ప్రేమ కావ్యం ‘విరాటపర్వం’ ఎందుకు ప్రేక్షకాదరణ పొందలేదు?
personBuruju Editor date_range2022-07-06
ఎట్టకేలకు దళనాయకుడు రవన్న చెంతకు వెన్నెల చేరుకోగలిగినా ఆ తర్వాత అతని చేతిలోనే హతమవుతుంది
బురుజు.కాం Buruju.com ప్రతినిధి: ప్రేమ చిగురించాలే కాని ఎన్ని అడ్డంకులనైనా అధిగమించాలనే పట్టుదలను అది నరనరాల్లో జీర్ణింపజేస్తుంది. హృదయాన్ని తాకే ప్రేమకథే ‘విరాటపర్వం’ చిత్రం. అగ్రశ్రేణి నటులు దగ్గుబాటి రానా, సాయిపల్లవి, సాయి చంద్ తదితరులు తమ పాత్రలకు జీవం పోసినప్పటికీ థియేటర్లలో ఇది ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. సినిమా నక్సలిజం నేపథ్యంతో ఉంటుంది. నక్సలైట్ దళ నాయకుడు రవన్న (రానా)ను ప్రేమించి అతన్ని కలవటానికి వెన్నెల ( సాయిపల్లవి) పరితపిస్తుంది. ఆనేక రోజుల పాటు అతని కోసం అన్వేషించి చివరికి అడవిలో కలుసుకోగలిగినా.. మిగతా సభ్యులు అనుమానించిన క్రమంలో ఆమె ప్రాణాలను కోల్పోతుంది. ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ అనే 17 ఏళ్ల యువతి 1992లో ఇదే మాదిరిగా దళాన్ని కలవటానికి వెళ్లి దళ సభ్యుల చేతుల్లోనే హతమవుతుంది. అప్పట్లో సరళ హత్య సంచలనం సృష్టించింది. ఆమె కథను ప్రేరణగా చేసుకొనే విరాటపర్వం సినిమాను రూపొందించారు.
ఆ రోజుల్లో పలువురు యువతీ యువకులు గద్దర్ వంటివారి పాటలకు ఆకర్షితులయ్యి ఇలానే అడవుల బాట పట్టారు
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో నక్సలైట్ కార్యకలాపాలు ముమ్మరంగా ఉండేవి. వారిని నియంత్రించటం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో ప్రభుత్వం హైదరాబాదులో చర్చలను సైతం నిర్వహించింది. అటువంటి నక్సలైట్ ఉద్యమం వివిధ కారణాల వల్ల క్రమేణా కనుమరుగయ్యింది. అప్పట్లో నక్సలైట్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసిన అప్పటి తరం ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకొంది. వీరి పిల్లలు ఉపాధి అవకాశాలను వెదుక్కొంటూ తలోదిక్కుకు వెళ్లిపోవటంతో ఆనాటి నక్సలిజం గురించి వారికి తెలిసింది తక్కువ. అందువల్లనే వారు నక్సలిజంతో కూడిన సినిమాలను ఆదరించటం లేదనే వాదన చిరంజీవి, రామచరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ వైఫల్యం సమయంలో తెరపైకి వచ్చింది. ఇప్పుడు విరాటపర్వం కూడా ఆచార్య బాటనే పట్టటంతో పై వాదనకు బలం చేకూరినట్లయ్యింది. మరి.. బ్రిటీష్ ఆగడాలను ఇప్పటి తరాలు ప్రత్యక్షంగా చవి చూడకపోయినా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎందుకు ప్రేక్షకాదరణ పొందినట్టు? అదే సూత్రం ఆచార్య, విరాటపర్వం సినిమాలకూ వర్తించాలి కదా ? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. నక్సలిజం విఫల ప్రయత్నమనే భావన ప్రస్తుత తరాల్లో వ్యాపించి ఉండటం ఒక కారణం కావచ్చు. ఒకప్పుడు నక్సలైట్ కథాంశాలతో విజయవంతమైన చిత్రాలను తీసిన ఆర్ నారాయణ మూర్తి.. ఇటీవల కాలంలో తీసిన ఆయన ఏ ఒక్క సినిమా కూడా విజయవంతం కాకపోవటానికి కారణం కూడా ఇదే కావచ్చు. మొత్తం మీద నక్సలైట్ ఉద్యమాన్ని సినిమాల్లో ఎక్కడైనా ఒక అంతర్భాగంగా చూపించటానికి బదులు దానినే ఇతివృత్తంగా చేసుకొని తీసే సినిమాలు విజయం సాధించలేకపోతున్నట్టు విరాటపర్వం ద్వారా తేలింది.
ఈమే తూము సరళ.. ఆమె పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి
‘విరాటపర్వం’ విజయం సాధించనప్పటికీ నక్సల్స్ దుందుడుకు చర్యలకు బలైపోయిన తూము సరళ గురించి మరో సారి చర్చించుకోవటానికి సినిమా ఉపయోగపడింది. ఖమ్మం జిల్లా కామంచికల్లు గ్రామానికి చెందిన ఆమె.. 1992 , ఫిబ్రవరి 19వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి అదే ఏడాది మార్చి నెలలో నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో మూడు దళాలకు చెందిన నక్సల్స్ సమక్షంలో హతమయ్యింది. అప్పటికి ఆమె ఇంటర్ చదువుతోంది. ఆమె పోలీస్ గూఢచారిణి కావటం వల్లనే హతమార్చినట్టుగా పీపుల్సువార్ నేత రాంచదర్ ఇచ్చిన ప్రకటన మార్చి 24వ తేదీ పత్రికల్లో వెలువడింది. సరళ కుటుంబం విప్లవ కమ్యునిస్టు భావజాలం కలగి ఉండేది. అటువంటి ఆమె పోలీసుల పక్షం ఎందుకు వహిస్తుంది? నక్సలైట్లు ఈ కోణంలో ఆలోచించినా 17 ఏళ్ల అమ్మాయి జీవితం అర్ధాంతరంగా ముగిసి ఉండేది కాదేమో.
ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయం దగ్గరలోనే.. కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న కాకతీయుల అద్భుత ఆలయాన్ని సినిమాలో చూడొచ్చు.
నాటి పత్రికల్లోని కథనాల క్లిప్పింగులను సినిమా చివరిలో చూపించి.. వాస్తవ సంఘటన ఆధారంగానే చిత్రాన్ని నిర్మించామనే విషయాన్ని చిత్ర దర్శకుడు వెల్లడించారు. సినిమాలో 1990ల నాటి పరిస్థితులను బాగా చూపించారు. ప్రపంచ వారసత్వ సంపదగా ఇటీవల యునెస్కో ఎంపిక చేసిన తెలంగాణలోని ములుగు జిల్లాలో గల రామప్ప ఆలయం దగ్గరలోనే ఆనాటి కాకతీయ కట్టడాలు అనేకం ఉన్నాయి. రేపోమాపో నేలమట్టమయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఒక అద్భుత ఆలయ శిధిలాల వద్ద కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. ప్రభుత్వ ప్రతినిధులు కనీసం ఈ సినిమాను చూసైనా కట్టడాల పరిరక్షణకు నడుంకడితే సినిమా ద్వారా ఒక ఫలితం లభించినట్లవుతుంది. సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. నాటి నక్సలైట్, పోలీస్ కార్యకలాపాలను, వాటితో ముడిపడి ఉన్న ఒక స్వచ్చమైన ప్రేమ కథను చూడాలనుకొనేవారికి మాత్రం విరాటపర్వం నచ్చుతుంది.