కేసీఆర్ మాస్కుతో.. ‘హేపీ బర్త్ డే సార్’ అని అంటున్నా తప్పని అరెస్టు !
personBuruju Editor date_range2023-02-11
స్థానికత ప్రధానాంశంగా పోరాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ కు.. జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే.. తమ స్థానికతనూ గుర్తించాల్సిందిగా కోరుతూ రూపొందించిన బ్యానర్ ఇది
బురుజు.కాం Buruju.com : సమస్యల్ని తెలిపేటప్పుడు.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించటం సహజం. తెలంగాణలోని కొందరు ఉపాధ్యాయులు మాత్రం ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతూనే తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాదులోని అసెంబ్లీ వద్దకు వెళ్లగా పోలీసులు తమదైన పంథాలోనే వ్యవహరించారు. ఉపాధ్యాయుల ముఖాలకు గల కేసీఆర్ రూపం మాస్కులను తొలగించి వారి చేతుల్లోని ప్లకార్డులను లాక్కొని, వారిని పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తరలించారు. కోర్టులో వేసిన కేసు ఏడాదైనా విచారణకు రాక.. ముఖ్యమంత్రికి గోడును వెల్లబోసుకొందామంటే అదీ సాధ్యంకాక.. పాపం ఆ ఉపాధ్యాయలు ఇప్పుడు కళ్ల నీళ్ల పర్యంతమవుతున్నారు.
బడిలో పాఠాలను చెప్పే ఉపాధ్యాయులు ఇలా రోడ్లపైకి వచ్చి.. అరెస్టులకు సైతం సిద్దపడుతున్నారంటే వారికి చాలా పెద్ద సమస్యలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించాలి కదా?
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన జీవో 317 వివాదాస్పదంగా మారింది. స్థానికతను కొత్త జిల్లాలకు అనుగుణంగా గుర్తించకుండా ఎక్కడెక్కడికో బదిలీ చేసేశారంటూ ఉద్యోగులు.. ముఖ్యంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరో వైపు సచివాలయం.. తన ‘విఛక్షణాధికారాలతో’ వెలువరించిన బదిలీల ఉత్తర్వుల వల్ల కొంత మంది సీనియర్లు హైదరాబాదు పరిధిలోని మేడ్చల్ వంటి జిల్లాలకు సులువుగా రాగలిగారు. దీంతో జూనియర్లు వికారాబాద్ వంటి జిల్లాల్లో నియమితులు కావాల్సివచ్చింది. జూనియర్లు ఏ పాతికేళ్ల తర్వాతనో పదవీ విరమణ చేస్తారు కనుక అంతవరకు ఆయా జిల్లాల్లో ఖాళీలంటూ ఏర్పడక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలూ సన్నగిల్లుతాయనే వాదనలు ఉన్నాయి.
సొంత జిల్లాలకు కాకుండా వేరే జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు జీవో 317 బాధిత సంఘాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఏడాది కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ఫిబ్రవరి 17న ఉండటంతో కనీసం ఆ సందర్భంగానైనా సీఎం తమ గోడును వింటారేమోనని వారు భావించారు. తమది అసెంబ్లీ ముట్టడి కాని, దర్నా కాని కాదని, సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పటానికే వస్తున్నాము కనుక తమను అరెస్టు చేయవద్దని ముందుగానే పత్రికా ప్రకటనను సైతం వారు విడుదల చేశారు. ఇందులో భాగంగా.. 2023, ఫిబ్రవరి 11వ తేదీన కొంత మంది ఉపాధ్యాయులు అసెంబ్లీ వద్దకు వెళ్లగా.. పోలీసులు వారినందరిని బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. స్థానికత అంశంతోనే తెలంగాణ ఏర్పాటయ్యిందని, అటువంటి రాష్ట్రంలో ఇప్పుడు తాము స్థానికత కోసం పోరాడవలసి రావటం బాధాకరమని జీవో 317 బాధిత సంఘం అధ్యక్షులు బి.నాగేశ్వరరావు వాపోయారు. ఏ జిల్లా బిడ్డలు ఆ జిల్లాలో పనిచేసుకొనేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ గతంలో అన్నారని, స్థానికతను కోల్పోవటం వల్ల తమ పిల్లల భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.