గోదావరి వరదల నిరోధానికి సీఎం కేసీఆర్.. రూ.వెయ్యి కోట్లను ఇస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు. భద్రాచలం రాముడికి ఇస్తామన్న రూ.100 కోట్ల గురించి తొలుత స్పష్టత ఇవ్వాలని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అడుగుతున్నారు
బురుజు.కాం Buruju.com : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు రాష్ట్రాలుగా వేరు పడి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. ఎవరి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు అమలు చేసుకొంటున్నారు. అయినప్పటికీ రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తాము చేసిన పనులకు ఓట్లు పడతాయో పడవోననే సందేహాలు ఉభయ రాష్ట్రాల పాలకుల్లోను నెలకొన్నాయి. అందుకే.. ఓటర్లలో భావోద్వేగాలకు ఆస్కారమిచ్చే అంశాలను మళ్లీ తెరపైకి తేవటానికి పావులు కదుపుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి అవగతమవుతోంది. ఆంద్రప్రదేశ్ లో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేస్తుండగా.. రెండు రాష్రాలను కలిపివేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండబోదని ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. దీంతో రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను తిరగతోడే ప్రయత్నాలను రెండు వైపుల నాయకులు తెరపైకి తెస్తున్నట్టు భావించాల్సివస్తోంది. అధికార పార్టీలే ఇటువంటి పాచికలు వేస్తున్నప్పుడు ప్రతి పక్షాలు మాత్రం ఎందుకు మౌనం వహిస్తాయి? అందుకే.. ఆంధ్రప్రదే్శ్ లోని ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విలీన మండలాల ప్రజలు తిరిగి తమ గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందిగా కోరుతున్నారని తెలుగు దేశం అధినేత చంద్రబాబు విమర్శించగా.. పోలవరం నిర్మాణాన్ని తెలంగాణ నాయకులు ప్రశ్నిస్తే.. విభజన అంశాన్ని తిరగతోడినట్టేనని ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఏడు మండలాల విలీనం గురించి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేయగా.. ఏకంగా రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యలే ఉండవని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు
తెలంగాణలో జూలై నెలలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని జిల్లాల్లోని తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోగల భద్రాచలం, దాని చుట్టుపక్కల గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచి నిర్మిస్తుండటం వల్లనే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యిందని, విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చేసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చివేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు . పార్లమెంటు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే విభజన చట్టం సవరణ బిల్లును తేవాలంటూ ఆయనొక గడువునూ నిర్ధేశించారు. భద్రాద్రి రాముడి కోసం.. అక్కడికి దగ్గరలో గల అయిదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలనీ సూచించారు. అంటే విభజన అంశాల్లోకి రాముడినీ ఆయన తీసుకొచ్చారు. వరదల సమయంలో ఇటువంటి వాదనలను వినిపించటంతో ప్రజల దృష్టి సహజంగానే ఈ విషయాల వైపునకు మళ్లింది. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన ఏడు మండలాల్లోని గ్రామాలూ వరదకు అతలాకుతలమయ్యాయి. ప్రభుత్వ సాయం కోసం అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటువంటి సమయంలోనే మండలాలను తిరిగి తమకు ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి డిమాండ్ చేయటంతో అక్కడి కొన్ని గ్రామాల వారు తమను తెలంగాణలో కలపాలంటూ ధర్నాలను సైతం నిర్వహించారు. దీంతో అక్కడా ప్రజల దృష్ట్రీ వరద కష్టాల నుంచి విలీన ప్రకటనల వైపు మళ్లింది. హైదరాబాదు తెలంగాణకు వెళ్లటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిందని
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించి .. విభజన నాటి వాదనలను మళ్లీ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు.
పోలవరం ప్రాజెక్టు ఇలా ఉంటుంది
నిర్ణీత వ్యవధి ప్రకారమైతే.. తెలంగాణలో 2023 డిసెంబరులోను, ఆంధ్రప్రదేశ్ లో 2024 లోను అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సివుంది. తెలంగాణలో వ్యవధి ఇక అట్టే లేకపోవటంతో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకొంది. భాజాపాను బలహీన పర్చటం కోసం అధికార పార్టీ నాయకత్వం ఇప్పటికే మోదీ సర్కారును ఢీకొంది. ఆంధ్రప్రదేశ్ లోని పోలవరంపై సరైన అధ్యయనం చేయకుండా అనుమతులు ఇవ్వటం వల్లనే ప్రస్తుతం భద్రాచలం పరిసరాల్లోకి వరద నీరు ప్రవేశించిందని అనటం ద్వారా కేంద్రాన్నీ దోషిగా నిలబెట్టే ప్రయత్నం మొదలయ్యింది. తెలంగాణ మంత్రి పువ్వాడ మరో అడుగు ముందుకేసి.. వరద నిరోధక నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్.. గోదావరి పరివాహక ప్రాంతాలకు రూ. 1,000 కోట్లను ఇస్తున్నారని, ఏపీలో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాల పరిధిలో కరకట్టలు, కాలనీల నిర్మాణాన్ని చేపట్టాల్సివున్నందున వెంటనే ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతూ రాజకీయానికి మరింత జోరు పెంచారు. భద్రాచలం రామాలయానికి రూ.వంద కోట్లను ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వని కేసీఆర్.. గోదావరి వరద నిరోధానికి రూ. వెయ్యి కోట్లను ఇచ్చేస్తారా? అంటూ వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.
పోలవరం నిర్మాణానికి తెలంగాణ ఒప్పుకొందని, ఇప్పుడు వేరే విధంగా మాట్లాడినంత మాత్రాన ఏమీ కాదని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా చేపట్టలేదని ప్రధాన మంత్రి మోదీ కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాక్యను తెరాస నాయకత్వం ఇప్పటికే విమర్శనాస్త్రంగా తన అంబుల పొదిలో అట్టి పెట్టుకుంది. అస్త్రాన్ని ఇప్పటికే వాడినప్పటికీ ఎన్నికల సమయంలో మళ్లీ బయటకు తీస్తుంది. తద్వారా తెలంగాణ ఇవ్వటం భాజాపాకు ఇష్టంలేదనే విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మరో వైపు.. నిధుల్లో సింహ భాగాన్ని రకరకాల సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తూ.. అభివృద్ధికి నిధుల లేమిని ఎదుర్కొంటున్న వైకాపా నాయకత్వం.. రానున్న ఎన్నికల్లో విభజన అంశాలను తప్పక అందిపుచ్చుకొంటుంది. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం వైకాపాకు బాగా ఉపయోగపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా సాధన కోసం వైకాపా అగ్ర నాయకత్వం ఇంతవరకు చేసిందేమీ లేనందున 2024 ఎన్నికల్లో అది ఇక అధికార పార్టీకి ఓట్లను తేవటానికి సహకరించదు. పోలవరం నిర్మాణంపై తెలంగాణ నాయకులు ప్రశ్నిస్తున్నందున ఏపీలోని అధికార పార్టీ, ఇతర పార్టీల వారు ఆ విషయాన్ని ఎన్నికల్లో బాగా అందిపుచ్చుకొంటారు. మొత్తం మీద అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి ఓట్లను అడగవలసిన ఉభయ రాష్ట్రాల అధికార పార్టీల నాయకులు.. వాటితో పాటుగా.. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాలనూ ప్రచారంలోకి తేనున్నట్టు స్పష్టమవుతోంది.