దేశం కోసం పోరాడిన వారు నిరసన దీక్షల్లో కూర్చోవటమేమిటి?
personBuruju Editor date_range2023-02-26
హైదరాబాదులో ఇందిరా పార్కు వద్ద మాజీ సైనికుల నిరసన దీక్ష
బురుజు.కాం Buruju.com : దేశం కోసం పోరాడిన వారు ధర్నాలు, నిరసన దీక్షలు చేయాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోటం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారు సంతోషంగా జీవించేలా చర్యలను కనుక చేపడుతుంటే మరింత మంది యువకులు సైన్యంలో చేరేందుకు ముందుకు రాగలుగుతారు. తెలంగాణలో మాత్రం మాజీ సైనికులు అనేక సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్నారు. వారి ఇబ్బందులను కడతేర్చటానికంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ‘సిక్స్ మెన్ ’ కమిటీ వల్ల ఇంతవరకు ఒక్క మాజీ సైనికుడికీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణిలో వీరికి నియామకాలూ నిలిచిపోయాయి. క్యాంటిన్లలో ఏమైనా కొనుక్కొందామంటే అక్కడి ధరలూ మండిపోతున్నాయి. ఎక్కడెక్కడికో వెళ్లి కేవలం ప్రైవేటు సెక్యురిటీ ఉద్యోగాలను చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అందుకే ఇప్పుడు మాజీ సైనికులు తమ గోసను ప్రభుత్వానికి తెలియజేయటానికి రోడ్లపైకి రాక తప్పటంలేదు.
నిరసన దీక్షా శిబిరంలో భాజపా నేతలు ఈటల రాజేందర్, డీకే ఆరుణ
తెలంగాణలో ప్రస్తుతం మాజీ సైనికులు 33 వేల మంది, మాజీ సైనికుల వితంతువులు 7,200 మంది కలిపి మొత్తం 40,200 మంది ఉన్నారు. రాష్ట్రంలో సైనిక సంక్షేమ శాఖ అంటూ ఉన్నప్పటికీ దాని వల్ల ఎవరికీ ఎటువంటి లబ్ధి చేకూరటంలేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన మాజీ సైనికులు ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాదుకు తరలి వచ్చి ఇక్కడి ఇందిరా పార్కు వద్ద దీక్షను నిర్వహించారు. తమ సమస్యలను వినాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను వీరు ఆహ్వానించగా.. కేవలం భారతీయ జనతా పార్టీకి చెందిన ఈటల రాజేంద్ర, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జి. హర్షవర్ధన్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు వావిళ్ల వేణుగోపాల రెడ్డి, శాతిరి గంగ రాజు, కె.శ్యాంకుమార్, మురళీకృష్ణ తదితరులు ప్రసంగిస్తూ తమ ప్రధాన సమస్యలను వెల్లడించారు.
మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ఇ.సి.హెచ్.ఎస్) అమలకు ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలోను ఒక ఆసుపత్రిని ప్రత్యేకించాలని ప్రతినిధులు కోరారు. ప్రస్తుతం ఇటువంటి సదుపాయం ఒక్క హైదరాబాదులో మాత్రమే ఉండటంతో మారుమాల ప్రాంతాల వారికి ఇక్కడికి రావటం చాలా కష్టమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అటువంటి ఏర్పాట్లను చేయలేకపోతే తమను రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ వంటి పథకాలకు అర్హులను చేయాలని కోరారు. వారు ప్రస్తావించిన మరికొన్ని సమస్యలు ఇలా ఉన్నాయి.. ‘‘ పక్క రాష్ట్రాల్లో మాదిరిగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించాలి. మాజీ సైనికుల అర్హత మార్కులు అన్ని రకాల పోటీ పరిక్షల్లోను ఇకే పద్దతిలో ఉండాలి. ఉద్యోగ ప్రకటనలను జిల్లాల వారీగా ఇస్తుండటంతో అటువంటి ఉద్యోగాలు ఉండని జిల్లాల మాజీ సైనికులకు అవకాశాలు దక్కటంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ‘సిక్స్ మెన్ ’ కమిటీ వల్ల ఒన గూరిన ప్రయోజనాలు ఏవీ లేనందున ఆ కమిటీని రద్దు చేయటమే ఉత్తమం’’ అని పేర్కొన్నారు.
దేశ సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టి ఇలా పోరాడిన సైనికులు ఇందిరా పార్కువద్దకు వచ్చి నిరసన దీక్షల్లో కూర్చునే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
ప్రతి జిల్లాలోను మాజీ సైనికులకు సామాజిక భవనాలను నిర్మించి ఇవ్వాలని, వీటి నిర్వహణ బాధ్యతలను సైనిక బోర్డు చేపట్టాలని కోరారు. అమర జావన్లకు నివాళులు అర్పించేందుకు ప్రతి జిల్లాలో అమరవీరుల స్థూపాలను నిర్మించి విజయ్ దివాస్, ఆర్మీ, నేవీ డే వంటి కార్యక్రమాలను అక్కడ అధికారికంగా నిర్వహించాలన్నారు . రీజనల్ సైనిక బోర్డు అధికారులు గత ఏడేళ్లగా నియామకాల విషయంలో అన్యాయం చేస్తున్నారని, శాశ్వత సెక్యూరిటీ సంస్థలతో అంతర్గత ఒప్పందాలను కుదుర్చుకొని సెక్యురిటీ గార్డులు తదితర ఉద్యోగాలు.. వారికి అనుకూలంగా ఉన్నారికి మాత్రమే వచ్చేటట్టు చూసుకొంటున్నారని ప్రతినిధులు ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఆశతోనే ఒక్క రోజు దీక్షను చేపట్టామని , సమస్యలు పరిష్కారం కాకుంటే మాత్రం మిలియన్ మార్చ్ తరహాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించేందుకూ వెనుకాడబోమని వారు హెచ్చరించారు.