పాపన్న చరిత్రలోని నిజాల నిగ్గుతేల్చలేమా? ( మొదటి భాగం)
personBuruju Editor date_rangeSun Aug 18 2024 00:00:00 GMT+0530 (India Standard Time)
సర్వాయి పాపన్న
బురుజు.కాం Buruju.com : సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం అంతటితో ఆగిపోకుండా పాపన్న చరిత్రలోని వాస్తవాల వెల్లడికి నడుం కట్టాలి. ప్రస్తుతం అందుబాటులో గల వివిధ రకాల ఆధారాల పరిశీలనకు నిపుణులతో ఒక కమిషన్ ను ఏర్పాటు చేసి, నాటి ముస్లీం చరిత్రకారుల రాతల్లో వాస్తవాలు ఉన్నదీ లేనిదీ నిర్ధారించాలి.
విగ్రహానికి పూలమాలలు వేయటంతో సరిపెట్టకుండా.. పాపన్న చరిత్రలోని వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా నాయకులు ప్రయత్నించాలి
పాపన్న జయంతి, వర్ధంతి రోజుల్లో ఆయన విగ్రహాలకు, పటాలకు పూల మాలలు వేసి ప్రసంగాలు చేసే నాయకులంతా ఇక నైనా పాపన్న జీవితంలోని నిజాలను వెలుగులోకి తేవాలంటూ ప్రభుత్వంపై వత్తడి తేవటం అవసరం. దాదాపు 300 ఏళ్ల క్రితం సర్వాయి పాపన్న Sarvai Papanna ఒక రాజ్య స్థాపన కోసం ప్రయత్నించాడే తప్ప కొందరు చరిత్రకారులు రాసినట్టుగా ఆయన బందిబోటు, స్త్రీలోలుడు, బంధీలతో కోటలను కట్టించిన కటినాత్ముడు కాదని నిరూపించేందుకు వారంతా సంకల్పించాలి. ఇప్పటికైనా నాటి రాతల్ని సరిదిద్దకపోతే పాపన్న చరిత్రపైగల సందిగ్ధం ఇక ముందూ కొనసాగుతుంది. పాపన్నకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో గల ఆధారాలను వివరిస్తూ కొత్త విషయాలతో ‘బురుజు.కాం’ వరస కథనాలను అందివ్వనుంది. అవన్నీ పాఠకులకు తప్పక ఆసక్తిని కలిగిస్తాయి.
జనగామ జిల్లా ఖిలాషాపూరులో.. పాపన్న నివసించిన కోట, మధ్యలో బురుజు. ఇక్కడ తవ్వకాలు చేపడితే భూమి పొరల్లో కొన్ని ఆధారాలు లభించొచ్చు
ఇంతవరకు ఎవరూ చదవని మూడు లక్షలకుపైగా గల మొఘల్ కాలంనాటి పత్రాలను ఇప్పుడు కనుక పరిశీలించగలిగితే చాలా విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రభుత్వం ఒక కమిషన్ ను కనుక ఏర్పాటు చేస్తే అది దేశ విదేశాల్లో జరిపే పర్యటనల్లో పాపడి మరిన్ని రంగుల చిత్రాలూ బయటపడే అవకాశాలు లేకపోలేదు. జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ , తరికొండ కోటల్లో తవ్వకాలు చేపడితే కొన్ని ఆధారాలు లభించొచ్చు. రాయలసీమలో.. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలెగాళ్ల ఇళ్లల్లో సైతం పాపడిపై పాటలు ఎందుకు మార్మోగినట్టు? నాటి ప్రజానీకం పాపడిని హిందూ రాజ్య స్థాపకుడిగా కీర్తించటం వల్లనే అందుకు అనుగుణంగా నాటి చిత్రకారుడు అతను పాము పడగపై కూర్చున్నట్టుగా చిత్తరువును రూపొందించాడా?
నాటి ముస్లీం చరిత్రకారుడు ఖాఫీఖాన్ రాతలు పాపడి పట్ల నిందలు మోపేవిగాను.. అదే సమయంలో మరాఠా ప్రాంతంలో మొఘల్ పాలకులకు ఎదురు తిరిగి.. పాపడికి మాదిరిగానే పోరాడిన శివాజీ కోడలు తారాబాయి విషయంలో మరో విధంగానూ ఉండటానికి కారణాలు ఏమిటీ? 1702-04 సంవత్సరాల మధ్య హైదరాబాదుకు వర్తకులు రాకపోవటానికి కారణం.. సర్వాయి పాపడి దారిదోపిడీలా? లేక మొఘల్ పాలకుల అసంబద్ధ విధానాలా? వంటి పలు ప్రశ్నలకు కమిషన్ అధ్యయనం ద్వారా సమాధానాలు లభించవచ్చు. ( రెండోవ భాగం వచ్చేవారం ‘Buruju.com లో)