వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
personBuruju Editor date_range2022-08-31
నాటి గంగుభాయి.. సినిమాలో గంగుభాయిగా నటించిన అలియాభట్.. వేశ్యల సమస్యలను గంగుభాయి నుంచి తెలుసుకొన్న నాటి ప్రధాన మంత్రి నెహ్రు
బురుజు.కాం Buruju.com : వ్యభిచారాన్నీ ఒక వృత్తిగా గుర్తించి తమను ఇతరులతో సమానంగా గౌరవించాలంటూ ముంబాయిలో 60 ఏళ్ల క్రితం గంగూభాయి అనే మహిళ చేసిన పోరాటం.. సరిగ్గా ఆమె జీవిత కథ ఆధారంగా సినిమా వచ్చినప్పుడే ఫలితాన్ని ఇవ్వటం యాదృచ్చికం. వ్యభిచారం కూడా ఇతర వృత్తులతో సమానమైనదేనని, అటువంటి వృత్తిలోని వారిని పోలీసులు అరెస్టు చేయటం, క్రిమినల్ కేసులు పెట్టటం వంటివి చేయవద్దని సుప్రీం కోర్టు 2022, మే 19వ తేదీన తీర్పు చెప్పింది. ఇటువంటి ఉత్తర్వుల కోసమే 1960 ప్రాంతంలో ముంబాయిలోని అతి పెద్ద వేశ్యవాటికైన కామాటిపురకు చెందిన గంగూభాయి.. అప్పటి ప్రధాన మంత్రి నెహ్రు వద్దకు సైతం వెళ్లింది. కామాటిపురలోని దాదాపు నాలుగు వేల మంది మహిళల సంక్షేమం కోసం ఆమె పాటు పడి అక్కడి వారి గుండెళ్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేయించుకోగలిగింది. కామాటిపుర గోడలపైన, కొన్ని ఇళ్లలోను ఇప్పటికీ ఆమె ఛాయాచిత్రాలు కనిపిస్తాయి. ఆమె జీవితం ఆధారంగా తీసిన ‘ గంగూభాయి కతియావాడి’ Gangubhai kathiawadi హిందీ చిత్రం ప్రస్తుతం తెలుగు డబ్బింగుతో నెట్ ప్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రముఖ నటి అలియాభట్.. గంగూభాయిగా అద్భుతంగా నటించి.. మంచి విజయాన్ని అందుకొన్న ఈ సినిమా.. 2023 ఆస్కార్ అవార్డుకు భారత్ నుంచి ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారంలోకి వచ్చింది.
గంగూభాయి సినిమాలోని వేశ్య పాత్రదారులు. వీరి కొన్ని సన్నివేశాలు హ్రుదయాలను ద్రవింపచేస్తాయి
గుజరాత్ లోని కతియావాడికి చెందిన గంగూభాయి 1939లో జన్మించింది. బాలివుడ్ సినిమాల్లో నటించాలనే కోర్కెతో ముంబాయికి తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లి.. అక్కడ అతని చేతుల్లో మోసపోతుంది. ఆమెను అతను ఒక వేశ్యా గృహానికి రూ. వెయ్యి రూపాయలకు అమ్మేయటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వేశ్యగా మారుతుంది. వ్యభిచార వృత్తిలో గల మహిళలంటే సమాజం చిన్న చూపు చూడటాన్ని ఆమె సహించలేకపోతుంది. తమకూ సమాన గౌరవం కావాలంటూ నినదిస్తుంది. మాఫీయాల అడ్డాలో ముందుకెళ్లాలంటే అదే మాఫియా నాయకుల అండదండలు తప్పనిసరని గ్రహించిన ఆమె.. కరీంలాలాను ఆశ్రయిస్తుంది. ఆమె ఆదర్శాలు నచ్చటంతో ఆమెను కామాటిపుర ప్రాంత ఎన్నికల్లో అధ్యక్షురాలు ఆయ్యేలా అతను సహకరిస్తాడు. ఇటువంటి పదవి ఒకటి లభించటంతో ఆమె ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వద్దకు సైతం వెళ్లి తన వినతులను తెలపగలుగుతుంది. వ్యభిచారాన్ని చట్ట బద్దం చేయటం కుదరదు కాని వినతుల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇస్తారు. కామాటిపురను ఖాళీ చేయించి అక్కడ ఒక కాంప్లెక్స్ కట్టాలనే కొందరి పన్నాగాలను ఆమె కరీంలాల్ అండతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతుంది. గంగూభాయి అసలు పేరు గంగా హరిజీవన్ దాస్. ఆమె 1977లో మృతి చెందింది.
కామాటిపురలో ఇటువంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి
గంగూభాయి కతియావాడి సినిమాలోని కొన్ని మాటలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తాము ఈ వృత్తిలో ఉండబట్టే సంసారాలు సజావుగా ఉంటున్నాయని ఒక సందర్భంలో ఆమె అంటుంది. తామే కనుక లేకపోతే అక్రమ సంబంధాలు, అత్యాచారాలు పెరుగుతాయనేది ఆమె భావన కావచ్చు. వ్యభిచారాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో చట్ట బద్దం చేసి.. అత్యాచారాలు ఏమేరకు తగ్గాయో అధ్యయనం చేయాలనే వాదనలు చాలా కాలంగా ఉన్నాయి. గంగూభాయి వంటి వారు ఎన్ని పోరాటాలు చేసినా.. దశాబ్ధాల తరబడి వేశ్యలు.. పోలీసుల వేధింపులకు లోనవుతూనే వచ్చారు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలోనైనా వారి జీవితాల్లో మార్పులు రావచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని సుప్రీం కోర్టు పేర్కొని.. వేశ్యగా మారటం చట్ట విరుద్దం కాదని, వ్యభిచార గృహాల నిర్వహణ మాత్రం చట్ట విరుద్దమవుతుందని స్పష్టం చేసింది. ఇటువంటి అంశాలపై 2011లో ప్యానల్ చేసిన సిఫార్పులపై ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది .
ముంబాయి కామాటిపురలో గంగూభాయి విగ్రహం. తన ఇంటిలో గంగూభాయి పటానికి నమస్కరిస్తున్న మహిళ
జర్నలిస్టు హుస్సేన్ జైరీ.. రాసిన ‘మాఫీయా క్వీన్ ఆఫ్ ముంబాయి’ అనే పుస్తకమే గంగూభాయి సినిమాకు ఆధారం. గంగూ చేసే పోరాటానికి హుస్సేన్ జైరీ అండగా నిలిచాడు. ఇటువంటి కారణంగానే ఆయన ఆమెపై పూర్తి వివరాలతో ఒక గ్రంధాన్ని రాయగలిగారు. సినిమాలో మాఫియా డాన్ కరీంలాల్ పాత్రలో ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ నటించగా.. సంజయ్ బన్సారీ దర్శకత్వం వహించారు.