బురుజు.కాం Buruju.com : తిరుమల ఆలయంలోని పరకామణి మండపం ఇక భక్తులకు అందుబాటులోకి రానుంది. వారు అక్కడ కొంత సేపు కూర్చుని వెళ్లవచ్చు. ఆలయ సమీపంలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో స్వామి వారి కానుకల లెక్కింపు ప్రక్రియ మొదలు కావటంతో.. పాత మండపాన్ని భక్తులకు కేటాయించాలని దేవస్థానం నిర్ణయించింది.
నూతన భవనంలోకి.. 2023, ఫిబ్రవరి 5వ తేదీన తొలిసారిగా తెచ్చిన హుండీలు
బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే భక్తుడు ఇచ్చిన రూ.23 కోట్ల విరాళంతో .. నూతన పరకామణి భవనం నిర్మితమయ్యింది. సీసీ కెమేరాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించిన మీదట.. 2023, ఫ్రిబ్రవరి 5వ తేదీన నూతన భవనంలో కానుకల లెక్కింపు మొదలయ్యింది. ఆ రోజున 12 హుండీలను క్రేన్ సాయంతో ఒక వాహనంలో పెట్టి నూతన భవనానికి తీసుకొచ్చి తొలుత పూజా క్రతువులను నిర్వహించారు .
ఆలయం నుంచి ఇక రోజు హుండీలను ఇలా తీసుకెళ్తారు
ఇంతకు ముందటి మాదిరిగానే.. కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేందుకు అనువుగా.. పరకామణి హాలును అద్దాలతో తీర్చిదిద్దారు. ఆలయ సిబ్బందితో పాటుగా.. స్వామివారి సేవకులుగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులైన భక్తులు కూడా పరకామణిలో భాగస్వాములవుతుంటారు. ఒకే సారి 200 మంది కూర్చుని హుండీల్లోని కానుకలను లెక్కించేందుకు వీలుగా నూతన పరకామణి భవనం రూపొందింది.
లెక్కింపు తొలి రోజున.. హుండీలోని ఒక విశిష్ట కానుకను ఆసక్తిగా పరిశీలిస్తున్న ఆలయ ఈవో ధర్మారెడ్డి
ఆలయంలోని పాత పరకామణి మండపానికి కొన్ని మార్పులు చేసి ఒక నెల రోజుల వ్యవధిలో భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడ కొంత సేపు కూర్చుని వెళ్లవచ్చు. తిరుమలను 2023, జనవరి నెలలో 20 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.123 కోట్ల కానుకలు లభించినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు.