(బురుజు.కాం): ఆయన ఏ శాఖలో పనిచేసినా అవినీతి, అక్రమాల అంతుచూసే అధికారిగా పేరుపడ్డారు. రిజిస్ట్రేషన్ శాఖలో దూకుడుగా వెళ్తున్నావంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆగ్రహానికీ లోనయ్యి అక్కడి నుంచి ఏ మాత్రం ప్రాధాన్యం ఉండని పట్టుపరిశ్రమల శాఖలోకి బదిలీ శిక్ష వేయించుకొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాదు చుట్టుపక్కల భూ ఆక్రమణలపై ఆయన బ్రహ్మాండమైన 11 నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికి ఆరేళ్లు కావస్తున్నా వాటిపై తెలంగాణ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఆయన తీవ్ర కలత చెందుతున్నారు. పదవీ విరమణ చేసిన మిగతా అధికారుల్లా కాకుండా.. నివేదికల అమలకు ఇప్పటికీ తన వంతు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. తానిచ్చిన నివేదికలు ఏమయ్యాయో తెలియటంలేదంటూ తన తోటి ఐఏఎస్ అధికారుల వద్ద, తనను కలసిన విలేకర్ల వద్ద వాపోతూనే ఉన్నారు. ఆయనే.. తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా. అక్రమాలకు పాల్పడ్డట్టుగా నివేదికల్లో పొందుపర్చిన అధికారుల్లో కొందరు.. ప్రభుత్వం నుంచి పదోన్నతి ఉత్తర్వులను అందుకొంటూ.. పరోక్షంగా ఆయన్నే గెలి చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను ప్రభుత్వానికి చెందిన చాలా భూములు స్వార్ధపరుల పరమయ్యాయి. సీలింగ్ భూములు, భూదాన భూములు, జాగీర్ భూములు, అసైన్డు భూములు.. ఇలా అవీ ఇవీ అని లేకుండా అన్నింటిని రకరకాల పద్దతుల్లో అక్రమార్కులు చేజిక్కించుకొన్నారు. వీటన్నింటి భాగోతాలను నిగ్గుతేలిస్తే ప్రభుత్వానికి తిరిగి కొన్ని భూములు లభించవచ్చని అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అక్రమాలపై అస్త్రాలను సంధించే అధికారిగా పేరుపడ్డ ఐఏఎస్ అధికారి సిన్హా నేతృత్వంలో 2014, డిసెంబరు 5వ తేదీన ఒక కార్యదళాన్ని (టాస్కుఫోర్సు) ఏర్పాటు చేశారు. సిన్హా 2014, మార్చినెలలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతిని పొంది.. టాస్కుఫోర్సు ఏర్పాటు సమయంలో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత సైతం తనకు అక్రమార్కుల భరతం పట్టే అవకాశం లభించిందనే సంతోషంతో తనకు సమకూర్చిన పరిమిత వనరులతోనే బాగా కష్టించి భూ అక్రమణలపై 11 నివేదికలను తయారు చేశారు. అవి తూతూ మంత్రం నివేదికలు కానేకావు. ఎక్కడ ఏ భూమి అన్యాక్రాంతానికి గురైందీ తన నివేదికల్లో పేర్కొని.. రెవెన్యూ శాఖలోని ఎవరెవరు అందుకు బాధ్యులో పేర్లతో సహా వెల్లడించారు. మండల స్థాయి సిబ్బంది మొదలుకొని కలెక్టరేట్లలోని ఉన్నతాధికారుల వరకు అంతా ఒక్కటై సాగించిన భూ దందాలను ఆధారాలతో సహా ఆయన బట్టబయలు చేశారు. ఆయా భూముల్లో తిష్టవేసి ఉన్న స్థిరాస్తి సంస్థలు, ఇతర కంపెనీల పేర్లనూ బయటపెట్టారు. పత్రాలు చాలా వరకు ఉర్దూ, పర్షియన్ భాషల్లో ఉండటంతో ఆరుగురు అనువాదకులను నియమించుకొని వాటి వివరాలను తెలుసుకొన్నారు. అక్రమాలను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి భూ కుంభకోణాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో పేర్కొంటూ కొన్నిసిఫార్సులు చేశారు. ఇలా ఆయన ఒక దాని తర్వాత ఒకటిగా 2016, జూలై మొదలుకొని డిసెంబరు వరకు 11 నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు.
వాటిలో ఒక నివేదిక.. రాజధాని శివారు సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు ప్రాంతానికి చెందింది. త్వరలో ఐటీ పార్కుల అడ్డాగా మారబోతున్న కొల్లూరులో.. చాలా కాలంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతూ వచ్చాయి. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమితదారులకు సహకరిస్తూ వచ్చారు. అక్కడ సర్వే నెంబరు 191లో 283 ఎకరాలను అధికారగణాలే అక్రమార్కులకు కట్టబెడుతూ వచ్చాయి. అక్కడి 38 ఎకరాలను స్వాతంత్య్ర సమర సమరయోధులు, మాజీ సైనికుల పేర అనర్హులకు ఇచ్చేశారు. ఉన్నతాధికారులకు సమాచారమంటూ ఇవ్వకుండానే క్షేత్ర స్థాయి ఉద్యోగులు భూములను ఇచ్చేస్తూ వచ్చినట్టూ సిన్హా గుర్తించారు. నిరుపేదల కోటాలో కొంత మందికి భూములు ఇచ్చిన అధికారులు.. వాటిని అమ్మేసుకోవచ్చంటూ ఆయా లబ్ధిదారులకు నిరభ్యంతర పత్రాలను అందజేసి అవి సులవుగా చేతులు మారేలా వ్యవహరించారు. ప్రభుత్వ భూములను అక్రమ పద్దతుల్లో పొందిన వారికి మ్యూటేషన్లను చేసిపెట్టారు. అక్కడికి దగ్గరలోని ఉస్మాన్ సాగర్ లోని 195 ఎకరాలోనూ ఇదే పరిస్థితి.
ఇలా మొత్తం 11నివేదికల్లో ఆయన పలు వివరాలను వెల్లడించారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వాటిలో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. .‘‘ తహశీల్దార్లు ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో పనిచేయనివ్వకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రెవెన్యూ పరమైన అంశాలపై ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు తనిఖీలను నిర్వహిస్తుండాలి. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే తక్షణం చర్యలు చేపట్టాలి. నిబంధనలకు విరుద్దంగా అక్రమ కేటాయింపులు చేసిన సందర్భాల్లోని దస్త్రాలను కొందరు ఉద్దేశపూర్వకంగా మాయం చేస్తున్నారు’’.. ఇలా పలు అంశాలను తన నివేదికల్లో పొందుపర్చారు.
నివేదికలను అందజేసిన తొలినాళ్లలో.. వాటిలోని అంశాలపై అప్పటి భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ)తో మాట్లాడవలసిందిగా సచివాలయం నుంచి సిన్హాకు వర్తమానం అందింది. తన కంటే బాగా జూనియర్ అయిన సీసీఎల్ఏ వద్దకు వెళ్లి.. తాను బయట పెట్టిన అక్రమాలపై ఆయనకు వివరించటం ఆయనకు సహజంగానే మనస్కరించలేదు. ప్రభుత్వం కనుక అదేశాలను ఇచ్చుంటే సీసీఎల్ఏయే సిన్హా వద్దకు వెళ్లి మాట్లాడి ఉండేవారు. నివేదికలను సచివాలయానికి పంపితే వాటి అధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టటానికి బదులు సీసీఎల్ఏతో మాట్లాడాలంటూ అన్నప్పుడే విషయం సిన్హాకు కొంతవరకు బోధపడింది. ఆయనకు కేటాయించిన చిన్నగది కూడా నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయం గల భవనంలోనే ఉండేది. ఆఖరి నివేదికను అందజేసిన 2016, డిసెంబరులోనే టాస్కుఫోర్సుకు ప్రభుత్వం తొలుత ఇచ్చిన రెండేళ్ల గడువు ముగిసిపోయింది. ప్రభుత్వం దానికి ఇంకా గడువును కనుక పెంచి ఉంటే మరిన్ని భూ ఆక్రమణలపై నివేదికలు తయారై ఉండేవి. మరొకరైతే టాస్కుఫోర్సు గడువు ముగియటంతోనే నివేదికల గురుంచి మర్చిపోయి ఉండేవారు. సిన్హా మాత్రం అలా కాదు. భూ కుంభకోణాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నా అక్రమాలకు పాల్పడ్డవారిపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటంలేదని మదన పడుతున్నారు. సిన్హా నివేదికలు కొంత కాలంపాటు రహస్యంగానే ఉంటూ వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో క్రమేనా కొన్ని నివేదికలు బయటకొచ్చాయి.
కొన్ని నివేదికల్లోని విషయాలను ‘ఈనాడు’ బహిర్గతపర్చినా ప్రభుత్వ చర్యలు అటుంచి ప్రతిపక్షాల నుంచీ ఎటువంటి అలికిడి లేకపోవటం విశేషం. భూ దందాల్లో అన్నిపార్టీల వారు , ప్రజా ప్రతినిధులు, వారికి చెందిన కంపెనీలు ఉండటమే ఇందుకు కారణం. నివేదికల్లో నిందితులుగా కనిపించే అధికారుల్లో పలువురు ఇప్పుడు ఉన్నత స్థానాలకూ చేరుకోవటమూ చర్యలు అంటూ లేకపోవటానికి మరో కారణం. కొన్ని సందర్భాలో దాటవేట ధోరణికి, కొన్ని వర్గాలవారిని దారికి తెచ్చుకోవటానికి కమిటీల ఏర్పాటు ద్వారా హడావిడి చేయటం పాలకులకు పరిపాటే. చోటు చేసుకొన్న పరిణామాలను బట్టి.. సిన్హా కమిటీ సైతం ఆ కోవలోనిదేననే అనుమానులు లేకపోలేదు. ఇటువంటి పరిణామాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి సిన్హా మాత్రం జీర్జించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సిన్హా మిగతా అందరిలాంటి అధికారి కాదు కాబట్టి. ఉమ్మడి రాష్ట్రం రిజిస్ట్రేషన్ల శాఖకు ఇనస్పెక్టర్ జనరల్ (ఐజీ)గా ఉంటూ నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అక్రమాలను బహిర్గతం చేసిన అధికారి అయన. సబ్ రిజిస్ట్రార్ల సంఘం నాయకులనీ చూడకుండా అక్రమాలకు పాల్పడుతున్నవారిపై కొరడా ఝుళిపిస్తూ వచ్చారు. ఇలా చేయటం అప్పటి సబ్ రిజిస్ట్రార్లకు నచ్చలేదు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సబ్ రిజిస్ట్రార్ల వినతులకు సానుకూలంగా వ్యవహరించి.. సిన్హాను పిలిచి పద్దతిని మార్చుకోవాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు పెరిగిపోయాయని, తాను వాటిని ప్రక్షాలన చేస్తున్నానని సిన్హా సమాధానమిచ్చారు. దీంతో ఆయన్ని రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పట్టుపరిశ్రమల శాఖకు వైఎస్ బదిలీ చేశారు. సిన్హా ముందుకాని, ఆ తర్వాత కాని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను పట్టించుకొన్న ఐజీలంటూ లేకుండా పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ ఇదే పరిస్థితి.