డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండ్ పై అధికారులతో చర్చిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ రకాల వస్తువులు త్వరలో అంతర్జాతీయ విఫణిలోనూ అందుబాటులోకి రానున్నాయి. వీటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ వేదికలపైనా వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఇక్కడి ఉత్పత్తులు అన్నింటికీ తెలంగాణ ముద్రతో ఒక ప్రత్యేక బ్రాండ్ (పేరు) ఉంటుంది. బ్రాండ్ అనేది ప్రతిష్ఠాత్మకం కనుక ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్య ఇక పరిష్కారమవుతుంది. తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఇటువంటి ప్రతిపాదనలపై తాజాగా చర్చించింది.
సమావేశంలో.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు పచ్చళ్లు, జామ్ లు మొదలుకొని ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తుంటాయి. ఫుడ్ ప్రాసెంసింగ్ కేంద్రాలను సైతం కొన్ని సంఘాలు నిర్వహిస్తున్నాయి. వీరి ఉత్పత్తులకు ప్రభుత్వం తరపున ఒక పేరు అంటూ ఉంటే వాటిని వినియోగదారులు విరివిగా కొనగలుగుతారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యి కామన్ బ్రాండ్ విషయంపై ప్రధానంగా చర్చించారు. సెర్ప్ సీఈవో సందీప్ సుల్తానియా, గ్రామీణాభివృద్ధి శాఖ డైరక్టర్ హనుమంతరావు, సెర్ప్ అధికారులు రజిత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
వివిధ రకాల వస్తువులను ఆన్ లైన్ ద్వారా అందజేసే ఫ్లిప్ కార్ట్ సంస్థతో సెర్ప్ ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకొంది. అమెజాన్ తదితర ఇతర పెద్ద సంస్థలతోను ఒప్పందాలను కుదుర్చుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్ ఉండాలని, ఇటువంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పుడు అమ్మకాలు బాగా పెరిగి, డ్వాక్రా గ్రూపులకు మంచి లాభాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వస్తువులు సులువుగా అంతర్జాతీయ మార్కెట్టులో అమ్ముడయ్యేలా, ప్రజలకు స్వల్పకాలంలోనే పేరు సుపరిచితం అయ్యేలా బ్రాండ్ ఉండాలని మంత్రి సూచించారు. బ్రాండుకు సంబంధించి వివిధ రకాల పేర్లను పరిశీలించాలని, వాటిలో ఉత్తమమైనవాటిని ముఖ్యమంత్రికి తెలిపి, ఆయన అంగీకారం అనంతరం ఆ పేరును ప్రకటించాలని అన్నారు. బ్రాండుకు తెలంగాణ ముద్ర ఉండాలన్నారు. ఇప్పటికే మహిళా సంఘాల అభివృద్ధి లోను, పొదుపు లోను దేశంలో తెలంగాణాయే ప్రధమ స్థానంలో ఉందని, వస్తువుల విక్రయంలోను ఇక అటువంటి ప్రగతినే కనబర్చాలని మంత్రి సూచించారు.