దున్నపోతును పట్టుకొనే క్రమంలో మనషుల రాక్షస ప్రవృత్తి బయట పడుతుంది
బురుజు.కాం Buruju.com : ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు’ అని మనిషి ఎలా మారిపోతున్నదీ ఒక అద్భుత పాట రూపంలో చెప్పారు ప్రజా కవి అందెశ్రీ. ఆధునిక మానవుడి అడుగులు ఇప్పుడు రాక్షసత్వంతో నిండి ఉంటున్నాయి. అతనిలో ఆది మానవుడి లక్షణాలను చాటిచెప్పి.. ప్రేక్షకుడిని ఉలిక్కిపడేటట్టు చేసే మలయాళీ చిత్రమే ‘జల్లికట్టు’. ఆస్కార్ అవార్డు బరికి భారత్ తరపున ఎంపికైన తర్వాత ఇది అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించింది. దీంతో ఇది తెలుగు డబ్బింగుతోను ఓటీటీ వేదికపై అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది.
దున్నపోతు కోసం అదిమానవుల్లా ఒకరినొకరు చంపుకోవటానికీ వెనుకాడరు
కసాయివాడి వేటు నుంచి తప్పించుకొన్న ఒక దున్నపోతు.. పంటలను తొక్కుతూ.. అడ్డొచ్చినవారిని కుమ్ముతూ.. తనను తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. దాన్ని తొలుత తామే పట్టుకొన్నామని ప్రకటించుకొని.. దాని మాంసాన్ని రుచి చూసేందుకు గ్రామస్తులంతా గుంపులుగా విడిపోయి.. రాత్రివేళ దాని కోసం గాలిస్తుంటారు. ఇటువంటి క్రమంలో ఒకర్నొకరు పోటీపడుతూ.. జంతువుల ఆహారాన్ని పంచుకోవటానికి ఆది మానవుల గుంపులు ఏ విధంగా ఒకదానితో మరొకటి హింసించుకొన్నాయో.. అలా వీరూ ప్రవర్తిస్తారు. తప్పించుకొని తిరుగుతున్న దున్నపోతును పట్టుకోవటమనే అతి చిన్న అంశం ఆధారంగా తీసిన ఈ సినిమాను ప్రేక్షకుడు మామూలు సినిమాల్లా కాకుండా.. దీని ద్వారా ఏదో చెబ్బబోతున్నారనేది దృష్టిలో పెట్టుకొని చూడాలి. అప్పుడిదొక గొప్ప చిత్రంగా అనిపిస్తుంది.
నాటి అదిమానవులూ ఇలానే ప్రవర్తించేవారు
ఆధునికత ఆకాశమంత ఎత్తునకు ఎగబాకుతున్నా.. మనిషిలోని రాక్షస ప్రవృత్తి మాత్రం అలాగే ఉంటోందని చెప్పటానికి నిత్య సంఘటనలు చాలనే ఉంటున్నాయి. దస్త్రాన్ని ముందుకు కదపటానికి లంచాన్ని గుంజటం, స్వల్ప కారణాలతో కిరాతకంగా కత్తులతో నరికి వేయటం, పీకలవరకు తాగి రోడ్లపైన విచ్చలవిడిగా వాహనాలను నడపటం, కన్నవాళ్లనే కనికరం ఏమాత్రం లేకుండా వృద్ధ తల్లితండ్రులను కర్కసంగా ఇంటి నుంచి గెంటివేయటం , సాటి మనిషి.. రోడ్డుపై ప్రమాదానికి లోనయ్యి గిలాగిలా కొట్టుకొంటున్నా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించటం, సామూహిక అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని దారుణంగా హతమార్చటం, ప్రభుత్వ పథకాల సొమ్మునంతా కాజేయటం.. ఇవన్నీ మనిషన్నవాడు మాయమైపోతున్నాడని చెప్పే లక్షణాలే. దున్నపోతును పట్టుకొనే క్రమంలో బహిర్గతమయ్యే మనిషిలోని రాక్షస ప్రవర్తన ప్రేక్షకుడిని తప్పకుండా ఉలిక్కిపడేటట్టు చేస్తుంది. సరైన కథంటూ లేకుండా ఏవేవో సినిమాలను తీసిపడేస్తున్న దర్శకులు ఇటువంటి చిత్రాల వైపు మొగ్గు చూపిస్తే ప్రయోజనం ఉంటుంది. దున్నపోతు దాడి నుంచి తప్పించుకొంటూ వచ్చిన వ్యక్తిని తన అప్పును తీర్చాల్సిందిగా అడగటం, సాటి మనషులనే భావన ఏమాత్రం లేకుండా అందరినీ హేళన చేస్తూ ప్రవర్తించటం, తినటం, తాగటం మినహా ఇక తమకు దేనితోను సంబంధం లేనట్టుగా ప్రవర్తించటం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ఇవన్నీ చూసినవారికి ‘అవును కదూ.. నేనూ అలాగే ప్రవర్తించాను కదూ’ అనే భావన స్పురించకమానదు. మనిషికన్నా పశువే నయం అన్న అభిప్రాయమూ కలుగుతుంది. ఇలా ఆలోచింపజేయటంలోనే దర్శకుడు లిజోజోస్ కృతకృత్యులయ్యి.. చిత్రాన్ని ఆస్కార్ బరివరకు వేళ్లేటట్టుగా చేయగలిగారు.
జల్లికట్టు చిత్రంలోని వివిధ సన్నివేశాలు
మూల చిత్రంలోని కథ.. కేరళలోని మారుమూల గ్రామానికి చెందినది. గ్రామస్తులు.. గొడ్డు మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. సినిమా ఓటీటీ వేదికపై తొలుత మళయాలంలోనే ఆంగ్ల టైటిల్స్ తో వెలువడింది. కథ కేరళకు సంబంధించినదిగా భావిస్తూ సినిమాను చూస్తేనే మరింతగా ఆకట్టుకొంటుంది. తెలుగు డబ్బింగులోని కథ అనంతపురం జిల్లాలోని గ్రామానికి చెందినదిగా చూపించటంతో దీనిలో వాస్తవికత ఎంతవరకు ఉందనే సందేహం తలెత్తుతుంది. కేరళలోని ఇళ్లు తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లకు భిన్నంగా ఉంటాయి. అక్కడి చాలా గ్రామాల్లోని ఇళ్లు చుట్టు విశాలమైన స్థలాలు.. వాటిలో వేపుగా పెరిగిన చెట్లతో ఉంటాయి. ప్రతి ఇల్లు ఇలాగే ఉండటం వల్ల గ్రామాలు పచ్చగా.. అడవిని తలపించేలా ఉంటాయి. ఇటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉండదు. తెలుగు డబ్బింగును పక్కన పెట్టి మూల సినిమాను చూస్తే అద్భుతంగా ఉంటుంది. సినిమాకు నేపథ్య సంగీతం ఆయువుపట్టు. ఆస్కార్ అవార్డు రానప్పటికి.. సినిమా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. రాత్రివేళ కీచురాళ్ల శబ్ధాలు మొదలుకొని గడియారం ముల్లు టిక్ టిక్ ధ్వనుల వరకు మనకు వినిపిస్తూ మైమరపింపజేస్తాయి. మనిషిని మార్చుకోవటానికి జల్లికట్టు వంటి సినిమాలు మరిన్ని రావాలి.