ఇరువురి మధ్య ఇప్పట్లో సఖ్యత నెలకొనే సూచనలు కనిపించటంలేదు
బురుజు.కాం Buruju.com : ఎవరైనా కలత చెందుతున్నప్పుడు వారిని అర్ధం చేసుకొని.. వారి అవేదన నివారణకు ఉపక్రమించకపోతే అది మరికొన్ని పరిణామాలకు దారితీయవచ్చు. ఇప్పుడు తెలంగాణ గవర్నరు తమిళిసై విషయంలో అచ్ఛంగా అదే జరుగుతోంది. తాను ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోటోకాల్( అధికారిక మర్యాదలు) లభించటంలేదంటూ గత కొన్ని నెలలుగా వాపోతూ వస్తున్న ఆమె.. తాజాగా ఆ విషయాలను మళ్లీ ప్రస్తావిస్తూనే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, కేసీఆర్ జాతీయ రాజకీయాలు వంటి వివాదాస్పద అంశాలను విలేకర్ల వద్ద ప్రస్తావించి అందరినీ నివ్వెరపర్చారు. ఇంతకు ముందటి గవర్నర్లు ఎవరూ ఇలా మాట్లాడలేదు. అసలు.. గవర్నర్లు విలేకర్లతో మాట్లాడటమే చాలా అరుదు. ప్రస్తుత గవర్నరు తమిళిసై మాత్రం విలేకర్లు పలకరించగానే సంభాషిస్తూ.. తన మనసులోని మాటలను చెప్పేస్తున్నారు.
గవర్నరు తమిళిసై
గవర్నరు తమిళిసై కేవలం తనకు దక్కాల్సిన ప్రోటోకాల్ ను మాత్రమే అడుగుతున్నందున ఆదేదో అమలు చేద్దామని పాలకులు పెద్ద మనస్సుతో ఆలోచించి ఉంటే విషయం ఇక అక్కడితో ఆగిపోయి ఉండేది. గవర్నరు.. ప్రభుత్వంపై లేనిపోని అంశాలతో దిల్లీకి నివేదికలను పంపుతున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్.. భావిస్తున్నారో ఏమో కాని ఆమెను అసలు పట్టించుకోవటంలేదు. ఇటీవల.. భద్రాచలం వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడూ ఆమెకు ఎటువంటి అధికారిక మర్యాదలు లభించలేదు. అంతకు ముందు భద్రాచలం, యాదాద్రి ఆలయాలకు, సమ్మక్క సారక్క జాతరకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి. ఇటువంటి ఆవేదనంతా గుండెల్లో గూడుకట్టుకొని ఉండటంతో అది సందర్భం వచ్చినప్పుడల్లా భయటపడుతోంది. తాజాగా.. రాష్ట్రపతిగా ద్రౌపది ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఆమె దిల్లీలో తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ఇంతకు మందెన్నడూ లేని రీతిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఇంతకు ముందటి గవర్నర్లకు భిన్నంగా.. తెలంగాణ గవర్నరు తమిళసై పత్రికల వారికి అందుబాటులో ఉంటారని పేరు పొందారు
క్షేత్ర స్థాయిలోని పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని ఆమె అన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నందు వల్లనే కేసీఆర్.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని అంచనా వేశారు. తెలంగాణకు కేంద్రం ఉచిత వ్యాక్సిన్, కరోనా సమయంలో అయిదేసి కిలోల చొప్పున బియ్యం ఇచ్చిందని, పెద్ద ఎత్తున జాతీయ రహదారులను మంజూరు చేసిందని వంటి విషయాలనూ ఆమె విలేకర్లకు చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనట్టుగా తన దృష్టికి వచ్చిందనీ అన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే.. ఆమెకు కేంద్ర పెద్దల నుంచి ఏదో భరోసా లభించినట్టు స్పష్టమవుతోంది. అసలే గవర్నరు వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న తెలంగాణ అధికార పార్టీ నేతలకు ఆమె తాజా వ్యాఖ్యలు మరింత రెచ్చకొట్టక మానవు. గవర్నరు వైఖరిని విమర్శిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వటం మినహా ప్రస్తుతం వారు ఇక చేసేదేమీ లేదు. అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా? అనే ఒక చర్చకు వారు తెరతీయవచ్చు.
ఇలా రాజ్ భవన్ లో మహిళా దర్భార్లు నిర్వహించటం, వరద ప్రాంతాల్లో పర్యటించటం వంటివి రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చటం లేదు
ప్రభుత్వ పెద్దలు, అధికారులు తనకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వని విషయాన్ని ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నిర్వాహకులు రాధాకృష్ణకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గవర్నరు తమిళిసై వెల్లడించారు. తన తల్లి రాజ్ భవన్ లోనే చనిపోగా.. ఆ విషయాన్ని ఫోను ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిపేందుకు విఫలయత్నం చేశానని ఆమె చెప్పిన మాటలు.. విన్నవారికి చాలా బాధను కలిగిస్తాయి. ముఖ్యమంత్రి కనీసం ఫోనులోనైనా పరామర్శించలేదని ఆమె తెలిపారు. ఉగాది రోజున రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికీ ఎవరూ రాలేదని ఆమె ఆ ఇంటర్వ్యూలో వాపోయారు. అటువంటి గవర్నరు ఇప్పుడు తన ఆవేదన స్థానే తీవ్ర తరమైన వ్యాఖ్యలు చేస్తుండటాన్ని బట్టి.. రానన్ను రోజుల్లో అధికార పార్టీకి, గవర్నరుకు మధ్య మరిన్ని వివాదాలు ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నరు కూడా కేవలం తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి ఊరుకొంటేనే ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి ఉంటుంది . కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? అనేది రాజకీయ పార్టీల వారు చర్చించుకొనే విషయాలు. గవర్నరు పదవిలో ఉన్నవారు అటువంటి చర్చల్లోకి వెళ్లకూడదు. విపత్తుల సాయం కేంద్రం నుంచి లభించటంలేదని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గవర్నరు మళ్లీ కిషన్ రెడ్డి చెప్పారనే విషయాన్ని విలేకర్ల వద్ద ప్రస్తావించనవసరం లేదు. భాజాపా, తెరాస మధ్య ఒప్పందం ఉందని ఎవరైనా ఉహాగానాలు చేసుకోవచ్చని, తనకు మాత్రం ఆ విషయంపై స్పష్టత ఉందని అనటమూ గవర్నర్ పదవికి వన్నె తెచ్చే మాటలు కానేకావు. ఆమె గవర్నరు కాకముందు తమిళనాడులో భాజపా నాయకురాలుగా ఉండేవారని, ఇప్పుడు గవర్నరుగా కాకుండా పూర్వపు భాజాపా నాయకురాలుగానే ప్రవర్తిస్తున్నారని తెరాస నాయకులు ఇప్పటికే విమర్శిస్తున్నారు. అటువంటి విమర్శలు తప్పనే రీతిలో గవర్నరు వ్యవహరించాలి. అప్పుడే.. గవర్నరు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలుకుండా ఉంటుంది. గవర్నరు తమిళిసైకి ప్రభుత్వం మర్యాదలు చేయటంలేదని ప్రజలూ మదన పడే పరిస్థితి ఉంటుంది.