రాజస్థానులోని కోట పట్టణంలో నివసిస్తున్న అన్సారీ, ఆయన కుటుంబ సభ్యులు
బురుజు.కాం Buruju.com : మన దేశం తరపున పాకిస్తానులో గూఢచారిగా పనిచేసిన మహమ్మద్ అన్సారీకి రూ.10 లక్షలను పరిహారంగా అందజేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అన్సారీ కథ కొంత వరకు.. ‘ సీతారామం’ సినిమాలోని రామ్ పాత్రకు సరిపోతుంది. పాకిస్థానులో రహస్య పని నిమిత్తం వెళ్లి అక్కడి సైన్యానికి చిక్కితే ఇక అటువంటి వారిని భారత సైన్యం పట్టించుకోదంటూ సీతారామం సినిమాలో ఆర్మీ అధికారి ప్రకాశ్ రాజ్ చెప్పినట్టుగానే అన్సారీ కథ కనిపిస్తుంది. రామ్ తరపున అతన్ని ప్రేమించిన సీతామహాలక్ష్మి పోరాడగా.. అన్సారీ మాత్రం సుప్రీం కోర్టు వరకు వెళ్లి తాను గూఢచారినేనని నిరూపించుకోగలిగారు.
సుప్రీం కోర్టు తీర్పుతో 30 ఏళ్ల అన్సారీ పోరాటం ఫలించినట్లయ్యింది
వివిధ దేశాలు తమకు ద్రోహం తలపెట్టే దేశాల్లోని విషయాలను తెలుసుకొనేందుకు గూఢచార కార్యకలాపాలను నిర్వహిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఇటువంటి రహస్య మిషన్ల కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా పంపిస్తారో మాత్రం ఎవరికీ తెలియదు. ఒక వేళ.. ఆయా గూఢచారులు అక్కడి వారికి చిక్కితే.. మిషన్ విఫలం కాకుండా చూసుకోవటం ప్రధానం కనుక వారిని పంపిన దేశాలు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తాయి. ఇటీవల ఒక కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లటం వల్ల రాజస్తానులోని కోట ప్రాంతానికి చెందిన అన్సారీ గూఢచర్యం ఉదంతం మాత్రం బయటకొచ్చింది. తపాల శాఖ ఉద్యోగి అయిన అన్సారీ.. ప్రత్యేక మిషన్ల కోసం పాకిస్తానుకు వెళ్లేవారు. రెండు మిషన్లను దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన.. మూడో మిషను నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఆయన 13 సంవత్సరాల పాటు అక్కడి జైళ్లలో శిక్ష అనుభవించి 1990లో విడుదలయ్యారు.
సీతారామం సినిమాలోని రామ్ , ఇతర పాత్రలు
జైలు శిక్ష అనుభవించి వచ్చిన అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవటానికి తపాల శాఖ తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఆయన 30 ఏళ్ల న్యాయపోరాటం ఫలించి.. 2022, సెప్టెంబరు నెలలో సుప్రీం కోర్టు.. అతనికి రూ.10లక్షలు పరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పింది. అన్సారీ చెప్పేది కట్టుకథ అంటూ కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరలు వాదించినప్పటికీ.. ఆయనకు తపాల శాఖ ఎందువల్ల దీర్గకాలిక సెలవులు ఇచ్చిందీ ఆధారాలను చూపించలేకపోయారు.. ఆయన్ని పాకిస్థానుకు పంపటం నిజమేనని సొలిసిటరు జనరల్ కనుక అంగీకరిస్తే.. భారత్ గూఢచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టుగా పాకిస్తాను అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతుంది. అందువల్లనే అన్సారీ చెప్పేది కట్టుకథ అని కేంద్రం వాదించినట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం అన్సారీ వయస్సు 75 ఏళ్లు. సుప్రీం కోర్టు తీర్పుతో ఆయన దేశ భక్తి అందరికీ తెలిసింది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న అద్భతమైన ‘ సీతారామం’ సినిమా విషయానికి వస్తే.. సైనికుడైన రామ్.. ముష్కరులను మట్టుపెట్టేందుకు పాకిస్థానుకు వెళ్లి అక్కడి సైన్యానికి చిక్కుతాడు. జైలులో చిత్రహింసలు పెట్టి అతన్ని చంపేస్తారు. అతను ఏమయ్యిందీ మన సైనికాధికారులకు తెలిసినప్పటికీ.. వెళ్లింది రహస్య ఆపరేషనుకు కనుక ఏ విషయాన్నీ బయటపెట్టరు. రామ్ బతికి ఉన్నప్పుడు రాసిన ఒక లేఖ 20 ఏళ్ల తర్వాత బయటపడటంతో అతన్ని గొప్ప దేశభక్తుడిగా మన ప్రభుత్వం గుర్తించి సైనిక పురస్కారాన్ని అందజేస్తుంది. అన్సారీ కథ కూడా చాలా వరకు ఇదే మాదిరిగా ఉండటం విశేషం.