ఓట్లను బహిరంగంగా కొనుగోలు చేసిన మునుగోడులో.. తప్పెవరిది?
personBuruju Editor date_range2022-11-03
మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్ధులు
బురుజు.కాం Buruju.com : మక్కలకు ఆశించిన ధర రాలేంటూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలపటంలో న్యాయముంది. మరి.. ఓట్లకు ఆశించిన ధరను ఇవ్వలేదంటూ ప్రజలు బహిరంగంగా ధ్వజమెత్తుతున్నారంటే ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉన్నట్టే కదా? తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా.. అక్కడి కొన్ని గ్రామాల్లోని ఓటర్లు తమకు సొమ్మును చేతిలో పెట్టేవరకు ఓట్లను వేయబోమంటూ నవంబరు 3వ తేదీన రోడ్లపైకి వచ్చి మరీ చెప్పారు. వారికి నాయకులు ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల చొప్పున అందజేసి పోలింగు కేంద్రాలకు తీసుకెళ్లారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా పోలింగు కొనసాగటానికి ఇలా ఓటర్లు ఆలస్యంగా వెళ్లటమూ ఒక కారణంగా భావించొచ్చు. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు అనేక విషయాలను మన ముందుకు తెచ్చింది. వాటి సారాంశం ఏమిటంటే.. ప్రస్తుత దుస్థితికి పరిష్కారాలను కనుగొనటమే.
ప్రచారాలతో పాటే డబ్బు పంపిణీ ఇప్పుడు తప్పనిసరి ప్రక్రియగా మారిపోయింది
గ్రామానికి పలానా పనులను చేయనందున తాము ఓటేసే ప్రసక్తే లేదంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా ప్రకటించే సన్నివేశాలు దశాబ్ధకాలం క్రితం వరకు ఉండేవి. నాయకులు వారికి అప్పటికప్పుడు హామీలు ఇచ్చి వారిని పోలింగు కేంద్రాలకు తీసుకెళ్లేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అలా పనుల కోసం అడిగేవారు కనుమరుగయ్యారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఓటుకు ఏ పార్టీవారు ఎంత ఇస్తారో తేల్చుకోవాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. కేవలం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పోకడ. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సందర్భగానైతే కొందరు ఓటర్ల నుంచి విచిత్రమైన విన్నపాలు వినిపించాయి. ఒక్కో ఓటుకు తులం బంగారాన్ని ఇస్తామని ప్రచారం చేసి.. మూడు వేల రూపాయలతో సరిపెడతారా? అంటూ వార్తల సేకరణకు వెళ్లిన విలేకర్లను నిలదీసే ప్రయత్నం చేశారు. తాము విలేకర్లమంటూ వారికి అర్ధమయ్యేలా చెప్పేవరకు నిరసనలు తెలుపుతూనే వచ్చారు.
మునుగోడు పోలింగు రోజున బారులు తీరిన ఓటర్లు
పార్టీల అగ్రనాయకత్వం ఎక్కవ మొత్తాలనే పంపినప్పటికీ.. తమ స్థానిక నాయకులు అందులో సంగం కాజేసి మిగతాది పంచారంటూ కొన్ని చోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో నివాసముంటూ వచ్చిన అక్కడి ఓటర్లకు ఒక్కో ఓటుకు కొన్ని గ్రామాల్లోని నాయకులు రూ.4వేల చొప్పున, స్థానికంగా ఉండేవారికి రూ.3వేల చొప్పున ఇవ్వగా.. ఏకంగా రూ. వెయ్యి తేడా ఎందుకు అంటూ తగవులకు దిగినవారూ ఉన్నారు. కొన్ని చోట్ల రూ.1,000 చొప్పున ఇవ్వబోగా.. తీసుకోవటానికి తిరస్కరించటంతో దానికి మరికొంత మొత్తాన్ని చేర్చి ఇవ్వాల్సివచ్చింది. కొందరు ఓటర్ల మాటలను బట్టి.. వారంతా ఒక్కో ఓటుకు రూ.10వేల చొప్పున వస్తుందని భావించారట! చదువుకొన్న వారు సైతం సొమ్మును ఆశిస్తుండటం ఆందోళనకర పరిణామం. ఒకామె.. టీవీ ఛానల్ ముందు చెప్పిన దాని ప్రకారం.. ఆమెకు భాజపా నుంచి రూ.4వేలు, తెరాస నుంచి రూ.5వేలు అందాయి. ఇంటిలోని అయిదుగురు కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం రూ.45వేలు ముట్టాయి. కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదని చెప్పింది. దీనంతటికి కారకులు ఎవరని ప్రశ్నించుకొంటే.. ఆయా పార్టీలు ఇస్తుండటం వల్లనే ఓటర్లూ తీసుకొంటున్నారు కనుక పార్టీలను కట్టడి చేయటం సమస్యకు పరిష్కారం. ఓట్లను అమ్ముకోకూడదనే చైతన్యం గ్రామాల్లో ఎప్పటికి వస్తుందో?