బురుజు.కాం Buruju.com : షిరిడీ సాయి బాబాకు భక్తులు నగదుతో పాటు బంగారు, ఇతర విలువైన ఆభరణాలనూ కానుకలుగా సమర్పించుకొంటూ ఉంటారు. అలా.. ఇంత వరకు అందజేసిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విలువ shiridi sai arnaments,jewellery రూ.122 కోట్లు. ఇవి కాక.. బ్యాంకుల్లో రూ.2,237 కోట్ల మేర డిపాజిట్ల రూపేణా ఉన్నాయి. షిరిడీ సాయి దర్శనానికి భక్తులు నిత్యం దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. తమ ఇష్టదైవానికి గల బంగారు ఆభరణాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వారికి ఉండటం సహజం.
బాబాకు భక్తుల నుంచి కానుకలుగా అందే ఆభరణాలకు విలువ కట్టి రికార్డుల్లో రాసేందుకు ఒక నిపుణుడు ప్రత్యేకంగా ఉంటారు. ఒక వేళ.. ఎదైనా వస్తువుకు విలువను నిర్ధారించటం కష్టంగా ఉంటే దానిని ఒక రూపాయిగా మాత్రమే నమోదు చేస్తారు. ఇలా రికార్డుల్లో నమోదైన వివరాలకు ఏటా ఆడిట్ నిర్వహిస్తారు. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2021, మార్చి నాటికి బాబాకు రూ.92 కోట్ల విలువ గల బంగారు ఆభరణాలు, రూ.16 కోట్ల వెండి వస్తువులు , రూ.10 కోట్ల విలువైన రాళ్లు ఉన్నాయి. ఇంకా బంగారు, వెండి నాణాలు, రాగి, ఇత్తడి వస్తువులూ ఉన్నాయి. ఇలా మొత్తం బంగారు ఆభరణాలు, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.122 కోట్లు.
పదేళ్ల క్రితం బాబాకు గల బంగారు ఆభరణాల విలువ రూ.50 కోట్లు. డిపాజిట్లు అప్పట్లో రూ. 627 కోట్లు ఉండేవి. అంటే.. ఆభరణాల్లో 144 శాతం, డిపాజిట్లలో 256 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది.