులను ఈ చట్టం కల్పించిందని, అడవిలో నివసించటానికి, అక్కడ భూమిని కలిగి ఉండటానికి ఇది అంగీకరిస్తోందని ఆయన తెలిపారు. అయిదో షెడ్యూల్ పరిధిలోని పంచాయతీలకు 73, 74 రాజ్యాంగ సవరణలు పలు అధికారాలను కల్పించినా అవీ తెలంగాణలో అమలకు నోచుకోవటంలేదన్నారు. సదస్సులో ఇంకా.. ఆదివాసీ ఐసీఏఎస్ఏ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ (ఎన్.టి.ఎఫ్) గోండు విభాగం నుంచి రామదాసు, ఎన్.టి.ఎఫ్ నాయక్-పోడ్ నుంచి నార దత్తు, ఎన్.టి.ఎఫ్ చెంచు ట్రైబ్ నుంచి భాల్కూరి రామస్వామి , ఎన్.టి.ఎఫ్ ఎరుకల ట్రైబ్ నుంచి కూతాడి కుమార్ పాల్గొన్నారు.