ముఖ్యమంత్రి చిత్ర పటానికి.. సెర్ప్ ఉద్యోగులతో పాటు మంత్రి క్షీరాభిషేకం !
personBuruju Editor date_range2023-02-06
సెర్ఫ్ ఉద్యోగులతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న చిత్రం
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని దారిద్య్ర నిర్మూలన సంస్థ ( సెర్ప్ ) ఉద్యోగులకు ప్రభుత్వం పే స్కేళ్లను అమలు చేయాలని నిర్ణయించటం.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి యర్రబెల్లి దయాకరరావుకూ షంతోషాన్ని ఇచ్చింది. అందుకే.. సెర్ప్ ఉద్యోగులతో పాటుగా ఆయన కూడా తన నివాసంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతనాలు గణనీయంగా పెరగనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఇంతకు ముందటి ప్రభుత్వాలు సెర్ప్ ఉద్యోగులను వాడుకొన్నాయే తప్ప వారి వినతులను ఎప్పుడూ పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వంలోనే వారికి పే స్కేళ్లు వర్తించబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. సెర్ప్ ఉద్యోగుల తరపున ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును సత్కరించి.. ధన్యవాదాలను తెలుపుతున్న ఉద్యోగులు
సెర్ప్ ఉద్యోగుల సంఘాల ఐకాస నేతలు.. మంగళవారం.. హైదరాబాదులోని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నివాసానికి వెళ్లి ఆయన్ని శాలువా, పూల మొక్కతో సన్మానించారు. అనంతరం అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి వారు పాలాభిషేకాన్ని నిర్వహించారు. దారిద్య్ర నిర్మూలన పథకాల విజయవంతానికి శ్రమిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి.. ఇతర ఉద్యోగులకు మాదిరిగా వేతనాలను స్థిరీకరించాలని నిర్ణయించటం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పే స్కేళ్ల కోసం 2023-24 బడ్జెట్ లో నిధులను కేటాయించినందుకు ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసి ధన్యవాదాలు తెలుపుతున్న సెర్ప్ ఐకాస ప్రతినిధులు. చిత్రంలో టీఎన్జీవో నాయకులు కూడా ఉన్నారు
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును కలిసిన వారిలో.. సెర్ప్ ఉద్యోగుల సంఘాల ఐకాస నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, నరసయ్య, సుదర్శన్, వెంకట్, సురేఖ, సుభాష్, జానయ్య, గిరి, మధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. అంతకు ముందు వీరు.. టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్ ల ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలసి పే స్కేళ్లను వర్తింపజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.