అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను కాపాడిన తెలుగు అధికారి
personBuruju Editor date_range2023-08-25
ఎడమవైపు ఉన్నది నంబి నారాయణన్. ఆయన రూపొందించిన వికాస్ రాకెట్ ఇంజిన్ ప్రోగ్రాంతో దూసుకు పోతున్న రాకెట్. కుడివైపున .. సినిమాలో నంబిగా నటించిన మాధవన్
బురుజు.కాం Buruju.com భారత్ లో రాకెట్ ప్రయోగాలకు భీజం వేసింది.. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ Nambi Narayanan అటువంటి శాస్త్రవేత్త రాకెట్ రహస్యాలను పాకిస్తాన్ కు ఆరు లక్షల డాలర్లకు అమ్మేశారంటూ కేరళ పోలీసులు కేసులు పెట్టి తీవ్రంగా హింసించగా.. ఆయన్ని తెలుగు వారైన ఐపీఎస్ అధికారి కె. విజయరామారావు కాపాడారు. అప్పట్లో ఆయన సీబీఐ డైరక్టరుగా.. కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తూ వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష వ్యాపారంలో భారత్ ను ఎదగనివ్వకూడదనే అమెరికా కుట్రలో భాగంగానే నంబి నారాయణన్ పై కేరళ పోలీసులు అక్రమ కేసులను పెట్టినట్టుగా చివరికి తేలింది. ఇటువంటి దర్యాప్తు ద్వారా నంబి నారాయణన్ ను విడుదల చేయటం వల్లనే భారత శాస్త్రవేత్తల్లో మళ్లీ ధైర్యం పుంజుకోగలిగింది. అప్పట్లో అమెరికా భయపడినట్టుగానే.. ఇప్పుడు భారత్ తక్కువ వ్యయంతోనే అంతరిక్షంలోకి వివిధ దేశాల ఉప గ్రహాలను పంపగలుగుతోంది. అంతేకాకుండా.. మంగళయాన్, చంద్రయాన్ వంటి కార్యక్రమాలకూ నడుం కట్టింది. ఇప్పడివన్నీ ఎందుకంటే.. ‘రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ ’ అనే సినిమా 2022, జూలై నెలలో థియేటర్లలో విడుదలయ్యి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది. అమెరికాలోని నాసా భారీ ఎత్తున జీతాన్ని ఇస్తానన్నా తిరస్కరించి.. 1985లో మాతృ దేశంలో రాకెట్ ప్రయోగాలకు ఉపక్రమించిన నంబి నారాయణన్ జీవిత గాథ ఆధారంగానే చిత్రం రూపొందింది. నటుడు మాథవన్.. నంబి నారాయణన్ గా నటించి , దర్శకత్వం వహించారు. సినిమాలో విజయరామారావు ప్రస్తావన లేకున్నా.. Buruju.com సేకరించిన కొన్ని ఆధారాలను బట్టి ఆయన పర్యవేక్షణలోనే కేసు దర్యాప్తు కొనసాగింది. ( సినిమాకు 2023. ఆగస్టు 24వ తేదీన జాతీయ పురస్కారం లభించిన నేపథ్యంలో చిత్ర సమీక్ష మరో సారి.. )
1994లో నంబినారాయణన్ ను కేరళ పోలీసులు అరెస్టు చేసినప్పటి దృశ్యం . అక్రమ కేసులుగా సీబీఐ, సుప్రీంకోర్టు తేల్చటంతో నంబికి 2019లో పద్మభూషన్ బిరుదును ప్రధానం చేస్తున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
అప్పట్లో మన వద్ద రాకెట్ సంకేతిక పరిజ్ఞానమే కాదు.. ఆర్థిక వనరులూ లేవు. నంబి నారాయణన్ తన బృందంతో కలిసి ఫ్రాన్స్ , రష్యాల నుంచి పరిజ్ఞానాన్ని సంపాదించారు. భారత్ లో ప్రయోగాలను మొదలు పెట్టే సరికల్లా ఆయన ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. రాకెట్ పరిజ్ఞానాన్ని ఆయన పాకి్స్థానుకు అమ్మేశారంటూ కేరళ పోలీసులు 1994లో ఆయనపై కేసులను పెట్టి 50 రోజుల పాటు జైలులో ఉంచారు. దేశ ద్రోహి అంటూ ప్రజలు ఆయన కుటుంబాన్ని నానా ఇబ్బందులూ పెట్టారు. రాజకీయ పార్టీలూ అందుకు వంతపాడాయి. అటువంటి సమయంలో .. కేసును సీబీఐ చేపట్టింది. అప్పట్లో.. ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు ఉండేవారు. సీబీఐకి డైరక్టరుగా 1993, జూలై నెలలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి కె.విజయరామారావు నియమితులయ్యి 1996, జూలై 31వ తేదీ వరకు ఆ పదవిలో ఉన్నారు. సరిగ్గా ఆయన హయాంలోనే నంబి నారాయణన్ కేసు సీబీఐ చేతికి వచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా విజయరామారావు తానున్న జైలుకు వచ్చారని నంబి తన అత్మకథలో రాసుకొన్నారు. పాకిస్థానుకు ఏదైతే రాకెట్ సమాచారాన్ని అమ్మేశానంటూ తనపై అభియోగం మోపారో. . అటువంటి సమాచారం బజారులో దొరికే పుస్తకాల్లోను ఉంటుందని చెప్పగా విజయరామారావు ఆశ్చర్యపోయారని, తనకు క్షమార్పణలు చెప్పారని నంబి తన పుస్తకంలో పేర్కొన్నారు.
1993 నుంచి 1996 వరకు సీబీఐ డైరక్టరుగా పనిచేసిన కె.విజయరామారావు. పదవీ విరమణ తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా వ్యవహరించారు
విజయరామారావు పర్యవేక్షణలో సీబీఐ అధికారి నాయర్ .. కేసును పరిశోధించి పోలీసులవి తప్పుడు అభియోగాలుగా తేల్చారు. సీబీఐ నివేదికను అనుసరించి.. సుప్రీం కోర్టు కూడా స్పందించింది. నంబి నారాయణన్ ను శారీరకంగా, మానసికంగా హింసించినందుకు రూ. 50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని తీర్పు చెప్పగా.. కేరళ ప్రభుత్వం రూ.1.30 కోట్లను అందజేసింది. నంబికి జరిగిన అన్యాయాన్ని 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆయన ప్రధాని అయ్యాక.. కేంద్రం 2019లో నంబికి పద్మ భూషన్ ఇచ్చి సత్కరించింది. రాకెటర్ సినిమాలో విజయరామారావు పేరును ప్రస్తావించకపోయినా.. సీబీఐ అధికారి నాయర్.. తన పరిశోధన విషయాలను డైరక్టర్ కు చెప్పే సన్నివేశాలు ఉన్నాయి. అమెరికా కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు.. మాల్దీవులకు చెందిన ఒక అమ్మాయి వలలో నంబి నారాయణన్ పడ్డారని, ఆమెకు రహస్యాలను అందజేశారని కేసులు పెట్టినట్టు సీబీఐ నాయర్ వెల్లడించారు. నిజానికి ఆ అమ్మాయి ఎవరో కూడా నంబికి తెలియదని, ఆధారాలను మద్రాసులో అందజేసినట్టుగా పోలీసులు పేర్కొనగా.. ఆ రోజు నంబి అసలు మద్రాసులోనే లేరని తేల్చారు. నంబిని చిత్ర హింసలు పెట్టిన పోలీసు అధికారులపైనా సీబీఐ కేసులను నమోదు చేయగా.. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయి.
ఏ తప్పు చేయకున్నా ఏళ్ల తరబడి క్షోభ అనుభవించిన నంబి నారాయణన్ . తిరిగి ఉద్యోగంలోకి తీసుకోగా.. ఆయన 2010లో పదవీ విరమణ చేశారు.
ప్రముఖ నటుడు సూర్య.. నంబి నారాయణన్ ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన చెప్పే కథను మనకు చూపిస్తుంటారు. ఇంటర్వ్యూ చివరిలో నిజమైన నంబి నారాయణన్ కనిపిస్తారు. నంబి అల్లుడు సుబ్బయ్య అరుణన్.. అంగారక గ్రహ మిషన్ డైరక్టరుగా వ్యవహరించారు.సీబీఐ డైరక్టరుగా పదవీ విరమణ చేసిన తర్వాత విజయ రామారావు తెలుగు దేశం పార్టీలో చేరి.. హైదరాబాదులోని ఖైరతాబాదు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలిపొందారు. సీబీఐ నుంచి వచ్చిన వారు కావటంతో ఆయనకు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పదవిని ఇచ్చి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. అదే సమయంలో.. విజయరామారావు సామాజిక వర్గానికే చెందటం వల్ల కేసీఆర్ కు మంత్రి పదవిని ఇవ్వలేదు. ఇటువంటి కారణంగానే క్రమేణా కేసీఆర్.. తెలుగు దేశానికి దూరమయ్యి సొంత పార్టీని పెట్టారు. విజయరామారావు 2023, మార్చి 14వ తేదీన మృతి చెందారు.