ఏసీబీ రహస్య నివేదికను మార్చేసిందెవరు? ( రెండో భాగం)
personBuruju Editor date_range2022-07-13
దాడి చేసిన చోట అక్రమాస్తులు ఇలా దొరకవలసింది పోయి.. నివేదికలో మార్పుల వల్ల ఏసీబీ ఇనస్పెక్టరుకే తలవంపుల పరిస్థితి వచ్చింది
పిళ్లా సాయికుమార్: Buruju.com (నీతి,నిజాయితీలకు మారు పేరుగా నిలిచి.. రైలు పట్టాలుపై శవంగా కనిపించిన విజయనగరం జిల్లా అవినీతి నిరోధక శాఖ ఇనస్పెక్టరు మోటూరు శ్రీనివాసరావు.. మూడు దశాబ్ధాలు గడిచినా ఉత్తరాంధ్ర ప్రజల జ్ఞాపకాల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నారు. ఆయన మరణం వెనుక గల రహస్యాలను ఛేదించేందుకు అప్పట్లో ‘ఈనాడు’ విజయనగరం జిల్లా ప్రతినిధిగా నేను చేసిన ప్రయత్నాలు, దాని పర్యవసానాలను వివరిస్తూ రాస్తున్న కథనాల్లో ఇది రెండోవది. నాటి అధికారుల ప్రవర్తన, రాజకీయాలు తదితర అంశాలు పాఠకులకు ఆసక్తిని కలిగిస్తాయి. ) శ్రీనివాస రావుది ఆత్మహత్య అని ఆనాటి ఎన్టీఆర్ సర్కారు.. శాసన సభలో ఒక ప్రకటన చేసిందే తప్ప అందుకు గల కారణాలను మాత్రం తెలపలేదు. విజయనగరంలో.. 1988లో సాక్షాత్తూ అప్పటి జిల్లా కలెక్టరు శర్మారావు (ఐఏఎస్) ఇంటిపైనే దాడి చేసి, ఆయన సస్పెండ్ అయ్యేలా చేయగలిగిన శ్రీనివాసరావు.. ఆత్మహత్య చేసుకొనేంతటి పిరికి వాడు కాదని, అతనిది ముమ్మాటికి హత్య అని ఉత్తరాంధ్ర ప్రజానీకం భావించింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇనస్పెక్టరు శ్రీనివాసరావుది ఆత్మహత్య అయినట్లైతే అందుకు గల కారణాలు ఏవని అప్పట్లో నేను శోధించినప్పుడు కొన్ని విషయాలు తెలిశాయి. శ్రీనివాసరావు అత్యంత పకడ్బందీగా రూపొందించిన ఒక రహస్య నివేదిలో కొందరు ఉన్నత స్థాయి అధికారులు మార్పులు చేసి, అతనికి తీవ్ర తలవొంపులు తెచ్చేలా వ్యవహరించినట్టు వెల్లడయ్యింది. ఆ రహస్య నివేదిక ఏమిటంటే..
డీఎస్పీపై దాడి కోసం విజయనగరం ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు పంపిన నివేదికలో.. ఏసీబీ ఉన్నతాధికారులు మార్పులు చేయటాన్ని వెల్లడిస్తూ అప్పట్లో ఈనాడులో వచ్చిన కథనం
అప్పట్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా శ్రీనివాసరావుకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆయన మిర్యాలగూడ డీఎస్పీపై ఒక రహస్య నివేదికను తయారు చేసి ఏసీబీ (ACB) ఉన్నతాధికారులకు పంపారు. కేసు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీకి సంబంధించినదైతే .. తెలంగాణలోని ఏసీబీ అధికారులు మాత్రం అదిలాబాద్ జిల్లా మంచిర్యాల డీఎస్పీ ఇంటిపై దాడి చేశారు. వారికి మంచిర్యాల డీఎస్పీ ఇంటిలో పూచికపుల్లైనా దొరకలేదు. ఇదేమిటని ఉన్నతాధికారులు ఆరాతీస్తే.. నివేదికలో తీవ్ర తప్పిదం చోటు చేసుకొన్నట్టు బయటపడింది. విజయనగరం ఏసీబీ ఇనస్పెక్టరు శ్రీనివాసరావు .. తన నివేదికలో ‘నల్గొండ జిల్లా మిర్యాలగూడ’ అని రాయటానికి బదులు పొరపాటుగా ‘అదిలాబాద్ జిల్లా మిర్యాలగూడ’ అని రాశారని, అదిలాబాదు జిల్లాలో ఉన్నది మంచిర్యాల కావటంతో మిర్యాలగూడను హైదరాబాదు ఏసీబీ కార్యాలయంలో మంచిర్యాలగా మార్పుచేసి.. సిబ్బందిని అక్కడి డీఎస్పీపై దాడికి పంపారని అప్పట్లో ఒక పోలీసు ఉన్నతాధికారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక కథనాన్ని ‘ఈనాడు’ ప్రచురించింది. దాడిని చేయవలసింది తనపైనేనని తెలుసుకొన్న మిర్యాలగూడ డీఎస్పీ వెంటనే సకల జాగ్రత్తలు తీసేసుకొన్నారు. దాంతో ఏసీబీ అధికారులు తిరిగి మిర్యాలగూడ డీఎస్పీ ఇంటిపై దాడిచేసినా వారికి అక్కడ రహస్య నివేదికలో పొందుపర్చిన స్థాయిలో ఏమీ దొరకలేదు.
శ్రీనివాసరావు కేసును రైల్వే పోలీసుల నుంచి సీబీసీఐడీకి బదిలీ చేయవాలంటూ ప్రజలు కోరినా ఫలితం లేకపోయింది
రహస్య నివేదికలో శ్రీనివాసరావు చేసిన చిన్న పొరపాటు కంటే పై స్థాయిలో చోటు చేసుకొన్న పొరపాటులే చాలా తీవ్రంగా ఉన్నాయి. దాడులను చేసేటప్పుడు కేవలం ఆయా ప్రాంతాల పేర్లనే తప్ప కేసులను పెట్టాల్సిన అవినీతి అధికారుల పేర్ల గురించి తెలుసుకోరా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడింతటి మాదిరిగా అప్పట్లో సమాచార వ్యవస్థ లేకపోయినా ఎస్టీడీ, ట్రంక్ బుకింగ్ ఫోన్లు అందుబాటులోనే ఉన్నాయి. వాటి ద్వారా శ్రీనివాసరావును సంప్రదించినా పొరపాటును ఇట్టే సరిదిద్దేందుకు వీలయ్యేది. నివేదికలోని మిర్యాలగూడను మంచిర్యాలగా మార్చేయటానికి ఉత్సుకత చూపించిన ఉన్నతాధికారులు... కనీసం శ్రీనివాసరావును సంప్రదించే ప్రయత్నమేదీ చేయలేదని నివేదికలో మార్పులు చేసెయ్యటాన్ని బట్టే స్పష్టమవుతోంది. పర్యవసానంగా ఎన్నో అనర్ధాలు చోటు చేసుకొన్నాయి. రెండు చోట్ల చేసిన దాడులూ బెడిసికొట్టటంతో ఏసీబీని ఇబ్బందికర పరిస్థిలోకి నెట్టింది. ఎన్నడూ ఎవరి వద్దా తలవంచని ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు.. దీన్నొక అవమానంగా భావించారని .. దీనివల్లనే ఆయన తన ఇంటికి దగ్గరలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నారని తన పేరు బయట పెట్టవద్దంటూ ఒక ఉన్నతాధికారి అప్పట్లో ‘ఈనాడు’ ప్రతినిధిగా ఉన్న నాకు చెప్పారు. ఉన్నతాధికారులు మందలించటంతో శ్రీనివాసరావు 20 రోజుల పాటు సెలవు పెట్టారని, 18వ రోజున ఆత్మహత్య చేసుకొన్నారని ఆయన పేర్కొన్నారు. ఆ అధికారి చెప్పగా నేను రాసిన కథనంలోని అంశాలనే మరణానికి కారణంగా భావించాల్సివచ్చిందే తప్ప అధికారికంగా ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
ఇటువంటి పోలీస్ అధికారులు ఇప్పుడు కాగడా పెట్టి వెదికినా కనిపించరు
కలెక్టరు, వైద్యుడు, ఇంజినీరు అనే వ్యత్యాసాలంటూ లేకుండా తనకు అందిన సమాచారంతో పకడ్బందీగా దాడులు నిర్వహిస్తూ వచ్చిన శ్రీనివాసరావు అంటే సొంత ఏసీబీ విభాగంలోనే గిట్టనివారూ ఉండేవారు. దాడుల విషయాన్ని స్థానిక సిబ్బందికి సైతం అప్పటికప్పుడు తప్ప ముందుగా చెప్పకుండా ఆయన అత్యంత రహస్యంగా ఉంచేవారు. కలెక్టరు శర్మరావుపై దాడి గురించి ఆ నాటి తన పై అధికారి అయిన విజయనగరం ఏసీబీ డీఎస్పీ నజీర్ అహ్మదుకు ఆయన అప్పటికప్పుడు మాత్రమే తెలియచేశారు. ఇటువంటి పోకడలు పై స్థాయి అధికారుల్లో కొందరికి నచ్చకపోవటం సహజమే. దీని పర్యవసానంగానే ఆయన రహస్య నివేదికను ఇష్టాను సారంగా మార్చివేసి.. అయన కీర్తి ప్రతిష్టలను శాస్వతంగా మసకబారేలా వ్యవహరించారా? అనే అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. ఏనాడు సెలవులంటూ పెట్టని ఇనస్పెక్టరు శ్రీనివాసరావు.. రహస్య నివేదికలో మార్పులు తర్వాత 20 రోజుల పాటు సెలవు పెట్టి.. సెలవు ఇంకా రెండు రోజులు ఉందనగా మృతి చెందారు. నివేదికలో మార్పుల వల్లనే ఆయన ఆత్మ హత్య చేసుకొన్నారా? లేక ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం నివేదికలో మార్పులు చేశారా? అనేది ఇప్పటికీ తేలలేదు. రహస్య నివేదికలో మార్పులు చేయటం వంటి అంతర్గత విషయాలపై తానేమీ దర్యాప్తు జరపలేదని విజయనగరం వచ్చిన సీబీసీఐడీ డీఐజీ ఎంవీ కృష్ణారావు అప్పట్లో నాకు చెప్పారు. ఒక నిజాయితీపరుడి మరణం ఇప్పటికీ ఒక మిష్టరీగానే మిగిలిపోయింది ( మూడో భాగం వచ్చేవారం Buruju.comలో.. )