అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసిన రామరాజు, కొమురం భీం పాత్రలు
బురుజు.కాం (Buruju.com) ప్రతినిధి: ప్రచార ఆర్భాటాలతో సినిమాను రక్తి కట్టించటంలో దర్శకుడు రాజమౌళిది అందెవేసిన చేయి. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన ఆర్ ఆర్ ఆర్ (RRR) చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుంది. విప్లవ పథాన నడిచిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం తమ జీవిత కాలంలో కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయారని, ఆ సమయంలో ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుందనేది చిత్రంలో చూపించామని చిత్ర దర్శకులు తొలుత ప్రచారం చేశారు. దీంతో కొమురం భీంకు టోపీని పెట్టి ముస్లీముగా చూపించబోతున్నారంటూ సినిమా విడుదలకు ముందు కొందరు విమర్శించగా.. అల్లూరిని బ్రిటీష్ పోలీసుల దస్తులు వేసుకొన్నట్టుగా చూపించి అవమానించబోతున్నారంటూ ఆయన వారసులు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఇటువంటి పరిణామాలన్నీ సినిమాను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాయి. తీరా సినిమాను చూస్తే అంతకు ముందు ఊదరగొట్టిన ప్రచారానికి, సినిమాలోని కథకు పొంతన ఉండదు.
సినిమాలోని కథ 1920 నాటిదని అందులోని కొన్ని సంభాషణలు, సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. అప్పటికి అల్లూరి సీతారామరాజుకు 22 ఏళ్లు. మన్యంలో అప్పటికి ఆయన ఉద్యమం ఇంకా మొదలు కాలేదు. మరో వైపు.. కొమురం భీం అప్పటికి 19 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. అందువల్ల 1920 నాటికే ఇద్దరూ కలసి ఏవేవో చేశారనే చిత్ర కథకుడి ఊహాగానం సరైందికాదు. సినిమాలో ఎన్టీఆర్ కు కొమురం భీం పేరు, రామ్ చరణ్ కు రామరాజు పేరును పెట్టి ఇద్దరు కలసి దిల్లీలోని బ్రిటీష్ ఉన్నతాధికారి బంగ్లాల్లో బోలెడు సాహసాలను చేసినట్టుగా చూపించారు. అదిలాబాద్ జిల్లాలోని గోండు గ్రామం నుంచి మల్లి అనే ఒక అమ్మాయిని బ్రిటీష్ అధికారులు బలవంతంగా తమ వెంట దిల్లీకి తీసుకెళ్లిపోవటం, ఆ అమ్మాయిని తిరిగి తెచ్చేందుకు ఎన్టీఆర్ దిల్లీకి వెళ్లటం, మరో వైపు.. బ్రిటీష్ వారి ఆయుధాలను కొల్లగొట్టి తిరుగుబాటుదారులకు అందజేయటమే లక్ష్యంగా రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసు అధికారిగా ఎదగటం సినిమా ఇతివృత్తం . చివరికి మల్లిని ఎన్టీఆర్ తిరిగి తమ గ్రామానికి తీసుకురాగా.. కొల్లగొట్టిన ఆయుధాలను విప్లవ వీరులకు రామ్ చరణ్ పంచిపెడతాడు. ఆర్.ఆర్.ఆర్ RRR సినిమా మొత్తం కట్టుకథే అయినప్పటికీ చరిత్రలోని కొన్ని సంఘటనలను, వ్యక్తులను చూపిస్తున్నప్పుడు కొన్ని చారిత్రక సత్యాలను విస్మరించకూడదు. ఆ విషయంలో సినిమా దర్శకులు తప్పటడుగులు వేశారు.
దిల్లీ శివారు అడవుల్లో ఇన్ని జంతువులు ఉండగా స్కాట్ దొర మాత్రం అదిలాబాద్ జిల్లాలోని జంతువుల కోసం వస్తాడు
బ్రిటీష్ వారిపై తిరగబడ్డ సమయంలో రామ్ చరణ్ ఒక్కసారిగా అల్లూరి సీతారామరాజులా మారిపోతాడు. అప్పటికి అంటే.. 1920 నాటికి సీతారామరాజు ఉద్యమమే మొదలు కానందున ఆయన రూపాన్ని రామ్ చరణ్ ఆపాదించుకోవటమనేదే ఉండకూడదు. సినిమాలోని కథ 1924 నాటిది అయ్యింటే కనుక అప్పటికి సీతారామ రాజు గురించి లోకానికి తెలింది కనుక రామ్ చరణ్ కూడా అలా మారినట్టుగా అనుకోవచ్చు. సినిమాలోని ఒక ప్రధాన సంఘటన మాత్రం చిత్రంలోని కథ 1920 నాటిదని తెలియజేస్తుంది. అదేమిటంటే.. స్వాతంత్య్ర సమర యోధుడు లాలా లజపతి రాయ్ ని కలకత్తాలో అరెస్టు చేసినందుకు దిల్లీలో నిరసన తెలుపుతున్న వందల మంది ఆందోళనకారులపై పోలీస్ అధికారైన రామ్ చరణ్ విరుచుకుపడి వారిని చావకొడతాడు. బ్రిటీష్ రికార్డుల ప్రకారం.. లాలా లజపతి రాయ్ అరెస్టయ్యి 1921-23 మధ్య జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన శాసన మండలికి ఎన్నికయ్యారు. అందువల్ల సినిమాలో చెబుతున్న కట్టుకథ ఖచ్చితంగా 1920 నాటిదే. అంతే కాకుండా గూడ్స్ రైలు తగలపడిపోతూ నదిలో పడిపోయిన సందర్భంలో చూపించిన RRR అనే అక్షరాల్లో ఒక అక్షరంపై ఇండియా 1920 అని కూడా పొందుపర్చారు. అంటే సీతారామరాజు అంటే ఎవరికీ తెలియని సమయంలోనే ఆయన రూపాన్ని రామ్ చరణ్ అనుకరించటం, ఇది సీతారామ రాజు కథ అంటూ చిత్ర బృందం సినిమా విడుదలకు ముందు విస్తృతంగా ప్రచారం చేయటం ప్రేక్షకులను తప్పుదారి పట్టించటమే అవుతుంది కదా? ఆయుధాల కోసం ఆనాడు అల్లూరి సీతారామరాజు పలు పోలీస్ స్టేషన్లను కొల్లగొట్టాడు. అంతే తప్ప వాటి కోసం బ్రిటీష్ వారి అడుగులకు మడుగులెత్తలేదు. పైగా ముందుగా సమాచారం ఇచ్చిమరీ దాడులు నిర్వహించాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మాత్రం ఆయుధాల కోసం రామ్ చరణ్ ఏకంగా బ్రిటీష్ పోలీసు ఉన్నతాధికారి స్థాయికి ఎదిగి.. బ్రిటీష్ వారి మన్ననలను పొందటం కోసం అందరినీ చావబాదుతుంటాడు.
చెక్క స్థంభాన్ని సైతం చీల్చేసిన ఈ ముళ్ల కొరడాను రామ్ చరణ్ తన అరచేతితో సాపు చేసినా అతనికేమీ కాదు
చేతిలోకి నాణేలు ఎలా వచ్చాయో? :
గోండు బాలిక మల్లిని బ్రిటీష్ అధికారి స్కాట్ బలవంతంగా తీసుకెళ్లిపోతున్నప్పుడు ఆ వాహనం వెంట ఆమె తల్లి పరిగెట్టుకొంటూ వెళ్లి తన రెండు అర చేతులను వాహనం అద్దాలపై అదుముతుంది. అంతేకాకుండా.. వాహనం ముందుకెళ్లి అది కదలకుండా టైరును చేతులతో పట్టుకొంటుంది. అప్పుడెప్పుడూ ఆమె చేతుల్లో నాణేలు ఉండవు. అమెను అక్కడి నుంచి తొలగించేందుకు బ్రిటీష్ పొలీసు ఆమె తలపై ఒక దుంగతో బలంగా కొట్టినప్పుడు మాత్రం ఆమె చేతి నుంచి అంతకు ముందు బ్రిటీష్ అధికారి ఇచ్చిన రెండు నాణేలు జాలువారతాయి. వందల కోట్లను ఖర్చుపెట్టి సినిమాను తీస్తున్నప్పుడు ఇటువంటి లోపాలంటూ లేకుండా చూసుకోవాలి కదా? ఎన్టీఆర్ చేతులు, కాళ్లు కట్టివేసి కొరడాతో అతన్ని కొడుతున్నప్పుడు బ్రిటీష్ అధికారిణి ఒక ముళ్ల కొరడాను రామ్ చరణ్ కు ఇచ్చి దానితో కొట్టమంటుంది. ఆ కొరడాను తొలుత ఒక చెక్క స్థంభంపై ఝుళిపించగా.. దాని ముళ్లన్నీ స్థంభాన్ని చెక్కుకుంటూ వెళ్తాయి. ఎన్టీఆర్ ను కొట్టినప్పుడూ ఇలాగే అతని వంటిపై గాయాలవుతాయి. కాని రామ్ చరణ్ అదే కొరడాను తన అరచేతి గుప్పెటతో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సాపు చేస్తున్నప్పుడు అతని చేతికి చిన్నగాయం కూడా కాదు. అతని వీపులో చెట్టు కొమ్మ దిగబడిపోయినా, చేతి దండలోకి బుల్లెట్ దూసుకెళ్లినా ఏమీ కాలేదు కనుక ముళ్ల కొరడా కూడా అతని చేతిలో చక్కగా ఒదిగి పోయిందని సరిపెట్టుకోవాల్సిందే. సినిమా సెట్టింగుల్లో పలు చోట్ల విక్ట్రోలాస్ అనే పేరు గల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఇంత పెద్ద సినిమాకు బోర్డులపై రాయటానికి వేరే పేర్లే కరవైపోయాయా? కొన్ని సన్నివేశాల్లో కొన్ని చెట్ల ఆకులు గాలికి విపరీతంగా ఊగుతుంటే.. అక్కడే గల మరికొన్ని చెట్ల ఆకుల్లో అసలు కదలికే ఉండదు. దిల్లీలోని బ్రిటీష్ వారి ఆయుధాగారంలోని తుపాకులను ఎత్తుకెళ్లి తిరుగుబాటుదారులకు అందజేయటమే ఏకైక లక్ష్యంగా ఎవరికీ ఎటువంటి అనుమానం రాని రీతిలో వ్యవహరించే రామ్ చరణ్.. తరచు తన ప్రేయసికి మాత్రం తన రహస్య సంగతులన్నింటినీ ఉత్తరాల ద్వారా చెప్పేస్తూ ఉంటాడు. ఇలా అతను చెప్పటం వల్లనే అతని రహస్య అజెండా ఏమిటనేది ఎన్టీఆర్ కు తెలుస్తుంది కనుక ఉత్తరాలు రాయటాన్ని మనం తప్పు పట్టకూడదు.
మల్లి తల్లి చేతిలోకి అకస్మాత్తుగా ప్రత్యక్షమైన బ్రిటీష్ నాణేలు ఇవే
బ్రిటీష్ గవర్నర్ స్కాట్ దొర, అతని భార్య , మరో అధికారి ఎడ్వర్డు తమ బలగంతో అదిలాబాద్ జిల్లాలోని గోండు ప్రాంతాలకు వేట కోసం వచ్చిన సందర్భంలోనే మల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిపోతారు. ఆ సమయంలో వారు ఉపయోగించిన వాహనాలకు దిల్లీ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేట్లు ఉంటాయి. అంటే నేరుగా దీల్లీ నుంచి వారంతా అవే వాహనాలపై తరలి వచ్చారని అనుకోవాలి. అప్పటికి తెలంగాణ ప్రాంతం బ్రిటీష్ వారి ఆశీస్సులతో నిజాం పాలనలో ఉంది. హైదరాబాదులో బ్రిటీష్ వారి బంగ్లాలు, వాహనాలు ఉండేవి. సినిమాలోని స్కాట్ దొర మాత్రం ఇక్కడి వాహనాలను వాడుకోలేదు. నాటి దిల్లీ శివారు అడవుల్లో ఎన్టీఆర్, అతని అనుచరులు అనేక అటవీ జంతువులను పట్టుకొని వాటిని స్కాట్ దొర నివాసంలోకి వదులు తారు. దిల్లీకి దగ్గరలోనే ఇన్ని జంతువులు అందుబాటులో ఉన్నప్పుడు స్కాట్ దొర తన వేట కోసం ప్రత్యేకంగా అదిలాబాద్ జిల్లా గోండు గ్రామాలకు రావటం ఆటవిడుపు కోసం అయ్యింటుంది. సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు. బ్రిటీష్ రికార్డుల్లో అలాగే ఉంది. శ్రీ కాస్తా ఆ తర్వాత సీతగా మారింది. సినిమాలో రామ్ చరణ్ పేరును రామరాజుగా పేర్కొని ఈ ఒక్క విషయంలోను వాస్తవాన్నే చెప్పారు.