మొబైల్ పరికరాల వాడకంలో శిక్షణ పొంది.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నుంచి పరికరాలను అందుకొంటున్న డ్వాక్రా సభ్యులు
బురుజు.కాం ( Buruju.com) : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇక బ్యాంకింగ్ సేవలు ఇళ్ల వద్దకే అందుబాటులోకి రానున్నాయి. స్వయం సహాయక సంఘాలకు(డ్వాక్రా) చెందిన మహిళలు.. ప్రభుత్వం అందజేసే మొబైల్ పరికరం ద్వారా ఆయా ఇళ్ల వద్దనే బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహిస్తారు. వీటిపై ఆయా మహిళలకు పూర్తిగా అవగాహన ఏర్పడిన తర్వాత.. ఆధార్, పాన్ కార్డు కోసం నమొదు, వంట గ్యాస్ , ప్రయాణ టిక్కెట్ల బుకింగ్ వంటి సదుపాయాలనూ వారి ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొబైల్ పరికరాలు కామన్ సర్వీస్ సెంటర్ ( సి.ఎస్.సి)తో అనుసంధానమై ఉంటాయి. మొబైల్ పరికరం వినియోగంపై శిక్షణ పొందిన 424 మంది మహిళలకు రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు.. గురువారం హైదరాబాదులో మొబైల్ పరికరాలను అందజేశారు. ఇంటింటికి వెళ్లి సేవలను అందజేసేవారిని బ్యాంకు సఖి అని వ్యవహరిస్తారు. ఒక్కో సఖికి నాలుగైదు గ్రామాల చొప్పున అప్పగిస్తారు. తొలి సారిగా శిక్షణ పొందిన 424 మంది దాదాపు రెండు వేల గ్రామాల్లో ఇంటింటికి చేరువవుతారు. ఆయా సేవలకు వీరు 5 నుంచి 8 శాతం వరకు నిర్ణీత సేవా రుసుములను వసూలు చేస్తారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పిన దాని ప్రకారం.. ఆయా సేవలను అందజేసే ఒక్కో మహిళ తొలిదశలో నెలకు రూ.5వేల నుంచి రూ. 10వేల చొప్పున, ఆ తర్వాత మరో రెండు మూడేళ్లలో నెలకు రూ.20 నుంచి రూ.25వేల చొప్పున సంపాదించుకొనే వీలు కలుగుతుంది. తొలిసారిగా వారం రోజుల పాటు శిక్షణ పొందిన వారికి భారత బ్యాంకింగ్, ఆర్థిక సంస్థ ( ఐఐబీఎం) పరీక్షను నిర్వహించి ధృవీకరణ పత్రాలను అందజేసింది. తెలంగాణలో ప్రస్తుతం 4 లక్షల 30వేల డ్రాక్రా సంఘాల్లో 46 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సభ్యులు తమ పొదుపు మొత్తాలను తమ ఇంటికి వచ్చే సఖి వద్దనే జమచేసుకోవచ్చు. అదే విధంగా అప్పు వాయిదాలనూ అక్కడే చెల్లించవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లోను, బ్యాంకులు దూరంగా ఉండే చోట ఈ సఖిల వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. రాష్ట్రంలో మరింత మంది మహిళలకు మొబైల్ పరికరం వాడకంపై శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.