తిరుమలలో మాదిరి భోజన విరాళ పథకాన్ని.. పాఠశాలల్లోను అమలు చేయొచ్చు
personBuruju Editor date_range2023-02-25
చాలా మంది విద్యార్దులు ఉదయం ఏమీ తినకుండానే పాఠశాలలకు వచ్చేస్తుంటారు. మధ్యాహ్నం వేళకు ఆకలితో.. భోజనం కోసం ఎదురు చూస్తుంటారు
బురుజు.కాం Buruju.com : తిరుమలలో Tirumala తాజాగా ప్రవేశపెట్టిన భోజన విరాళ పథకం మాదిరి కార్యక్రమాన్ని.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలల్లో అమలు చేయగలిగితే దాతల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల వారు పుట్టిన రోజు, పెళ్లి రోజు తదితర సందర్భాల్లో.. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చును సంతోషంగా అందజేయగలుగుతారు. అటువంటి రోజుల్లో.. బడి పిల్లలకు సాధారణ రోజుల కంటే భిన్నమైన ఆహారం లభించే ఆస్కారం ఉంటుంది. అల్పాహారం సైతం అందుతుంది.
తిరుమల ఆలయంలో భోజనం చేస్తున్న భక్తులు
తిరుమలలో నిత్యం 55వేల నుంచి 60 వేల మందికి భోజనాన్ని, అల్పాహారాన్ని అందజేస్తుంటారు. వీటి తయారీకి అయ్యే ఖర్చు సగటున రోజుకు రూ.33 లక్షలుగా దేవస్థానం అంచనా వేసింది. ఆ మొత్తాన్ని దాతలు విరాళంగా ఇవ్వొచ్చని తాజాగా ప్రకటించింది. ఇలా విరాళాన్ని ఇచ్చే దాతల పేరును ఆ రోజున వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు.. ఆ రోజున భక్తులకు స్వయంగా భోజనాన్ని ఒడ్డించవచ్చు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇటువంటి పథకాన్ని పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 45వేల పాఠశాలల్లోని 36 లక్షల మంది పిల్లలకు, తెలంగాణలో 27వేల పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మధ్యహ్నం కాగానే ప్రభుత్వ పాఠశాలల్లోని దృశ్యాలు ఇవి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వారిలో అత్యధిక మంది పేద వర్గాలకు చెందినవారే. పుట్టిన రోజు వంటి ముఖ్యమైన సందర్భాల్లో పిల్లల భోజనానికి అయ్యే ఖర్చును అందజేయాల్సిందిగా ప్రభుత్వం కనుక పిలుపునిచ్చి, అందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లైతే పలువురు దాతలు తప్పకుండా ముందుకు వస్తారు. బిర్యాని వంటి ప్రత్యేక వంటకాలను సమకూర్చేందుకు సైతం వారు వెనుకాడరు. పిల్లల పుట్టిన రోజులను అనాధాశ్రమాల్లో నిర్వహించుకోవాలనే భావన ఇటీవల కాలంలో సాఫ్టువేరు తదితర రంగాలకు చెందిన వారిలో ఏర్పడుతోంది. గూగుల్ లో కనిపించే కొద్దిపాటి అనాధాశ్రమాలకే ఎక్కువ మంది వెళ్తుండటంతో కొన్ని ఆశ్రమాల నిర్వాహకులైతే.. పలానా రోజు వేరేవారికి బుక్కయ్యిపోయిందని చెప్పే పరిస్థితి నెలకొంటోంది. హైదరాబాదులోని మెహదీపట్నం ప్రాంతంలోగల ఒక అనాధాశ్రమమైతే.. స్లాటుల పద్దతిని ప్రవేశపెట్టింది.
తిరుమలలో అన్నప్రసాద భవనం . విరాళం ఇచ్చిన వారి పేరును భోజనం పెట్టే రోజున ఇక్కడ ప్రదర్శిస్తారు
హైదరాబాదుకు బదులు పక్కనే గల ఏ సంగారెడ్డి జిల్లాకో వెళ్లగలిగితే.. ఆకలితో నకనకలాడే పిల్లలెందరో కనిపిస్తారు. వారికి ఒక రోజు పాటు కడుపు నిండా భోజనం పెడితే ఆ ఆనందం జీవితాంతం ఉండిపోతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు దీనికోసం ప్రత్యేకంగా వెబ్ సైట్లను అందుబాటులోకి తెచ్చి.. వాటిలో వివరాలను పొందుపర్చగలిగితే సరిపోతుంది. ఆయా ప్రాంతాల వారంతా అక్కడకు వెళ్లగలుగుతారు. పిల్లలకు ఉదయం అల్పాహారాన్ని అందివ్వటం చాలా అవసరమని 2021, మార్చినెలలో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ కనబర్చటంలేదు. విరాళాల కార్యక్రమం ద్వారా అల్పాహారాన్నీ సమకూర్చవచ్చు. పిల్లలకు స్టీలు ప్లేట్లు, గ్లాసులు, వాటర్ కూలర్లు వంటివీ అందజేయవచ్చు. వయోధికుల ఆశ్రమాల్లోనూ ఇటువంటివి అమలు చేయవచ్చు. తిరుమల విషయానికి వస్తే.. అక్కడ ఇవ్వాల్సిన రూ.33 లక్షల్లోను.. ఉదయం అల్పాహారానికి రూ. 7.70లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ. 12.65 లక్షలు, రాత్రి భోజనానికి మరో రూ.12.65 లక్షలు చొప్పున వెళ్తాయి.