29 నెలల పాటు ఉపాధి హామీ నిబంధనలు తుంగలోకి.. ( రెండోవ భాగం)
personBuruju Editor date_range2023-02-12
తెలంగాణలోని ఉపాధి హామీ పథకం సమస్యలను పరిష్కరించటానికి బదులు.. ఏకంగా పథకాన్నే కేంద్రం రద్దు చేయాలనే యోచనలో ఉందంటూ 2023, ఫిబ్రవరి 11వ తేదీన శాసన సభలో విమర్శిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
బురుజు.కాం Buruju.com : ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ఏకంగా 29 నెలల పాటు తుంగలోకి తొక్కినట్టు బయటపడింది. ప్రతి పంచాయతీకి క్షేత్ర సహాయకుడు field assistant ప్రత్యేకంగా ఉండి తీరాలని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పటికీ.. తెలంగాణ సర్కారు వినిపించుకోకుండా క్షేత్ర సహాయకుల బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. ఇటువంటి సమయంలో క్షేత్ర సహాయకులకు వేతనాలను ఇవ్వనందున ఆ మేరకు ప్రభుత్వానికి కొంత మేర మిగులు ఏర్పడినప్పటికీ.. పథకం మాత్రం గ్రామాల్లో గాడి తప్పింది. కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వమే విస్మరించినట్టుగా తేటతెల్లమవుతున్నందున.. క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించిన 29 నెలలకు సంబంధించి ఎంతో కొంత మొత్తాన్ని వారికి అందజేసి ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నెలవారి అందే వేతనం రూ.10వేల లోపే ఉంటున్నప్పటికీ 14 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ గ్రామాల నుంచి వలసలను నిలువరిస్తున్న క్షేత్ర సహాయకులపై Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది రెండోవది.
క్షేత్ర సహాయకుల విధులు పంచాయతీ కార్యదర్శి విధులకు పూర్తి భిన్నంగా ఉండాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ 2020 నాటి మార్గదర్శకాల్లోని ఒక పుట ఇది
ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేయాలో పేర్కొంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏటా మార్గదర్శకాలను వెలువరిస్తూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించిన 2020 నాటి కేంద్ర మార్గదర్శకాలను ‘బురుజు’ పరిశీలించగా క్షేత్ర సహాయకుడి విధులు పంచాయతీ కార్యదర్శి విధులకు పూర్తి భిన్నంగా ఉండాలని దానిలో పొందుపర్చివుంది. అంటే.. క్షేత్ర సహాయకుడి విధులను పంచాయతీ కార్యదర్శికి అప్పగించరాదన్నది ఆ నిబంధన సారాంశం. క్షేత్ర సహాయకుడికి గల 14 రకాల బాధ్యతలను మార్గదర్శకాల్లో వివరించింది. ఇన్ని ప్రధాన విధులను నిర్వహించాల్సివుంటుంది కనుకనే ఒక్కో గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున వారిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది.
కూలీల కనీస వేతనాన్ని కేంద్రం ఏటా పెంచుతుంది. వారికి పనులను చూపించే క్షేత్ర సహాయకులకు కూడా ఏటా వేతనాలను పెంచాల్సిన అవసరం ఉంది కదా?
తెలంగాణలోని గ్రామ పంచాయతీల సంఖ్య 12,767కి చేరినందున అంత మంది క్షేత్ర సహాయకులు రాష్ట్రంలో ఉండి తీరాలి. అలా కాకుండా కేవలం 7040 మందికే అన్ని పంచాయతీలను అప్పగించి.. అక్కడితో ఆగకుండా వారు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యేలా 2020, ఫిబ్రవరి 28న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఉత్తర్వును ఇచ్చింది. కూలీలకు కల్పించిన పనిదినాల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే వేతనం, ఉద్యోగం కొనసాగింపు ఉంటాయని చెప్పే ఆ ఉత్తర్వు ఎవరికైనా ఆవేదన కలిగిస్తుంది. పని దినాలు తక్కువైన వారు తమకు ఉద్యోగం ఇష్టంలేదని భావించినట్లైతే దరఖాస్తును పెట్టుకోవాలని, వారిని డీఆర్డీవో తొలగిస్తారని వంటి బెదిరింపు ధోరణితో కూడిన ఉత్వర్వును రద్దు చేయాలని కోరటంలో ఎటువంటి తప్పు లేకున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా.. 29 నెలల పాటు వారిని విధులకు రాకుండా చేసింది. గత కొంత కాలంగా దేశం మొత్తం మీద అత్యధిక ద్రవ్యోల్భణం ( ధరల పెరుగుదల) తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతోంది. అటువంటి పరిస్థితుల్లో.. ఉపాధిని కోల్పోయిన క్షేత్ర సహాయకుల కుటుంబాలు ఎంతటి నరకాన్ని చవి చూశాయో అంచనా వేయవచ్చు.
క్షేత్ర సహాయకులను ప్రభుత్వం.. 2022, ఆగస్టులో విధుల్లోకి తిరిగి తీసుకొన్నప్పటికీ వారు ఏదైతే ఉత్తర్వును వ్యతిరేకించారో దాన్ని కొనసాగిస్తూనే ఉంది. మరో వైపు ఇప్పటికీ పలు చోట్ల రెండు, మూడు పంచాయతీలకు కలిపి ఒక క్షేత్ర సహాయకుడు మాత్రమే ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఇటువంటి విధానపరమైన సమస్యలను పరిష్కరించాలని పరిశీలకులు సూచిస్తున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాత్రం.. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం త్వరలో రద్దు చేసే యోచనలో ఉందని అంటున్నారు. ఆయన 2023, ఫిబ్రవరి 11 వ తేదీన శాసన సభలో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని పనులను నిబంధనలకు విరుద్దంగా చేశారంటూ కేంద్రం లేఖలు రాయటం వల్లనే మంత్రి ఇలా ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఉపాధి హామీ పథకం రద్దయ్యే అవకాశం లేనేలేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ఒక వివరణ ఇస్తూ.. కేంద్ర బడ్జెట్టులోని నిధుల హెచ్చుతగ్గులను చూసి పథకంపై విమర్శలు చేయవద్దని, రాష్ట్రాలు ఎంత మేర ఖర్చుచేస్తే అంత మేర మొత్తాన్ని బడ్జెట్టు కేటాయింపుతో సంబంధం లేకుండా మంజూరు చేస్తామని స్పష్టం చేసింది ( ద్రవ్యోల్భణం ఆధారంగా.. తెలంగాణ ఒకటో పీఆర్సీ చెప్పిన కనీస వేతనం రూ.19వేలు.. మూడో భాగం వచ్చేవారం Buruju.com లో.. )