భాజపా అంటే బగ్గుమంటున్న తెరాస అధినేత కేసీఆర్ కు.. తపపైనే పోటీచేసి నెగ్గుతానంటున్న ఈటల రాజేందర్ అంటే ఆగ్రహం కట్టలు తెంచుకొంటోంది
పిళ్లా సాయికుమార్ Buruju.com :
తెలంగాణలోని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అధికార పార్టీ తాజాగా మరో సారి తన ఆగ్రహాన్ని చవి చూపించింది. స్పీకరును ‘మర మనిషి’ అంటూ వ్యాఖ్యానించారంటూ అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తటంతో.. స్పీకరు పోచారం శ్రీనివాసుల రెడ్డి.. ఆయన్ని శాసన సభ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి. . అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో సైతం మాట్లాడనివ్వకుండా చేశారు. పోలీసులు ఆయన్ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కారు రెండు సార్లు కొలువు తీరగా.. మొదటి సారి పూర్తికాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల.. రెండో సారి మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రెండన్నర ఏళ్లకే.. 2021, మే నెలలో అకస్మాత్తుగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. అనంతరం ఆయన భాజపాలో చేరి.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తిరిగి నెగ్గారు. ఈటల.. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో ‘ఈనాడు’ పత్రిక విలేకరిగా నేను ఆయన్ని తరచు కలిసేవాడిని. తొలిసారి మంత్రి అయిన మూడు రోజులకే.. అంటే 2014, జూన్ 5వ తేదీన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి లోనుకావాల్సివచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. పంట రుణాల మాఫీకి సంబంధించిన విషయాలను ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బహిర్గతపర్చటమే అధినేత కన్నెర్రకు కారణమయ్యింది. ఆయనపై అప్పుడు పడిన ఆగ్రహ భీజం.. అలా వృక్షంగా పెరిగి.. 2021, మే నెలకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు దారితీసింది. ప్రస్తుతం.. ఈటలకు చెందిన కోళ్ల పారం అసైన్డు భూమిలో ఉందంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేలులో పోటీచేసి నెగ్గటమే తన లక్ష్యమంటూ ఈటల ప్రకటించటం తదితర పరిణామాల నేపథ్యంలో.. నాటి విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి.
2021, మే నెలలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావటంతో ఈటల.. భాజపాలో చేరి.. ఆ పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. హుజూరాబాదు ఉప ఎన్నికలో భాజపా తరపున గెలిచి అమిత్ షా ప్రశంసలు అందుకొన్నారు
అప్పట్లో... అంటే 2014 , జూన్ 2వ తేదీన కేసీఆర్ సర్కారు కొలువుతీరిన వెంటనే.. ఎన్నికల హామీ అయిన పంట రుణాల మాఫీపై దృష్టి సారించింది. ఆ ఏడాది జూన్ నెల 4వ తేదీన నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో.. రుణ మాఫీని 2013-14 రుణాలకు మాత్రమే వర్తింపజేయాలనే అంశం తొలుత చర్చకు వచ్చింది. మాఫీని ఒక రూ.ఒక లక్ష వరకే పరిమితం చేయాలనీ యోచించారు. అనంతరం.. ముఖ్యమంత్రి సమక్షంలో ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లు సమావేశమయ్యి రుణ మాఫీపై మరికొన్ని కోణాల్లో చర్చించారు. భూమికి బదులుగా బంగారు వస్తువులను కుదవపెట్టి తీసుకొన్న పంట రుణాలకు మాఫీని వర్తింప జేయాలా? వద్దా? అనే అంశం ఈ భేటీలో ప్రధానంగా చోటు చేసుకొంది. ఆర్థిక శాఖ మంత్రిగా ఆ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్.. భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడినప్పుడు ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానమిస్తూ.. బంగారంపై తీసుకొన్న పంట రుణాలనూ ప్రభుత్వం మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. పత్రికల్లో ఇవే కథనాలు వెలువడగా.. వ్యవసాయ శాఖ మాత్రం.. అటువంటి రుణాలను మాఫీ చేయబోవటం లేదంటూ పత్రికలకు లీకులు ఇచ్చి ఆ మేరకు వార్తలు వచ్చేటట్టుగా చేసింది. దీంతో.. బంగారంపై తెచ్చిన రుణాలకు అసలు మాఫీ వర్తిస్తుందా? లేదా? అనే గందరగోళం రైతుల్లో తలెత్తింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రుణ మాఫీని అమలు చేయాలని, మాఫీకి ఆంక్షలంటూ విధించరాదని ప్రతి పక్షాలు ఆందోళనలను చేపట్టాయి. బంగారంపై తీసుకొన్న పంట రుణాలనూ మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. జూన్ 13వ తేదీన శాసన సభలో ప్రకటించారు.
ఈటల, కేసీఆర్ ల మధ్య తొలినాళ్లలోని ప్రేమాను రాగాలు క్రమణా అంతరించిపోయాయి
సరిగ్గా అప్పటి నుంచి కొన్ని పరిణామాలు చేసుకొంటూ వచ్చాయి. .ఆర్థిక శాఖ మంత్రి అయ్యిండీ.. ఆర్థిక శాఖ అంశాలపై విలేకర్ల వద్ద మాట్లాడటాన్ని ఈటల పూర్తిగా తగ్గించేస్తూ వచ్చారు. తనను కలసిన విలేకర్లను మాత్రం ఆప్యాయంగానే పలకరిస్తూ.. ఇతర విషయాలపై మాట్లాడుతుండేవారు . సచివాలయంలోని ఆయన వ్యక్తిగత గదిలోకి సైతం వెళ్లేందుకు విలేకర్లకు అవకాశం ఉండేది. ‘ ప్రభుత్వ ఆర్థిక పరమైన విషయాలను మీరు తప్ప ఇంకెవరు చెబుతారు?’ అంటూ నేను పదేపదే అడినప్పుడు ఎట్టకేలకు 2014, జూలై 30వ తేదీన ఆయన నోరు విప్పారు. ‘ 2014, జూన్ 4వ తేదీనాటి సమావేశంలోని పంట రుణాల మాఫీ వివరాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడ్డ ప్రకటనలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగలరా?’ అని ఆయన అడగటంతో విషయమంతా నాకు అవగతమయ్యింది. బంగారంపై తీసుకొన్న పంట రుణాలకు మాఫీని వర్తింపజేయకపోవటమో లేదా కొంత కాలం వాయిదా వేయటమో చేస్తే కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందనే భావనలో సర్కారు ఉండేదని, మాఫీ వర్తిస్తుందంటూ ఆర్థిక మంత్రి ఈటల ప్రకటించటంతో ఇక ప్రభుత్వానికి వాటికీ అమలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడందని అప్పట్లో స్పష్టమయ్యింది .
తెలంగాణలో పలువురు రైతులు బ్యాంకుల వద్ద భూములను మాత్రమే కాకుండా బంగారు వస్తువులనూ కుదవ పెట్టి పంట రుణాలను తీసుకెళ్తుంటారు. భూములపై తీసుకొన్న రుణాలకే మాఫీని వర్తింప జేయాలని సర్కారు తొలుత భావించింది
కీలక విషయాల్లో ఆర్థిక మంత్రి ఈటలను కొంత దూరంగా పెట్టటం 2014, జూన్ నెల నుంచే మొదలయ్యి.. కీలక జీవోల జారీ విషయం సైతం ఆయనకు తెలియని పరిస్థితి అప్పట్లోనే నెలకొంది. అదెలా అంటే.. 2015 , ఫిబ్రవరి 5వ తేదీన ఉద్యోగులకు వారి మూల వేతనంలో 43 శాతం పెంపును (ఫిట్మెంట్) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా.. అదే రోజున పెట్రోల్, డీజిల్ పై పన్ను రేట్లనూ పెంచుతూ ఒక జీవో వెలువడింది. ‘ఉద్యోగులకు వేతనాలను బాగా పెంచటం వల్ల ఏర్పడే ఆర్థిక భారాన్ని ఇలా ఇంధన పన్ను రేట్ల పెంపుదల ద్వారా భర్తీ చేయదలచుకొన్నారా?’ అని అదే రోజున ఆర్థిక మంత్రి ఈటలను ఆయన ఛాంబరులో నేను అడిగాను. తెలంగాణలో అటువంటి జీవో ఏదీ రాలేదని, బహుశా ఆంధ్రప్రదేశ్ లో వెలువడ్డ జీవోను తెలంగాణ జీవోగా పొరబడి ఉంటారని ఆయన సమాధానమిచ్చారు. అప్పటికే జీవో బయటకొచ్చినా ఆర్థిక మంత్రికి తెలియలేదంటే ఆయనకు చెప్పకుండానే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకొందనే విషయం తేటతెల్లమయ్యింది. క్రమేణా బడ్జెట్ల రూప కల్పనలోను ఆయన పాత్ర తగ్గుతూ వచ్చింది. బడ్జెట్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజు రాత్రి మాత్రం లకడీకాపూల్ లోని ఒక హోటల్లో ఆయన విలేకర్లకు విందు ఇచ్చే సంప్రదాయమొకటి పుట్టుకొచ్చింది.