ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల తొలగింపు వల్లనే ఇప్పుడీ అనర్థాలు?
personBuruju Editor date_range2023-02-08
హైదరాబాదులో.. 2023, ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించిన ఉపాధి హామీ పథకం 8వ కౌన్సిల్ సమావేశంలో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని ఉపాధి హామీ పథకం పనులను దగ్గరుండి చేయించే క్షేత్ర సహాయకులను ప్రభుత్వం ఏకంగా 29 నెలల పాటు విధుల నుంచి తొలగించటం వల్లనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని ప్రత్యక నిబంధనలను అమలు చేయటానికి దారితీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర సహాయకులు విధుల్లో లేని సమయంలో ఆయా పనులను పర్యవేక్షించేవారు కొరవడి, వాటిలో నాణ్యత లోపించటానికి ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మాత్రం.. కేంద్రం తెలంగాణపై కక్షకట్టి ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఆంక్షలను అమలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. మరో వైపు- క్షేత్ర సహాయకుల ప్రస్తుత జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. వారికి 2020 పీఆర్సీ ప్రకారం 30 శాతం మేర వేతనాలను ప్రభుత్వం ఇంత వరకు పెంచలేదు. పథకం అమల్లో కీలక పాత్ర పోషించే క్షేత్ర సహాయకులకు సంబంధించి Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది మొదటిది.
పనులు జరిగే చోట క్షేత్ర సహాయకుడితే కీలక పాత్ర
తెలంగాణలోని గ్రామీణులకు వారి గ్రామ పరిధిలోనే పనులను కల్పించటం ఉపాధి హామీ పథకం లక్ష్యం. పనుల ఖర్చులో సింహ భాగాన్ని కేంద్రమే అందజేస్తుంది. ఇలా ఏడాదికి రూ.3వేల కోట్ల పైగానే రాష్ట్రంలో ఖర్చవుతోంది. రానున్న 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పని దినాలను మంజూరు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా కేంద్రాన్ని కోరింది. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం మొదలు కొని.. శ్మశానాలకు ప్రహారీలు, రోడ్ల పక్క మొక్కల పెంపకం, పొలాల్లో కుంటల తవ్వకం వంటి అనేక రకాల పనులను దగ్గరుండి చేయించేది ఆయా గ్రామాల క్షేత్ర సహాయకులు. కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ 2020, మార్చి నెలలో వీరు సమ్మెకు దిగటంతో వారిని అందరిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించినట్టుగా ప్రకటించింది. అతి కష్టంమీద 29 నెలల తర్వాత 2022, ఆగస్టు నెలలో తిరిగి వారిని విధుల్లోకి తీసుకొంది. వారిని తొలగించిన సమయంలో వారి బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు అప్పగించింది.
తెలంగాణలో దాదాపు ఒక కోటి మంది కూలీలు ఉపాధి హామీ జాబ్ కార్డులను కలిగి ఉన్నారు
ఉపాధి పనులకు పంచాయతీ కార్యదర్శులు పూర్తిగా కొత్త కావటంతో కొన్ని చోట్ల పనుల్లో నాణ్యత లోపించింది. ఇటువంటి నేపథ్యంలోనే కేంద్రం కొన్ని నిబంధనలను కొత్తగా అమల్లోకి తెచ్చి వాటిని పాటిస్తేనే ఇక ముందు నిధులను ఇస్తామంటూ తేల్చి చెప్పింది. ప్రతి రోజు పనిని మొదలు పెట్టటానికి ముందు, పనిని ముగించినప్పుడు దానికి ఫొటోలను తీసి కేంద్రానికి ప్రత్యేక సాఫ్టువేర్ ద్వారా పంపాల్సివుంటుంది. రైతు పొలాల్లో కల్లాల నిర్మాణాలను కేంద్రం తప్పు పట్టింది. కేంద్రం తెలంగాణలో మాత్రమే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు 2023, ఫిబ్రవరి 9వ తేదీన హైదరాబాదులో నిర్వహించిన ఉపాధి హామీ పథకం 8వ కౌన్సిల్ సమావేశంలో విమర్శించారు. పథకాన్ని అత్యధికంగా ఉపయోగించుకొంటున్నామన్న అక్కసూ కేంద్రానికి ఉందని , పలు ఆంక్షలతో పథకాన్ని నిలుపుదల చేసే కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం.. తెలంగాణపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి సారించటానికి కారణం.. ఏకంగా 29 నెలల పాటు ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు విధుల్లో లేక, పనుల్లో నాణ్యత లోపించటమేనని పరిశీలకులు చెబుతున్నారు.
తెలంగాణలో.. పనులు చేసే వారిలో 61 శాతం మంది మహిళలే
గ్రామంలో కోరిన వారందరికీ పనులను కల్పించే క్షేత్ర సహాయకులు 29 నెలల పాటు ఎటువంటి ఉపాధి లేక అలమటించి పోయారు. పలు రకాల సమస్యలు చుట్టు ముట్టటంతో ఇదే వ్యవధిలో వారిలో 123 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. సిబ్బంది బాగోగుల కోసం చాలా కాలం పోరాడుతూ వచ్చిన శ్యామలయ్య వంటి నాయకులు మౌనం వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో విధుల్లో లేనట్టుగా పరిగణించిన 29 నెలలకు సంబంధించి ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా ఉద్యోగులకు ఇవ్వలేదు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పని దినాలను మంజూరు చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతున్నందున అంత పెద్ద సంఖ్యలో పనులను చేయించాల్సిన క్షేత్ర సహాయకులను సంతోష పెట్టటం ప్రభుత్వం బాధ్యత కాదా? ( రెండో పీఆర్సీ వచ్చేస్తున్నా వారి వేతనాలు పెరగలేదు.. రెండో భాగం వచ్చేవారం Buruju.com లో.. )