తమిళనాడులోని వెయ్యేళ్ల క్రితం నాటి తంజావూరు బృహదీశ్వరాలయంపై టోపీ, టీషర్టు ధరించి ఉన్న శిల్పం ఇదే
మన్నేపల్లి విజయ సారథి Buruju.com : వెడల్పైన టోపీ, మోచేతుల వరకు టీషర్టు ధరించిన వ్యక్తి అనగానే మనకు ఆధునిక మనుషులే గుర్తుకు వస్తారు. మరి అదే టోపీ, టీషర్టు ధరించిన వ్యక్తి శిల్పం వెయ్యేళ్ల క్రితం నాటి తంజావూరు ఆలయంపై కనిపిస్తుండటం నిజంగా అద్భుతమే. అదేమీ ఇటీవల కాలంలో చెక్కి పెట్టింది కానే కాదని నిపుణులు తేల్చారు. ఆ టోపీవాలా ఎవరు? మన ప్రఖ్యాత ఆలయంపై ఏ కారణాల వల్ల స్థానాన్ని సంపాదించుకోగలిగాడు? వంటివి మన వాళ్లు ఎప్పటికి తేలుస్తారో? తెలంగాణలోని 850 ఏళ్ల క్రితం నాటి రామప్ప ఆలయంలోని ఒక శిల్పానికి ఆధునిక యువతులు ఉపయోగించే హైహీల్స్ చెప్పులు ఉంటాయి. అవీ మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తాయి.
తంజావూరు ఆలయం వద్ద వ్యాసకర్త మన్నేపల్లి విజయ సారథి, ఆయన శ్రీమతి
ఆ నాటి హిందూ ఆలయాలు ప్రతి ఒక్కటీ ఏదో ఒక ప్రత్యేకతను చాటూనే ఉంటుంది. యునెస్కో గుర్తింపును పొందిన తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయంలోనైతే అటువంటి ప్రత్యేకతలకు లెక్కేలేదు. అసలు ఆ ఆలయ నిర్మాణమే వెయ్యేళ్ల క్రితం చోళ రాజులకు ఎలా సాధ్యమయ్యిందో ఇప్పటికీ మనకు అంతు చిక్కదు. ఎందుకంటే ఆలయ గోపురం వద్దకు ఏకంగా 80 టన్నుల గ్రానైట్ కలశాన్ని తీసుకెళ్లి సున్నం, ఐరన్ లేకుండా ఎలా అతికారో మనకు తెలియదు. ఆలయం దిగువ భాగంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. వీటిలోకి వెళ్లి ఇంకా పరిశోధనలంటూ చేపట్టనేలేదు. ఆలయ సమీపంలోనే నాటి చోళ రాజుల అంత:పురం ఉండేదని చెబుతారు. అక్కడి నుంచి రాజు,రాణి తదితర ముఖ్యులు ఆలయానికి రావటానికి ఈ సొరంగ మార్గాలను ఉపయోగించినట్టుగా భావించొచ్చు. ఇటువంటి రహస్యాల మాట అటుంచి, ఆలయంపై గల ఒక శిల్పాన్ని చూస్తే మాత్రం మనకు అసలు అది వెయ్యేళ్ల క్రితం చెక్కిందంటే నమ్మశఖ్యంకాదు. ఇటీవల నేను ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఆ టోపీ వాలను చూసి నివ్వెరపోయాను.
తెలంగాణలోని రామప్ప ఆలయం శిల్పానికి గల హైహీల్స్
ఆలయం చుట్టూ గల ఇతర శిల్పాలకు మాదిరిగానే అదీ ఉన్నందున అది ఆనాటిదే. రెండువేల సంవత్సరాల క్రితమే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల పరిధిలోని రాజులు విదేశీ రాజులతో వర్తక సంబంధాలను కలిగివుండేవారు. పలు చోట్ల రోమన్ బంగారు నాణాలు లభించటం ఇందుకో చక్కటి నిదర్శనం. తంజావూరు ఆలయంపై చెక్కిన శిల్పం అలా ఏదైనా దేశపు రాజుది అయ్యిండొచ్చు. అతనేమి సామాన్యుడు కాదని శిల్పం చుట్టుూ గల ఆకృతులను పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. టోపీ పెట్టుకొని ఉన్న ఆ వ్యక్తి తన ఎడమచేతి మడమపై కుడిచేతి మడమను వేసుకొని ఉండటాన్ని బట్టి అతను తన ముందు గల ఒక ఎత్తైన వస్తువుపై అలా చేతులను అన్చినట్టు తేలుతోంది. కళ్లు మూసుకొని అతను నోటితో ఏదో ఉచ్ఛరిస్తున్నట్టుగానూ ఉంది. అతనికి అటూ ఇటు కొంత పైభాగంలో ఇద్దరు వీర వనితలు కత్తి, డాలు ధరించి ఉన్నారు. పైన ఒక ఆర్చ్ కూడా ఉంది.
తంజావూరు ఆలయం
వీటన్నింటినీ బట్టి అతను ఖచ్చితంగా ఏదో ఒక దేశం రాజు అయ్యింటాడు. కొన్ని ఆలయాలకు వెళ్లినప్పుడు డ్రెస్ కోడ్ లో భాగంగా ఇప్పుడు పంచెను ధరిస్తున్నట్టుగానే ఆ రోజుల్లో ఆ విదేశీ రాజు ఇలా హిందు ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు కిరీటాన్ని, కవచాన్ని పక్కన పెట్టి టొపీ, షర్టును ధరించేవారేమో? 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ దేవరాయులు తిరుమల సందర్శనకు వచ్చేటప్పుడు కిరీటాన్ని కాకుండా పొడుగు టోపీని ధరించటం ఈ సందర్భంగా గమనార్హం. ఆయన జీవించిన కాలంలోనే రూపొందించిన అటువంటి నిలువెత్తు శిల్పాన్ని ఇప్పుడు తిరుమల ఆలయంలో మనం చూడొచ్చు. ఏదేమైనా ఔత్సాహికులకు ఇవన్నీ చక్కటి పరిశోధనాంశాలు ( వ్యాసకర్త: మన్నేపల్లి విజయ సారథి-ఆంధ్రా బ్యాంకు విశ్రాంత అధికారి, హైదరాబాదు)