వరంగల్ కోట శిథిలాల్లో కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమ దేవి ! (రెండవ భాగం)
personBuruju Editor date_range2023-02-23
వరంగల కోట శిథిలాల్లో కనిపించే అద్భుత శిల్ప సంపద
బురుజు.కాం Buruju.com : (డావిన్సీ గీసిన మోనాలిసా చిత్తరువుపై ప్రపంచ వ్యాప్త అధ్యయనాలను మనం చాల ఆసక్తిగా తెలుసుకొంటాం. ఒకప్పుడు తెలుగు ప్రాంతాలను జనరంజికంగా పాలించి, కొన్నిచోట్ల శిల్ప రూపాల్లో కనిపించే మన రాజులు, రాణుల గురించి మాత్రం మనం పట్టించుకోము. ఆయా శిల్పాల హావ భావాలు, దుస్తులు, ఆభరణాలు తదితరాల ఆధారంగా నాటి సామాజిక అంశాలనూ అంచనా వేయటానికి వీలవుతుంది. ఆయా రాజుల పాలన కాలంలోనే ఏర్పాటైన శిల్పాలపై బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది రెండోవది. విజయనగర రాజులు, రాణుల శిల్పాలు తిరుమల ఆలయంలో ఉన్నట్టుగా ఇప్పటికే మొదటి కథనంలో వెల్లడించింది) వరంగల్ Warangal కోటకు వెళ్తే మనకు అక్కడ అనేక శిధిలాలు కనిపిస్తాయి. వాటిలో.. ఏనుగు తొండం మీద నిలబడిన సింహంపై.. కత్తి , డాలు ధరించి ఉన్న స్త్రీమూర్తి ప్రతిమ ఒకటి ఉంటుంది. ఆ ప్రతిమ కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమ దేవిదే. శిధిలాల్లో బాగా గాలిస్తే తప్ప ప్రస్తుతం ఆమెను చూడలేని పరిస్థితి ఉంది. రాణి రుద్రమ దేవి ఈమేనంటూ పురావస్తుశాఖ వారు అక్కడ ఒక బోర్డును కనుక ఏర్పాటు చేస్తే చరిత్ర పట్ల ఆసక్తి గలవారు అందరికీ ఆమె గురుంచి తెలుస్తుంది.
వరంగల్ కోటలోని శిథిలాల్లో.. ఒక స్థంభంపై శిరస్త్రానాన్ని ధరించి కనిపిస్తున్న రాణి రుద్రమ దేవి
దాదాపు 800 ఏళ్ల క్రితం.. సేవుణులతో చేసిన యుద్ధంలో తన విజయానికి గుర్తుగా రుద్రమదేవి Rani Rudrama Devi తన పాలనా కాలం ప్రారంభంలోనే వరంగల్ కోటలో ఒక మండపాన్ని నిర్మించింది. మండప నిర్మాణ సమయంలో అంటే.. ఆమె జీవించి ఉన్న కాలంలోనే ఆమె శిల్పాన్ని చెక్కినందున ఆమె రూపురేఖలను ఇప్పుడు మనం అంచనా వేయవచ్చు. రణ క్షేత్రంలో ఆమె ఏ విధంగా కరవాలాన్ని పట్టుకొని స్వైరవిహారం చేసేదో చూడవచ్చు. ఆ శిల్పం రాణి రుద్రమదేవిదేనని ప్రముఖ పురావస్తు పరిశోధకులు దివంగత పీవీ పరబ్రహ్మశాస్త్రి తన ‘కాకతీయులు’ అనే పుస్తకంలో నిర్ధారించి.. ప్రతాపరుద్రుడి ప్రతిమ కూడా అక్కడ ఉన్నట్టు వెల్లడించారు. శిధిలాల్లోనే ఒక సింహంపై ఒక పిల్లవాడు పడుకొని ఉన్న బంగిమను ఇప్పుడు మనం చూడవచ్చు. చేతితో సింహం తోకను ఎత్తి పట్టుకొన్నట్టు, ఒక కాలును సింహం నోటి దగ్గర పెట్టినట్లు చిత్రించి, సింహంపై ఆడుకొంటున్నట్టుగా ఉన్న ఆ పిల్లవాడు రుద్రమ దేవి మనవుడు ప్రతాప రుద్రుడని పరబ్రహ్మ శాస్త్రి స్పష్టంచేశారు. కాకతీయుల చరిత్రపై మంచి పట్టు ఉన్న పరిశోధకులుగా పరబ్రహ్మ శాస్త్రి పేరుపడ్డారు. అప్పట్లో రుద్రమ దేవికి రాయగజకేసరి అనే బిరుదు ఉండేది. దానికి తగ్గట్టుగానే మండప స్థంభంపై ఆమె ప్రతిమను అప్పట్లో శిల్పులు చెక్కినట్టు స్పష్టమవుతోంది.
రుద్రమ దేవి తర్వాత.. కాకతీయ సింహాసనాన్ని అధిహోరించి.. చివరి కాకతీయ రాజుగా మిగిలిపోయిన ప్రతాప రుద్రుడి చిన్ననాటి శిల్పం ఇది
పరబ్రహ్మ శాస్త్రి చెప్పిన ప్రతిమలను చూసేందుకు వరంగల్ కోటకు ఇటీవల ‘బురుజు’ ప్రతినిధి వెళ్లినప్పుడు రాతికోట మెట్లదారి వద్ద కూడా రాయగజకేసిరి బిరుదును వెల్లడిస్తున్న ప్రతాపరుద్రుడి చిన్ననాటి శిల్పాలు చాలా కనిపించాయి. వీటిపై ఇంతవరకు సమగ్ర పరిశోధనంటూ ఎవరూ చేపట్టలేదు. వివిధ ప్రాంతాల్లో రుద్రమదేవి విగ్రహాలు వెలుగు చూశాయంటూ పత్రికల్లో వార్తలు రావటమే తప్ప ఆ తర్వాత ఆ విగ్రహాలు నిజంగా రుద్రమ దేవివేనా? వాటిని ఆ తీరులో ఎందుకు చెక్కించి ఉంటారు? వంటి ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల నుంచి అధికారికంగా సమాధానాలేవీ లభించటమేలేదు. తలపైన ఛత్రం (గొడుగు) పట్టి ఉంటే ఆమె రాణేయేనని ఖచ్చితంగా చెప్పవచ్చని పురావస్తు శాఖ అధికారి కన్నబాబు ‘బురుజు’కు తెలిపారు. వరంగల్ దగ్గరలోని బొల్లికుంటలో కనిపించే ఈ తరహా శిల్పాలు రుద్రమదేవివేనని ఆయన చెప్పారు. రుద్రమ దేవి అక్కడ చనిపోయినట్టుగా అక్కడి వివిధ బంగిమల శిల్పాలను బట్టి స్పష్టమవుతోందని వివరించారు.
వరంగల్ కోట శిల్పాలను తిలకించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. వాటి గురించి చెప్పేందుకు అక్కడ ఎవరూ ఉండరు
కాకతీయులు, అనంతరం రెడ్డి రాజులు తదితరుల ఏలుబడిలో కొందరు ప్రభువుల విగ్రహాలను అప్పట్లో ఆలయాలు, మండపాల స్థంభాలపై శిల్పులు చెక్కినా వాటి గురించి ఎవరికీ అంతగా తెలియక పోవటానికి కొన్ని ఇతర కారణాలూ ఉన్నాయి. తెలుగు చరిత్రకారుడు ఎవరైనా తాను పలనా ప్రభువును గుర్తించానంటూ ప్రకటించగానే మరో తెలుగు చరిత్రకారుడు ‘అది నిజంకాదు’ అని సులువుగా కొట్టిపడేయటం కూడా రాజుల గుర్తింపునకు ఒక సమస్యగా మారింది ( తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆలయంలో.. రాజు, రాణి శిల్పాలను వేర్వేరుగా ఎందుకు చెక్కినట్టో.. మూడో భాగం వచ్చేవారం Buruju.com లో..)