బురుజు.కాం Buruju.com : కల్లుగీత కుటుంబం నుంచి వచ్చి.. రాజ్య స్థాపన దశ వరకు వెళ్లగలిగిన సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిలను.. తెలంగాణ ప్రభుత్వం ఇక ఏటా అధికారికంగా నిర్వహించనుంది. పాపన్న జయంతిని ఆగస్టు 18వ తేదీన, వర్ధంతిని ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యక్రమాలుగా చేపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలా నిర్వహించతలపెట్టటం సంతోషించతగ్గ పరిణామమే అయినప్పటికీ.. నిర్ణయాన్ని తీసుకొన్న సందర్భం మాత్రం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. సంబంధిత దస్త్రం ఆగమేఘాల మీద కదిలినట్టు తెలుస్తోంది.
సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాల్సివుందంటూ తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ 2022, అక్టోబరు 17వ తేదీన తమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఒక దస్త్రాన్ని అందజేసింది. ఆ దస్త్రం ఆధారంగా అక్టోబరు 25వ తేదీన ముఖ్యకార్యదర్శి నుంచి ముఖ్యమంత్రికి ఒక నివేదిక వెళ్లగా.. అక్కడ ఆమోదముద్ర లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. అక్టోబరు 29వ తేదీన జీవోఆర్టీ నెంబరు 2049 ద్వారా ఉత్తర్వులను వెలువరించారు. ప్రస్తుతం ఉప ఎన్నకలు జరుగుతున్న నల్గొండ జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎక్కువగా ఉండటం విశేషం. ఏదేమైనా.. పాపన్న జయంతి, వర్ధంతిలకు ప్రభుత్వమే అధికారికంగా తేదీలను ఖరారు చేసింది కనుక.. ఆ రెండు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలను నిర్వహించేందుకు వీలవుతుంది. బీసీ సంక్షేమ శాఖ ఆయా కార్యక్రమాలకు నిధులను సమకూర్చే అవకాశం ఉంటుంది.