‘బురుజు.కాం (Buruju.com): విదేశాల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు వచ్చే పక్షి జాతులు క్రమేణా తగ్గిపోతున్నాయి. ఇంతకు ముందు వచ్చిన పక్షుల్లోని కొన్ని జాతలు కనిపించటంలేదని ఆయా ప్రాంతీయులు చెబుతుండగా.. జాతులు తగ్గిపోయినట్టుగా సమాచారమేదీ లేదని కేంద్ర పర్యావరణ శాఖ అంటోంది. మరో వైపు.. వలస పక్షులపై సర్వే అంటూ చేయలేదనీ చెబుతోంది. అధ్యయనమంటూ లేనప్పుడు జాతుల సంఖ్య తగ్గలేదని ఎలా చెప్పగలుగుతుందో ఆ ఆశాఖకే తెలియాలి. విదేశాల నుంచి ఆయా సీజన్లలో భారత్ లోని వివిధ రాష్ట్రాలకు పక్షులు వచ్చి కొద్ది రోజుల పాటు ఇక్కడ సేదతీరి వెళ్తుంటాయి. రాష్ట్రాల్లోని చెరువులు, సరస్సులు కలుషితం కానన్నాళ్లు ఇక్కడికి లక్షల సంఖ్యలో వచ్చిన పక్షులను పరిశీలించిన వారు.. అవి 500 జాతులకు పైగానే ఉన్నట్టు అంచనా వేశారు. ప్రతి చోట కాలుష్యం, పరివాహక ప్రాంతాల ఆక్రమణలు, అడ్డు అదుపు లేని వేట.. తదితర కారణాల వల్ల విడిది కోసం వచ్చే జాతుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఇదే విషయంపై ఒక పార్లమెంటు సభ్యుడు కేంద్ర పర్యావరణ శాఖకు ఇటీవల లేఖ రాయగా.. అబ్బే.. అదేం లేదు.. అంటూ ప్రత్యుత్తరమొచ్చింది. భారత్ కు రావాల్సిన పక్షులు ఇతర శీతల దేశాలకు వెళ్లిపోతున్నాయని చెప్పేందుకు ఆధారాలు ఏవీ లేవని ఆ శాఖ పేర్కొంది. ఒకప్పుడు అసంఖ్యాక పక్షులతో అలరాడిన ప్రాంతాలకు వెళ్లి చూస్తే వాటి అగమనం తగ్గిందా? లేదా? అనేది ఇట్టే తెలుస్తుంది. కేంద్రం వాస్తవ పరిస్థితులను వెల్లడించి.. రాష్ట్రాలను అప్రమత్తం చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరు సరస్సుకు ఒకప్పుడు విదేశీ పక్షులు ఇలా వచ్చేవి
పక్షులు ఎక్కువ సేద తీరే ప్రాంతాల పరిరక్షణ కోసం ‘ఆసియా పక్షుల జాతీయ కార్యాచరణ ప్రణాళిక’ ఒకదాన్ని 2018లో కేంద్రం తయారు చేసింది. దీని కింద ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల పనులను 2023లోగా చేపట్టాలనే లక్ష్యాన్ని నిర్ధేశించినా.. దాని కింద ఇంతవరకు చేపట్టిన చర్యలు ఏవనే సమాచారం అందుబాటులో లేనేలేదు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట వద్ద గల నేలపట్టు పక్షుల ఆవాస కేంద్రానికి మునపటి మాదిరిగానే 14 పైగా జాతులు వస్తున్నట్టు అక్కడి అటవీ అధికారులు చెబుతున్నారు. అదే రాష్ట్రంలోని పశ్చిమగోదావరి , కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు సరస్సు చేపల చెరువుల తవ్వకాలతో నిండిపోయిన తర్వాత పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయినట్టు ఎప్పుడో బయటపడింది. అక్కడ పక్షుల ఆవాసాలకు కొన్ని ఏర్పాట్లను చేసినా చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. తెలంగాణకు ఒకప్పుడు శీతాకాలంలో చైనా, సైబేరియా, మంగోలియా, రష్యాల నుంచి , యూరోపియన్ దేశాలనుంచీ పక్షులు వచ్చి వెళ్తుండేవి. వేసవిలో ఆఫ్రికా నుంచి వస్తుండేవి. ఇటువంటి జాతులు 425 నుంచి 427 వరకు ఉండొచ్చని అంచనాలను వేసేవారు. ఇప్పుడు మనుపుడంతటి అలికిడి లేనేలేదు. మూడేళ్లగా వాటి సంఖ్య తగ్గుతున్నట్టు తెలంగాణ బయోడైవర్శిటీ బోర్డు సభ్యులు శ్రీనివాసులు ఇటీవల వెల్లడించారు. హైదరాబాద్ శివారు అమీనుపూర్ చెరువుకు ఒకప్పుడు పెంగివ్విన్ పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల మంజీరా డ్యాం, శామీర్ పేట, ఉస్మానుసాగర్, హిమయత్ సాగర్ ప్రాంతాలకు విదేశీ పక్షుల వలసలు అధికంగా ఉండేవి.