బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉపన్యసించేందుకు ఫిబ్రవరి3వ తేదీన శాసన సభకు వచ్చిన గవర్నరుకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్. సీఎస్ శాంతికుమారి కూాడా అక్కడ ఉన్నప్పటికీ ఆమె అధికారికంగా రాజభవన్ కు రావటం కాని, పోను చేయటం కాని జరగలేదన్నది గవర్నరు అభియోగం
బురుజు.కాం Buruju.com : సమసిపోయిందని భావించిన తెలంగాణ గవర్నరు, ప్రభుత్వం మధ్య వివాదం మరింత తీవ్రమయ్యింది. కొద్ది రోజుల క్రితం గవర్నరు తమిళిసై governor tamilisai విధానాలపై హైకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కారు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇక్కడి వివాదం జాతీయ స్థాయిలో మరో సారి చర్చకు దారితీసింది. మరో వైపు ప్రభుత్వం తనను ఏ మాత్రం గౌరవించటం లేదని గవర్నరు తమిళిసై కొందరు ప్రముఖులు ఆశీనులై ఉన్న వేదికపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందంటూ శాసన సభలో ప్రసంగ పాఠాన్ని చదివిన కేవలం నెల రోజులకే ఆమె ఇలా ధ్వజమెత్తటంతో రాజకీయ కారణాల వల్ల ఇక ఉభయుల మధ్య వివాదం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఫిబ్రవరి 3వ తేదీన శాసన సభలో ప్రసంగిస్తున్న తమిళిసై. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకరు పోచారం శ్రీనివాస రెడ్డి ఆశీనులై ఉన్నారు
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా 2023, ఫిబ్రవరి3వ తేదీన శాసన సభలో ఉభయ సభల సభ్యులను ఉద్ధేశించి గవర్నరు తమిళిసై ఉపన్యసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో పయనిస్తోందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అంటూ కితాబునిచ్చారు. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి పాలన దక్షత వల్లనే ఇదంతా సాధ్యమవుతోందనీ శ్లాఘించారు. అలా ఉపన్యసించటాకి ముందు ఆమె యాదాద్రి ఆలయానికి వెళ్లగా జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గవర్నరు ఫిబ్రవరి 24వ తేదీన ఆలయానికి మరో సారి వెళ్లగా అప్పుడూ కలెక్టరు స్వాగతం పలికారు. గవర్నరు కోరుకొంటున్న మర్యాదలను ప్రభుత్వం కల్పిస్తున్నందున ఇక గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తున్న వివాదాలు సమసిపోయినట్టేనని పలువురు భావించారు.
దస్త్రాలు అన్నింటిపైనా ఇలా సంతకాలను పెట్టేస్తూ ఉంటే గొడవలే ఉండవనేది ప్రభుత్వ వాదన
అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులపై గవర్నరు సంతకం చేయటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లటంతో ఉభయుల మధ్య వివాదం కొలిక్కిరాలేదు సరికదా.. మరింత తీవ్రమయ్యిందనే సంగతి వెల్లడయ్యింది. గవర్నరు సంతకాన్ని చేస్తేనే పది బిల్లులూ చట్టాలుగా రాగలుగుతాయి. అంతకు ముందు రాష్ట్ర బడ్జెట్టుకు ఆమె వెంటనే ఆమోదాన్ని తెలపకపోవటంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఇటువంటి వివాదాల్లోకి తమనెందుకు లాగుతున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానిస్తూనే భోజన విరామ సమయంలో ఉభయ పక్షాల ప్రతినిధులు మాట్లాడుకొని రావాల్సిందిగా చెప్పింది. ఉభయులు రాజీపడటంతో కేసును హైకోర్టు ముగించేసింది. ఆరోజు గవర్నరు ప్రతినిధులు అంగీకరించిన దాని ప్రకారం గవర్నరు తన వద్ద గల పది బిల్లులపైన సంతకాలను చేయాల్సివుందని, ఆలా చేయనందునే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సివచ్చిందని ప్రభుత్వం చెబుతోంది.
బిల్లుల ఆమోదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి.. సుప్రీం కోర్టుకు వెళ్లటాన్ని ట్విటర్ లో గవర్నరు ప్రస్తావించి.. దిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర కదా? అంటూ వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 6వ తేదీన రాజ్ భవన్ లో నిర్వహించిన ఒక సమావేశంలో గవర్నరు మాట్లాడుతూ.. సీఎస్ ఇంతవరకు తనను కలవటం కాదుకదా అసలు ఫోను కూడా చేయని విషయాన్ని వెల్లడించి మహిళనైన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ సమావేశానికి రావాల్సిందిగా తాను ఎంతో మందికి ఆహ్వానాలను పంపితే ఎవరూ రాలేదంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయానికి ప్రజలంతా తన వెంట ఉంటారని భావిస్తున్నాననీ ఆమె అన్నారు. ఆమె అలా మాట్లాడిన సమావేశంలో కొందరు న్యాయమూర్తులు, మిలట్రీ అధికారులు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బు ఉన్నారు. మొత్తం మీద గవర్నరు, ప్రభుత్వానికి మధ్య అంతరం మరింతగా పెరుగుతోందనే భావించాలని పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు కూడా హైకోర్టు మాదిరిగానే వ్యాఖ్యానిస్తుందా? లేక ఇంకేమైనా చెబుతుందా? చూడాలి.