రాచకొండ నుంచి శ్రీనాథుడు తీసుకెళ్లిన కత్తి.. ఇప్పుడెక్కడ? (నాలుగో భాగం)
personBuruju Editor date_range2022-11-02
దాదాపుగా క్రీ.శ.1390లో కవి సార్వభౌముడు శ్రీనాథుడిని తొలుత రాచకొండలోను, ఆర్వాత దేవరకొండలోను నాటి ప్రభువులు సత్కరించి.. అతను అడిగిన రాజమహేంద్రవరం రెడ్డి రాజుల కత్తిని కానుకగా ఇచ్చి పంపారు
బురుజు.కాం Buruju.com ( హైదరాబాదుకు దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో గల రాచకొండ.. Rachakonda ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన రేచర్ల పద్మనాయకుల బహ్మాండమైన రాజధాని. అక్కడ కొండపైన శిధిలమైన కోట, దిగువన తుప్పల మాటున ఒదిగిపోయిన ఆలయాలు, మండపాలు, శిల్పాలు.. ఇలా ఎన్నెన్నో అక్కడ కనిపిస్తాయి. వీటిని అభివృద్ధి పరిస్తే కర్ణాటకలోని శ్రీకృష్ణ దేవరాయుల రాజధానైన హంపీ విజయనరం అంతటి పర్యాటక ఖ్యాతి లభిస్తుందని పేర్కొంటూ.. సరికొత్త విషయాలతో Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది నాలుగోవది ) భాగవత రచయిత బమ్మెర పోతన.. రాచకొండలో ఉంటూ భోగినీ దండకాన్ని రాయగా.. ప్రఖ్యాత కవి శ్రీనాథుడు ఏకంగా ఇక్కడ ఒక అతి ముఖ్యమైన రాచకార్యాన్ని చక్కపెట్టి.. యుద్ధంలో రాజమహేంద్రవరం రెడ్డి రాజులు కోల్పోయిన ఖడ్గాన్ని వెనక్కి తీసుకెళ్లగలిగాడు. ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొన్న ఆ కత్తి.. ఏదైనా మ్యూజియానికి చేరిందా? లేక కాలగర్భంలో కలసిపోయిందా? పరిశోధకులు తేల్చాలి.
నాటి రాజుల కత్తులు ఇలాగే ఉండేవి
దాదాపు 630 ఏళ్ల క్రితం రాజమహేంద్రవరం రెడ్డి రాజైన నందికంత పోతరాజును రేచర్ల లింగమనీడు ఓడించి విజయానికి చిహ్నంగా అతని కత్తిని తీసుకొచ్చాడు. ఖడ్గం తమ శత్రువులైన రేచెర్ల రాజుల వద్ద ఉండటం తమ పౌరుషానికి మచ్చగా రాజమహేంద్రవరం రెడ్డి రాజులు..భావించారు. వారి ఆస్థాన కవైన శ్రీనాథుడు.. తన సాహిత్య ప్రతిభతో దానిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్వీకరించి.. ఆ పనిని దిగ్విజయంగా పూర్తిచేశాడు.
శ్రీనాథుడు.. కత్తిని తీసుకెళ్లిన దేవరకొండ కోట
శ్రీనాథుడు రాచకొండను సందర్శించి అనంతరం అక్కడికి దగ్గరలో గల దేవరకొండ కోట నుంచి కత్తిని తీసుకెళ్లాడు. అప్పట్లో దేవర కొండలో రేచర్ల కుటుంబానికే చెందిన లింగమనీడు రాజుగా ఉండేవాడు. అతను గొప్ప ధైర్య శౌర్యాలున్న వీరుడని అతని విజయాలపై వెలుగోటివారి వంశావళిలో పెద్ద సీసమాలిక ఉందని డా.బి.ఎస్.ఎల్. హనుంతరావు తన ‘ఆంధ్రుల చరిత్ర’లో పేర్కొన్నారు. శ్రీనాథుడు తొలుత రాచకొండ కోటలో సత్కారం పొంది, అక్కడ మంతనాల అనంతరం దేవరకొండ కోట నుంచి కత్తిని వెంట తీసుకెళ్లినట్టు ప్రఖ్యాత చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తన ‘రెడ్డి రాజుల చరిత్ర’లో నిర్ధారించారు. పోతన క్రీ.శ 1430లో భోగినీ దండకం రాయగా.. శ్రీనాథుడు అంతకంటే ముందే క్రీ.శ 1390 లో రాచకొండను సందర్శించారని చరిత్రకారులు సంగనభట్ట నరసయ్య అంచనా వేశారు.
ఆనాడు రాచకొండ కోటలోకి శ్రీనాథుడు వెళ్లిన మార్గంలో ఇప్పుడు ఒక యువతి ట్రెక్కింగ్ కోసం వెళ్తున్న చిత్రం
నాటి రాచకొండ రాజ్యంలో.. పశుపతి నాగనాథుడు, అయ్యలార్యుడు, గౌరన, కొరవి గోపరాజు వంటి కవులు పలు గ్రంధాలను రచించారు. రాచకొండ ప్రభువు.. రెండవ సింగ భూపాలుడు రచించిన ‘రత్న పాంచాలిక’ అనే నాటకాన్ని రాచకొండ మైలారదేవుని ఉత్సవాల్లో ప్రదర్శించేవారు. రాచకొండలో మిగతా కళలతో పాటు చిత్రలేఖనమూ ఆనాడు విరాజిల్లింది. ఆలయాల్లో శిల్పాలతో పాటు గోడలపైన, పైకప్పులపైన చిత్రకారులు గీసిన రంగుల చిత్రాలు ఉండేవి. శిధిలావస్థలో ఉన్న అటువంటి చిత్రాలను ఏనుగుల ద్వారం వైపుగల పైకప్పుపై నేటికీ చూడొచ్చు. చరిత్ర పుటల్లోను, శాసనాల్లోను లిఖించి ఉన్న అంశాల ఆధారంగా రాచకొండలో పరిశోధనలు చేపట్టే యంత్రాగాన్ని ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే అద్భుత విషయాలు బయటపడతాయి. శ్రీనాథుడు తన వెంట తీసుకెళ్లిన కత్తి ఆచూకీ సైతం లభించొచ్చు ( అయిదో భాగం వచ్చేవారం)