అల్లూరిని కాల్చివేసినట్టు చెప్పేందుకు 10 రోజులు సమయాన్ని ఎందుకు తీసుకొన్నట్టు? (నాలుగో భాగం)
personBuruju Editor date_rangeFri Nov 10 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
ఆ మహనీయుడి మరణ రహస్యాన్ని ఇక నైనా ఛేదిద్దాం
బురుజు Buruju.com; Hyderabad (అల్లూరి సీతారామరాజు Alluri Seetha Rama Raju తమ అధీనం నుంచి తప్పించుకొని పారిపోతుంటే ఆయన్ని హతమార్చామంటూ బ్రిటీష్ ప్రభుత్వం తన రికార్డుల్లో రాసుకొంది. నిజానికి ఆయన్ని చిత్ర హింసలు పెట్టి కాల్చిచంపారని కొన్ని ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి.. నాటి మరికొన్ని రికార్డుల ఆధారంగా నిజాల నిగ్గుతేల్చాలని పేర్కొంటూ.. బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది నాలుగోవది ) అల్లూరి సీతారామరాజును పట్టుకొన్న సమయంలోని పోలీసు అధికారుల వాంగ్మూలాలు గల రికార్డులను కనుక సంపాదించగలిగితే కొన్ని విషయాలు బయటపడతాయి. ఆయన్ని 1924, మే 7వ తేదీన బంధించినా.. కాల్పుల్లో చనిపోయారన్న విషయాన్ని బ్రిటీష్ ప్రభుత్వం మే 16వ తేదీన ప్రకటించింది. అంటే.. రాజును పట్టుకొన్న తర్వాత నుంచి ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకు గల 10 రోజుల వ్యవధిలో అసలు ఏంజరిగిందనేది ఇంతవరకు అధికారికంగా ఎవరికీ ఏమీ తెలియదు. ఇంత వ్యవధి ఎందుకంటూ ధైర్యం చేసి ఒకరిద్దరు అప్పట్లో పత్రికల్లో ప్రశ్నించినా నాటి బ్రిటీష్ పాలకులు ఏమాత్రం స్పందించలేదు.
అప్పట్లో బ్రిటీష్ వారి హింస ఇలా ఉండేది. అల్లూరినీ ఇలాగే చిత్రహింసలు పెట్టి చంపి.. రికార్డుల్లో మాత్రం ఆయన పారిపోతుంటే కాల్చివేశామంటూ కట్టుకథ అల్లారు
సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చిచంపి రికార్డుల్లో మాత్రం ఆయన పారిపోతుంటే జరిపిన కాల్పుల్లో చనిపోయినట్టుగా రాయవలసి వచ్చిందని నాటి పోలీస్ ఇనస్పెక్టర్ ఆళ్వారు నాయుడు వెల్లడించినట్టుగా ‘కృష్ణా జిల్లా స్వాతంత్య్రసమరయోధులు’ 1984లో తెచ్చిన ‘ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’లో వివరించారు. అయితే ఆళ్వారునాయుడు ఎక్కడ ? ఏ సందర్భంలో ఆ సమాచారాన్ని చెప్పిందీ దానిలో రాయలేదు. గ్రంధంలోని వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో నాలుగేళ్ల పాటు ఎస్ఐగా పనిచేసిన ఆళ్వారు నాయుడిని మన్యంలో పనిచేయటానికి ప్రత్యేకంగా నియమించారు. ‘‘రామవరం వద్ద నేను సిబ్బందితో గస్తీ తిరుగుతున్నప్పుడు సీతారామరాజు, అతని అనుచరులు కొండలోయ కిందకు పాకివెళ్తుండటం కనిపించింది. దీంతో మేము వారిని వెంట తరిమాము. పరస్పరం కాల్పులు జరుపుకొన్నాం. సీతారామరాజు గాయపడి పడిపోయాడు. రాజును ఒక మంచంపై వేసి కట్టి చింతలపూడికి తీసుకువెళ్తుండగా కొయ్యూరు సమీపంలో మేజర్ గుడాల్ ఎదురయ్యాడు. మేజర్ గుడాల్.. సీతారామరాజును తన అధీనంలోకి తీసుకొన్నాడు. అస్సాం దళంలోని పది మందిని వెంటబెట్టుకొని నన్ను, నా జమేదారులను తీసుకొని రాజును మంచంమీదే అడవిలో కొంత దూరం తీసుకుపోయాడు. అక్కడ రాజు కండ్లకు గుడ్డ కట్టి , ఆయన్ని చెట్టుకు కట్టివేశారు. ఆయన్ని 30-40 గజాల దూరం నుంచి కాల్చవలసిందిగా అస్సాం దళానికి జేబు రుమాలతో సంకేతమిచ్చాడు. మూడు, నాలుగు రౌండ్లకే రాజు చనిపోయాడు. ’’ అని ఆళ్వారు నాయుడు పేర్కొన్నట్టు ఈ గ్రంధంలో వివరించారు. జరిగింది ఇలా ఉండగా... రికార్డుల్లో మాత్రం సీతారామ రాజు కాల్పుల్లో చనిపోయాడంటూ రాశామని, అలా రాయకపోతే తమ పై అధికారులు తమనే హతమార్చి ఇరు వర్గాల మధ్య కాల్పుల్లో చనిపోయారంటూ నివేదికలు పంపుతారని ఆళ్వారు నాయుడు వాపోయాడని ఈ గ్రంధంలో పేర్కొన్నారు.
అల్లరి పారిపోతుంటే కాల్చిచంపామంటూ రాసి ఉన్న 1925 నాటి మద్రాసు ప్రెసిడెన్సీ నివేదిక ఇదే
రికార్డుల్లో అలా రాయటానికి దారితీసిన క్రమాన్నీ ఎస్.ఐ ఆళ్వారు నాయుడు వివరించారు. దానిప్రకారం.. రాజు చనిపోయిన తర్వాత మేజర్ గుడాల్.. ఆళ్వారు నాయుడిని వెంటబెట్టుకొని నాటి ప్రత్యేక కమిషనరు రూథరుఫర్డు వద్దకు వెళ్లాడు. గుడాల్ చెప్పినట్టుగా రాసి ఇవ్వాలంటూ రూథరుఫర్డు ఆళ్వారు నాయుడిని ఆదేశించారు. దీంతో రాజును కొయ్యూరుకు తీసుకు వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలని అతను అడిగాడని, తాము అతని కట్లు విప్పి పంపామని, అదే అదనుగా రాజు పరిగెత్తి పారిపోతుండగా అతనిపై కాల్పులు జరపవలసిందిగా తన సిపాయిలను ఆదేశించినట్టుగాను, వారి కాల్పులకు రాజు చనిపోయినట్టుగాను రికార్డులో రాశామని తెలిపారు. ఆళ్వారు నాయుడు ఎక్కడ? ఏ సందర్భంలో ఇటువంటి కీలక సమాచారాన్ని చెప్పిందీ ‘కృష్ణా జిల్లా స్వాతంత్య్రసమరయోధులు’ వివరించి ఉంటే మరింత సమగ్రత వచ్చుండేది. అల్లూరిని పట్టుకొన్న సమయంలో ఆళ్వారు నాయుడు ఉన్నారనే విషయం మాత్రం కొన్ని రికార్డుల్లో పొందుపర్చివుంది.
బక్కపల్చటి.. 27 ఏళ్ల ప్రాయం గల ఈ యువకుడే బ్రిటీష్ ప్రభుత్వాన్ని రెండేళ్ల పాటు గడగడలాడించాడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ‘‘ ఆంధ్రాలో స్వాతంత్య్ర సమరం’’ గ్రంధంలో.. ‘‘1924, మే7వ తేదీన మంపలో సీతారామరాజు అరెస్టయ్యాడు. అక్కడి నుంచి అతన్ని కొయ్యూరుకు తీసుకొచ్చారు. ఆయన తప్పించుకోవటానికి ప్రయత్నించగా.. కాల్చిచంపారు’’ అని గ్రంధ కర్తలు బ్రిటీష్ వారి రికార్డుల ఆధారంగా రాశారు. అగ్గిరాజు పట్టుపడిన ప్రాంతం నుంచి సీతారామరాజు తప్పించుకోగా.. మరుసటి రోజున అక్కడికి కొన్ని మైళ్ల దూరంలోని పెట్రోలింగ్ పార్టీకి ఆయన తారస పడ్డారని ‘ది హిస్టరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పోలీస్ 1861-1961’’ గ్రంధంలో పేర్కొన్నారు. ఇలా పట్టుపడిన రామరాజును కొయ్యూరుకు తీసుకెళ్లి కాల్చివేశారని తెలిపారు. దీన్ని బట్టి అసలు సీతారామరాజును 2024, మే 7వ తేదీనే హతమార్చారా? లేక ఆయన్ని కొన్ని రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఆ ఆ తర్వాత తుది ముట్టించారా? లేక ఎవరికీ తెలియని స్థావరంలో కొంతకాలం బంధించారా? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్నన్నమవుతాయి.