అంగనవాడీ ఉద్యోగులను ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ గుర్తించాలి
personBuruju Editor date_range2023-03-02
మార్చి 3వ తేదీన నిరసన కార్యక్రమానికి హాజరైన అంగనవాడీ ఉద్యోగులను ఉద్ధేశించి మాట్లాడుతున్న సంఘ ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
బురుజు.కాం Buruju.com : మహిళ, శిశు సంక్షేమంలో అంగనవాడీ ఉద్యోగుల పాత్ర బాగా పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వారికి వివిధ సదుపాయాలను కల్పించాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు అంగనవాడీలకు పదవీ విరమణ ప్రయోజనాలను, పింఛను, బోనస్ వంటి వాటిని సమకూరుస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమనూ గుర్తించాలంటూ తెలంగాణలోని అంగనవాడీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగనవాడీ వర్కర్ అనే పేరును అంగనవాడీ టీచరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చటం బాగానే ఉన్నప్పటికీ.. అందుకు తగిన రీతిలో వేతనం , భత్యాలు తదితరాలను ఇవ్వాలి కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 20 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మార్చి 1,2,3 తేదీల్లో పలువురు అంగనవాడీ ఉద్యోగులు సమ్మెను నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
సమ్మె సమయంలో.. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అంగనవాడీ ఉద్యోగులు
తెలంగాణలో 35,711 అంగనవాడీ కేంద్రాలు ఉండగా వాటిలో దాదాపు 68 వేల మంది టీచర్లు, హెల్పర్లు విధులను నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో తల్లులు, బాలింతలు, పిల్లలు కలిపి 21 లక్షల మంది వరకు లబ్ధి పొందుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఉద్యోగులతో 2017, నవంబరు నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ఒక సమావేశాన్ని నిర్వహించి కొన్ని హామీలను ఇచ్చారు. వర్కరు పేరును అదే రోజున ఆయన టీచరుగా మార్పు చేసి, వేతనాలను కొంత మేర పెంచారు.
అంగనవాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లలో ఇవి కొన్ని
ఇదంతా జరిగి అయిదేళ్లు అయినా ఇంతవరకు చాలా సమస్యలు పరిష్కారం కాలేదని సీఐటీయుకు అనుబంధంగా ఉన్న తెలంగాణ అంగనవాడీ టీచర్లు , హెల్పర్ల సంఘం పేర్కొంటోంది. సంఘం ఇచ్చిన పిలుపుతో పలువురు ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మెలో పాల్గొని జిల్లా కేంద్రాల్లో ధర్నా, ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. అంగనవాడీ టీచర్లను పర్మినెంటు చేయాలని, వారికి కనీస వేతనం, పింఛను, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత వంటి సదుపాయాలను కల్పించాలని అడుగుతున్నట్టు సంఘ పధాన కార్యదర్శి పి.జయలక్ష్మి.. ‘బురుజు’ ప్రతినిధికి తెలిపారు. పేరు మారినందున టీచరు మాదిరిగా వేతనాలూ లభిస్తాయని వారంతా ఆశించారని అన్నారు. తమిళనాడు, పాండిచ్ఛెరి రాష్ట్రాలు అంగనవాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించగా.. తమిళనాడు, కర్ణాటకలలో హెల్త్ కార్డులను అందజేశారని ఆమె తెలిపారు.
ర్యాలి నిర్వహిస్తున్న అంగనవాడీ ఉద్యోగులు
సమ్మె చేస్తున్నట్టుగా ఆయా జిల్లాల్లోని అధికారులకు అందజేసిన నోటీసుల్లో ప్రధానంగా పేర్కొన్న డిమాండ్లలో కొన్ని ఇలా ఉన్నాయి.. తెలంగాణలో పదవీ విరమణ ప్రయోజనాల కింద అంగనవాడీ టీచరుకు రూ.5లక్షలు, హెల్పరుకు రూ.3లక్షలు ఇవ్వాలి. వేతనంలో సగం మొత్తాన్ని పింఛనుగా ఇవ్వాలి. ఐసీడీఎస్ బడ్జెట్టును పెంచి, ఉద్యోగులు అందరికీ హెల్త్ కార్డులను సమకూర్చాలి. కార్మికులను వేధించేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం 2018, అక్టోబరులో పెంచిన విధంగా టీచరుకు రూ.1,500, హెల్పరుకు రూ.750 , మినీ వర్కరుకు రూ.1,250 చొప్పున మొత్తాలను బకాయిలతో సహా చెల్లించాలి. ఉద్యోగులకు వేతనంతో కూడిన సిక్ లీవులను ఇవ్వాలి. 2017 నుంచి టీఏ, డీఏ , ఇంక్రిమెంట్, ఇన్చార్జ్ భత్యాలను ఇవ్వాల్సివుంది. ఆరోగ్య లక్ష్మి మెనో ఛార్జీలను 2015 నుంచి పెంచనేలేదు. పెంపుదల లేనందున అంగనవాడీలు తీవ్రంగా నష్టపోతున్నారు. మినీ వర్కర్లను ప్రధాన అంగనవాడీలుగా గుర్తించేందుకు ఆనేక షరతులు పెడుతూ ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయటంలేదు’’ అని పేర్కొన్నారు.