బురుజు.కాం Buruju.com : రాష్ట్రాల్లో వరదలు, తుపానులు ఎప్పుడొచ్చినా రాజకీయాలు చోటు చేసుకోవటం సహజం. బాధితులకు ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు కనుక ప్రతి పక్షాలు దాన్నొక బ్రహ్మస్త్రంగా చేసుకొని అధికార పక్షంపై దాడికి దిగుతుంటాయి. ప్రతి పక్షాలదే పైచేయిగాను ఉంటుంది. తెలంగాణలోని తాజా వరదల్లో మాత్రం అధికార పక్షమే ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది. వివిధ రకాల నష్టాలను భర్తీ చేసుకోవటానికి తాము రూ.1,400 కోట్లు కావాలని నివేదికను పంపితే కేంద్రం మాత్రం కేంద్ర బృందాన్ని పంపి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులను సైతం తెలంగాణకు ఇవ్వటంలేదని ఆయన విమర్శించారు. పనిలో పనిగా.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డినీ తూర్పారబట్టారు. నయాపైసా తేని చేతకాని మంత్రిగా ఆయన చరిత్రలో మిగిలి పోతారని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు విపత్తుల నిధులను ఇస్తూనే ఉన్నామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఢీకొనటం మొదలయ్యాక ప్రతి విషయంలోను కేంద్రాన్ని బూచిగా చూపించటం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజా వరదల్లోను కేంద్ర సహాయం లేనందున రాష్ట్రం ఇబ్బందుల పాలవుతోందని రాష్ట్ర సర్కారు ప్రచారం చేస్తోంది. ఇలా చెప్పటం వల్ల.. బాధితులు తమ సమస్యలకు కారణం.. కేంద్రంలోని భాజాపా ప్రభుత్వమేనని భావిస్తారనేది తెరాస శ్రేణుల రాజకీయ ఎత్తుగడ. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులే కేంద్రంపై విమర్శలు గుప్పించటంతో ఇప్పుడు దిగువ స్థాయి పార్టీ నాయకులు ధైర్యంగానే వరద ప్రాంతాలకు వెళ్లి కేంద్రం సాయపడటం లేదంటూ బాధితులకు చెబుతున్నారు. అసలు రాష్ట్రం ఇలా నివేదికను పంపగానే అలా కేంద్రం నిధులను ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఎన్నడూ అటువంటి పరిస్థితి లేనేలేదనే విపత్తుల నిర్వహణ శాఖ నుంచే సమాధానం వస్తోంది. కేంద్రం నిధులను ఇవ్వాలంటే అందుకు చాలా కసరత్తు ఉంటుంది. అందులో భాగంగా తొలుత కేంద్ర బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వరద , తుపాను వల్ల ఉత్నన్నమైన నష్టాలను అంచనా వేస్తాయి. ఇటువంటి బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే కేంద్రం నిధులను ఇస్తుంది. అంతే తప్ప రాష్ట్రం అడిగినంత మొత్తాన్ని కాని, రాష్ట్రం అడగ్గానే సొమ్మును జమచేయటం కాని మునుపెన్నడూ లేనేలేదు. అయినప్పటికీ తెరాస అగ్రనాయకత్వం ధ్వజమెత్తుతోందంటే అది.. మోదీ సర్కారుపై గుప్పిస్తున్న విమర్శల్లో భాగమేనని తేలుతోంది .
వరంగల్ జిల్లాలో వరద పరిస్థితి
కేంద్రం అసలు రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధి ( ఎస్ డి ఆర్ ఎఫ్ ) నుంచి 2018 తర్వాత ఒక్క రూపాయిని కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ విమర్శించగా.. తెలంగాణకు ఎంతెంత ఇచ్చిందీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరాలను చెప్పారు. రాష్ట్రాలకు విపత్తుల నిర్వహణ కోసం ఏటా ఏ మేరకు ఇవ్వాలో 15వ ఆర్థిక సంఘం ఇప్పటికే సిఫార్సుచేసింది. దీని ప్రకారం.. 2021-26 మధ్య అయిదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం విపత్తుల నిర్వహణ కోసం రూ.3,310 కోట్లను ఇవ్వాలి. ఇది కాకుండా.. రాష్ట్ర విపత్తుల పునరావాస కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి మరో రూ. 827 కోట్లు ఉంటాయి. ఇటువంటి నిధులకు అదనంగా.. ప్రత్యేకంగా సాయం చేయాల్సిన సందర్భాలు ఏర్పడినప్పుడు మాత్రమే కేంద్రం నష్టాలను అంచనా వేయించుకొని సాయపడుతుంది. తాము అడిగిన దాంట్లో అయిదు శాతమైనా ఇవ్వలేదంటూ ఉమ్మడి రాష్ట్ర పాలకులు విపత్తుల సమయంలో వాపోయేవారు. అయితే అప్పటి వారంతా కేంద్ర బృందాల రాకకోసం ఎదురు చేసేవారు. వారికి నష్టాల తీవ్రతను కళ్లకుకట్టినట్టు చూపించి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించేవారు. అంతే తప్ప.. తాము అడిగిన వెంటనే సాయాన్ని చేసి తీరాలనే ధోరణిని మాత్రం కనబర్చేవారు కాదు.
ఇటీవల హైదరాబాదుకు వచ్చిన మొదీ.. కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఉపన్యసించి తన రాజకీయాన్ని ప్రదర్శించారు
తెలంగాణలో భాజపా బలుపడుతున్న సంకేతాలు వస్తుండటంతో ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అధికార పార్టీ అగ్రనేతలు ఉపయోగించుకొంటున్నారు. తాజా వరదలకు చాలా చోట్ల భారీ నష్టాలు వాటిల్లాయి. అవన్నీ ఇప్పటికిప్పుడు పూడ్చేంతటి నిధులు అందుబాటులో లేవనే విషయం ప్రభుత్వం తరచు ఆర్బీఐ వద్దకు ఓవర్ డ్రాఫ్టుకు వెళ్తుండటాన్ని బట్టే స్పష్టమవుతోంది. రైతు బందు వంటి ఉచిత పథకాల వల్ల రాబడుల కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుండటంతో ప్రభుత్వం అప్పులకు ఎగబడక తప్పటంలేదు. వరద ప్రాంతాలకు కేంద్రం రిక్త హస్తం చూపిస్తోందని ప్రచారం చేయగలిగితే ప్రజలు తమ వైపు చూపించాల్సిన వేలును దిల్లీ వైపు చూపిస్తారనే తెరాస నాయకుల భావన. ప్రజలు నిజంగా అలా కేంద్రాన్ని నిందించి సరిపెట్టుకొంటారా? అనేది ఇప్పుడు సమాధానం రావాల్సిన ప్రశ్న.