ఆరోగ్య తెలంగాణ కోసం శ్రమిస్తున్న ‘ఆశా’లకు.. నెలవారీ జీతమేది?
personBuruju Editor date_range2023-02-15
వైద్య రంగంలో అన్ని రకాల పనుల్లోను ఆశా కార్యకర్తల సేవలు ఉండాల్సిందే
బురుజు.కాం Buruju.com : ప్రభుత్వం తరపున పని చేసే ప్రతి వారికి ఒక జీతమంటూ ఉంటుంది. తెలంగాణలో పేద ప్రజానీకాన్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆరోగ్య సేవలు అందించే ఆశా వర్కర్లు మాత్రం స్థిరమైన జీతమంటూ లేకుండా కేవలం ప్రోత్సాహకాలు, పారితోషకాలతో 18 ఏళ్లగా పనిచేస్తుండటం విచిత్రం. కనీసం నెలకు రూ.పది వేలనైనా వేతనంగా ఇవ్వండంటూ వారు చేస్తున్న విజ్ఞప్తి.. పూర్తిగా న్యాయ సమ్మతం. అయినప్పటికీ.. తెలంగాణ సర్కారు మనస్సు కరగక పోతుండటంతో వందలాది మంది ఆశా వర్కర్లు మరో సారి రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద వారంతా ధర్నా నిర్వహించి తమ కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం కంటివెలుగు, కుష్టు వ్యాది సర్వే వంటి ఎన్నో కార్యక్రమాలను ఆశా వర్కర్లతోనే చేయిస్తున్న నేపథ్యంలోనైనా ప్రభుత్వం వెంటనే వారి మొరను వినాల్సిన అవసరం ఉంది కదా?
తమ కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలంటూ.. 2023, ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద నినదిస్తున్న తెలంగాణ ఆశా కార్యకర్తలు
తెలంగాణలోని వైద్య రంగంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది ఆశాలు నిత్యం పలు రకాల విధులను గ్రామాల్లోను, పట్టణాల్లోను నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్థిరమైన వేతనమంటూ ఇవ్వటంలేదు. ఇలా.. ఒక వేతనమంటూ లేనందున ఈఎస్ఐ, ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత వంటివేవీ వీరికి అమలు కావటంలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం 106 రోజుల పాటు సమ్మె చేయగా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. 2017, మే 7వ తేదీన హైదరాబాదులోని ప్రగతి భవన్ లో.. వారితో సమావేశాన్ని నిర్వహించి నెలవారి రూ.6వేలను వేతనంగా ఇస్తామని ప్రకటించినా అదీ కార్య రూపం దాల్చలేదు. తాత్కాలికంగా.. ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా రూ.10వేలను ఇవ్వాలంటూ అడుగుతున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంలేదు. ధరల పెరుగుదల (ద్రవ్యోల్భణం) రేటు దేశం మొత్తం మీద తెలంగాణలోనే అత్యధికంగా ఉంటున్నందుకైనా ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం కనికరం చూపించాలి కదా? రోజు వారి వివరాలను రాయాల్సిన రిజిస్టర్లను సైతం ఆశా వర్కర్లే కొనుక్కోవాల్సివస్తుండటం సముచితంకాదు.
వేదికపై ఆశా వర్కర్స్ యూనియన్ నాయకుల సంఘీభావం
తెలంగాణ తాజా ఎన్నికల బడ్జెట్టులోనూ తమ ప్రస్తావన లేకపోవటంతో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2023, ఫిబ్రవరి 16వ తేదీన ఇందిరా పార్కువద్ద వందలాది మంది భేటీ అయ్యారు. జీతమేకాదు.. వారికి ఇవ్వాల్సిన కొన్ని పారితోషకాలను సైతం ప్రభుత్వం ఎగ్గొడుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, కార్యదర్శి ఎం. వెంకటేష్, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి తదితరులు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. పెరిగిన పని భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తమకు నెలకు రూ.26వేలు వేతనంగా ఇవ్వాలని ఆశాలు కోరారు. దీనితో పాటు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సదుపాయం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
నిర్ణీత జీతమంటూ లేని వీరు.. మారు మూల గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు ఇలా పెద్ద సంఖ్యలో వచ్చారంటే వారు ఎన్నో కష్టాల్లో ఉన్నట్టేనని ప్రభుత్వం గుర్తించాలి కదా?
వారి.. మరికొన్ని విజ్ఞప్తులు ఇలా ఉన్నాయి.. ‘‘ జనవరి నెల నుంచి అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి అదనంగా సొమ్మును చెల్లించాలి. 2022, డిసెంబరు 6వ తేదీ నుంచి నిర్వహించిన కుష్టు సర్వేకు సైతం పారితోషకాలను ఇవ్వాల్సివుంది. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ భత్యం నెలకు రూ.1,000 చొప్పున 16 నెలల బకాయిలను వెంటనే అందజేయాలి. 32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వం ముద్రించి సరఫరా చేయాలి. యూనిఫారాలను సమకూర్చాలి. జిల్లా ఆసుపత్రుల్లో రెస్టు రూములను ఏర్పాటు చేయాలి. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి ఇన్ ఛార్జిలకు అదనంగా భత్యం ఇవ్వాలి. ఆశాలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి’’ అని కోరారు. ధర్నా కార్యక్రమంలో ఇంకా.. ఆశా యూనియన్ ప్రతినిధులు పి.గంగమణి, జి.కవిత, ఎం. శ్రీలత, ఎ.సునీత,పద్మ, హేమలత, సాధన, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.