కళ్ల ముందే ఒక ఎండిపోయిన సరస్సు మాదిరిగా మారిపోయిన సముద్రం
బురుజు.కాం Buruju.com : ఆస్వాదించేవారికి.. సముద్రపు హోరు నిత్యం ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి హోరు స్థంభించిపోయి.. అసలు సముద్రమే కనిపించకుండా పోతే..? కేరళలోని కోజీకోడ్ జిల్లాలోని వైనంవలప్పు వద్ద గల కోతి బీచ్ kothi beach వద్ద సముద్రం 24 గంటల పాటు కనుమరుగయ్యింది. అక్కడ దాదాపు 200 మీటర్ల పొడవునా.. సముద్రం దాదాపు 50 నుంచి 70 మీటర్ల లోపలకు వెళ్లిపోయింది. సముద్ర అలలు తిరిగి రావటానికి 24 గంటలపైగానే వ్యవధి పట్టింది. సముద్రం ఇలా ఎందుకు వెనక్కి వెళ్లిందో తెలియక ఆ ప్రాంతీయులు ఇప్పటికీ తల్లడిల్లిపోతూనే ఉన్నారు. ఇక్కడి సంఘటన ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది.
24 గంటల తర్వాత సముద్రం క్రమేణా ముందుకు వస్తున్నప్పుడు ప్రజలకు లభిస్తున్న మత్స్య సంపద
కేరళలోని వైనంవలప్పు సముద్ర తీరంలో.. నిత్యం సమీప ప్రాంతాల వారు సేద తీరి వెళ్తుంటారు. 2022, అక్టోబరు 29వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో.. సందర్శకులు చూస్తుండగానే సముద్రం వెనక్కి వెళ్లపోవటం మొదలు పెట్టింది. అలా అది దాదాపు 70 మీటర్ల మేర లోపలకు చొచ్చుకుపోయింది. తీరంలోని కేవలం 200 మీటర్ల నిడివిలో మాత్రమే ఇలా జరిగింది. 200 మీటర్లకు అటూ ఇటూ సముద్రం మామూలుగానే ఉంది. 2004లో సునామీ, 2017లో భారీ తుపాను రావటానికి ముందూ ఇదే విధంగా సముద్రం వెనక్కి మళ్లిపోయివుండటంతో సమీప ప్రాంతాల వారు తీవ్ర ఆందోళన చెందారు.
జిల్లా అధికారులు అక్కడికి చేరుకొని.. అరేబియా సముద్రంలో సునామీ, భూ కంపాలు ఉన్నట్టుగా సంబంధిత శాఖ నుంచి హెచ్చరికలేవీ
వెలువడనందున ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని చెప్పినా.. ఆ రోజు రాత్రంతా ఆ ప్రాంతీయులు కంటిమీద కునుకలేకుండా గడిపారు. మరుసటి రోజు.. అంటే 30వ తేదీ సాయంత్రానికి సముద్రపు నీరు నెమ్మదిగా ముందుకు రావటం మొదలయ్యింది. ఆ సమయంలో అక్కడి వారికి.. పెద్ద సంఖ్యలో చేపలు, ఇతర జలచరాలు లభించాయి. కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకటంతో గాలి దిశమారి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.