జూన్ నెలా ఓవరుడ్రాఫ్టుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలు!
personBuruju Editor date_range2022-08-24
ఉభయ రాష్ట్రాలు ప్రతి నెలా ఓవరుడ్రాఫ్టు కోసం రిజర్వు బ్యాంకు వద్దకు వెళ్లకతప్పటంలేదు
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాలు జూన్ నెలలోను రిజర్వు బ్యాంకు వద్దకు ఓవరుడ్రాఫ్టుకు వెళ్లక తప్పలేదు. ఇలా జూన్ లో ఓవరుడ్రాఫ్టుకు వెళ్లిన వాటిలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణతో పాటుగా.. జమ్ము కాశ్మీర్, మణిపూర్, నాగాల్యాండ్ మాత్రమే ఉన్నాయి. ఇవి తప్ప మిగతావి ఏవీ ఓవరుడ్రాఫ్టును ఆశ్రయించనేలేదు. తెలుగు రాష్ట్రాలు ఓవరుడ్రాఫ్టుపై ఆధార పడటమే కాకుండా.. ఆ రూపేణా తెచ్చే మొత్తాలు సైతం అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంత్సరం ఆరంభ నెలైన ఏప్రిల్ లోనే తెలంగాణ ఓవరుడ్రాఫ్టుకు వెళ్లగా.. ఆంధ్రప్రదేశ్ మే నుంచి ఇటువంటి ప్రక్రియను మొదలు పెట్టింది.
రాబడులు తక్కువ.. రోజువారీ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు నగదు కొరత ఏర్పడుతుంది. అటువంటప్పుడు ఆర్బీఐలో తొలుత ప్రత్యేక స్వీకరణ నిధి ( ఎస్ డి ఎఫ్ ), చేబదుళ్లు సదుపాయాలను ఉపయోగించుకొని.. అప్పటికీ నిధులు సర్దుబాటు కాకుంటే ఓవరుడ్రాఫ్టును ఆశ్రయిస్తుంటారు. రిజర్వు బ్యాంకు వర్గాల తాజా సమాచారం ప్రకారం.. జూన్ నెలలో తెలంగాణ రూ. 1,200 కోట్లను, ఏపీ రూ. 695 కోట్లను తెచ్చాయి. ఓవరుడ్రాఫ్టును ఎన్ని రోజులపాటు ఉపయోగించుకొంటే అన్ని రోజులకు రిజర్వు బ్యాంకుకు వడ్డీని చెల్లించాల్సివుంటుంది. ఇటువంటి అప్పును తేవటాన్ని ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్రతిష్ఠగా పరిగణించేది.