సీతక్కలా.. మంత్రి రోజా ఎప్పటికి ‘థ్యాంక్యూ’ అంటారో?
personBuruju Editor date_range2022-08-24
కాలేజీలో చదివేటప్పుడు ప్రేమించిన అమ్మాయి హిత బోధ కారణంగానే నాగచైతన్య ఆర్థికంగా ఎంతో ఎదుగుతాడు . ఆ తర్వాత ఆమెను మర్చిపోతాడు. తాను చేసిన తప్పును 17 ఏళ్ల తర్వాత తెలుసుకొని ఇండియాకు వచ్చి ఆమెకు థ్యాంక్సు చెప్పి అలౌకిక ఆనందానికి లోనవుతాడు
బురుజు.కాం Buruju.com జీవితంలో మన ఎదుగుదలకు ఎంతో మంది సాయపడుతూ ఉంటారు. అటువంటి వారిలో కొంత మందికి వెంటనే కృతజ్ఞతలు చెబుతాము. మరికొందరిని మనం గుర్తించలేకో.. మరేవో కారణాల వల్లనో విస్మరిస్తాము. అలా విస్మరించిన వారి వద్దకు అనేక ఏళ్ల తర్వాత వెళ్లి ధన్యవాదాలను చెప్పటమే నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ సినిమా ఇతివృత్తం. సున్నితమైన అంశంతో కూడుకొన్నది కావటం వల్ల సినిమా ప్రేక్షకాదరణ పొందలేకపోయినప్పటికీ.. సినిమా చూస్తే మాత్రం మన ఎదుగుదలకు తోడ్పడిన పలానావారిని ఇంతవరకు పట్టించుకోలేదే అనే భావన తప్పక స్పురిస్తుంది. ముఖ్యంగా.. రాజకీయ నాయకులు తమ ఎదుగుదలకు తోడ్పడిన వారిని సైతం ఎడాపెడా తిట్టేయటం ఇటీవల కాలంలో మరీ ఎక్కువయ్యింది. అటువంటి వారు థ్యాంక్యూని చూస్తే వారిలో కొంతవరకైనా మార్పు రావచ్చు. అమెజాన్ ప్రైమ్ లో ఇది అందుబాటులో ఉంది.
వివాహానికి బదులు సహజీవనమనే కొత్త ఒరవడిని సినిమాలో చూపించారు. అలా వచ్చిన అమ్మాయిని సైతం అహంభావంతో దూరం చేసుకొని.. ఆ తర్వాత ఆమెకు థ్యాంక్సు చెప్పినప్పుడు హీరో ఎంతో భావోద్వేగానికి లోనవుతాడు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణంగానే రాజకీయాల్లోకి రాగలిగారనేది చరిత్ర ఎరిగిన సత్యం. దాదాపు 22 ఏళ్ల క్రితం ఆమె మొట్టమొదటి సారిగా హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వచ్చి పార్టీ విరాళంగా కొంత మొత్తాన్ని చంద్రబాబుకు చెక్కు రూపంలో అందజేయంతో ఆమె ప్రస్తానం మొదలయ్యింది. అటువంటి రోజా.. వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన తర్వాత చంద్రబాబుపైన, తెలుగుదేశంపైన చేస్తున్న విమర్శలు.. ఆమె ప్రస్తానం గురించి తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మంత్రి, ఎమ్మెల్యే పదవులు శాస్వతం కావు. పార్టీలు మారినప్పుడు కొత్త పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా మసలు కోవటంలో తప్పు లేకున్నప్పటికీ.. పాత పార్టీలోని తమకు చేయూత ఇచ్చిన వారిని సైతం తూర్పారబెట్టటం మాత్రం సరైన విధానంకాదు. ఇంకా మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ వంటి వారెందరో ఇదే కోవలోకి వస్తారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి . ఒకప్పటి మంత్రి రఘువీరారెడ్డి మాదిరిగా వయస్సు మళ్లి.. రాజకీయాలపై ఏవగింపు కలిగిన తర్వాతనైనా ఇటువంటి వారిలో తప్పక మార్పు వస్తుంది. అప్పటి వరకు ఆగకుండా ఇప్పుడే కృతజ్ఞతా భావాన్ని కనబరిస్తే అది వారి పెద్ద మనస్సును చాటుతుంది.
కృతజ్ఞతా భావం గలవారికి సేవా భావం సైతం పుష్కలంగా ఉంటుంది. ఆ రెంటి మేళవింపుతో ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉండే తెలంగాణలోని ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క.. ప్రతి ఏటా చంద్రబాబుకు థ్యాంక్సు చెబుతారు
ఇటువంటి కృతజ్ఞత విషయంలో తెలంగాణతోని ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కను మిగతావారు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆమె ఒకప్పుడు నక్సలైట్ల దళ కమాండరుగా ఉండేవారు. జనజీవన శ్రవంతిలో కలిసిన తర్వాత చంద్రబాటు ఆమెను పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్యేను చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో సీతక్క కాంగ్రెసులోకి వెళ్లి ప్రస్తుతం ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ తన రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు కారకులని సగర్వంగా చెబుతారు. అంతేకాదు.. ఏటా రాఖీ పౌర్ణిమ రోజున చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన చేతికి రాఖీని కడతారు. ఇలా వెళ్లటాన్ని అత్యధిక మంది హర్షిస్తుంటారు. మొత్తంమీద థ్యాంక్యూ Thank you సినిమా ఇప్పుడు మన సెల్ లోను అందుబాటులో ఉన్నందున ఒక సారి దానిని చూసి.. మన ఎదుగుదలకు ఎవరెవరు కారకులో గుర్తుకు తెచ్చుకొని వారిలో సజీవంగా ఉన్నవారికి థ్యాంక్సు చెబుదాం. ఒక వేళ వారు ఇప్పటికే మృతి చెంది ఉంటే వారి కుటుంబ సభ్యులకైనా కృతజ్ఞతాభి వందనాలు తెలియజేద్దాం. పెద్ద హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ సర్వర్లను సైతం ఎక్స్క్యుజ్ మి ( నన్ను మన్నించు) అని పిలిచి.. చివరిలో థ్యాంక్యూ అని కూడా చెబుతాం. ఒక్కడ ఉండే ఒక అరగంట, గంట సమాయానికే ఇంతలా ధన్యవాదాలు తెలిపే మనం.. మన ఎదుగుదలకు తోడ్పడినవారిని మాత్రం ఎందుకు పట్టించుకోమో ఒక సారి ఆలోచిస్తే వెంటనే మనస్సు పరిమళించటం మొదలవుతుంది.